బిజినెస్

యుబిఎల్ లాభం రూ. 147 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: లిక్కర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.40 శాతం పెరిగి 147.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో లాభం 122.14 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. ఇక ఆదాయం విషయానికొస్తే 8.59 శాతం వృద్ధితో ఈసారి 1,485.67 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,368.03 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, సంస్థాగత వ్యయం నిరుడుతో పోల్చితే 5.79 శాతం పెరిగింది. ఈ ఏప్రిల్-జూన్‌లో 1,335.97 కోట్ల రూపాయలుగా, గత ఏప్రిల్-జూన్‌లో 1,262.79 కోట్ల రూపాయలుగా ఉంది.
మాల్యాకు యుబిఎల్ ఝలక్
మరోవైపు యుబిఎల్ తమ చైర్మన్ విజయ్ మాల్యాకు ఝలక్ ఇచ్చింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి నడుస్తున్న పన్ను కేసు నేపథ్యంలో మాల్యాకు ఎలాంటి చెల్లింపులు జరపరాదన్న పన్ను శాఖ అధికారుల ఆదేశంతో 1.64 కోట్ల రూపాయల చెల్లింపులను యుబిఎల్ నిలిపివేసింది. మాల్యా పేరును యుబిఎల్ ప్రస్తావించనప్పటికీ, ఆదాయ పన్ను కమిషనర్ (టిడిఎస్) నుంచి ఈ ఏడాది జూన్ 28న వచ్చిన ఆదేశం ప్రకారం ఓ డైరెక్టర్ వేతనాన్ని, అలవెన్సులను, ఇతరత్రా పారితోషికాలను చెల్లించకుండా నిలిపివేశామని ప్రకటించింది. ఈ మొత్తం విలువ 1.64 కోట్ల రూపాయలుగా ఉంటుందని స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు యుబిఎల్ తెలిపింది. అయితే దీనిపై స్పందించేందుకు సంస్థ ప్రతినిధి నిరాకరించారు.
మరోవైపు బెంగళూరులోని ఆదాయ పన్ను కమిషనర్ (అంతర్జాతీయ పన్నులు) నుంచి ఈ ఏడాది మార్చి 11న ఓ ఉత్తర్వును అందుకున్నట్లు యుబిఎల్ తెలిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ట్యాక్స్ డిమాండ్లకు సంబంధించినదే ఈ ఉత్తర్వు అని వివరించింది. మొత్తానికి యజమాని మాల్యాకు యుబిఎల్ భలే షాకిచ్చింది.