బిజినెస్

సింగిల్ డెస్క్‌లో అత్యుత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో అంకుర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ విధానం ఆచరణలో అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కూడా లభించాయి. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న దీనిని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ నెల 21వరకు 11,618 దరఖాస్తులు రాగా, 10,868 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. వివిధ కారణాల వల్ల 534 దరఖాస్తులను తిరస్కరించారు. సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ పరిధిలో 215 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 93 శాతానికి పైగా దరఖాస్తులను పరిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం పరిశ్రమలకు అనేక రాయితీలు ప్రకటించింది. అంతేకాకుండా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన విధానాలను అమలు చేస్తోంది. దేశవిదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించి, ఇక్కడ పరిశ్రమలను స్థాపించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు బహుళజాతి కంపెనీలతో పాటు దేశంలోని ప్రముఖ సంస్థలు అనేకం ముందుకు వచ్చాయి. ఆ కంపెనీలు పారిశ్రామిక అనుమతుల కోసం పలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం ‘సింగిల్ డెస్క్ బ్యూరో’ను ఏర్పాటు చేసింది. దరఖాస్తు అందిన వెంటనే పరిశీలించేందుకు ప్రధానమైన 16 శాఖలను దీనితో అనుసంధానం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించదలిస్తే ప్రభుత్వం నుంచి 22 అనుమతులు పొందవలసి ఉంటుంది. ఈ విధానంలో అతను ఏ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఆ అనుమతుల వ్యవహారాలన్ని సింగిల్ డెస్క్ బ్యూరో అధికారులే చూసుకుంటారు. ఆయా దరఖాస్తులకు సంబంధించి రెవెన్యూ, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ, పర్యావరణం, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులను బ్యూరో అధికారులే సంప్రదిస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందవలసిన అనుమతుల బాధ్యతను ఢిల్లీలోని ఆంధ్రభవన్ అధికారులకు అప్పగిస్తారు. వారు కేంద్ర మంత్రిత్వశాఖల ద్వారా పనులు త్వరితగతిన పూర్తి అవడానికి సహకరిస్తారు. కావల్సిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే అంకుర పరిశ్రమలకు 21 రోజులలో అనుమతులు ఇస్తారు. ఇప్పుడు దానిని 14 రోజులకు తగ్గించారు. ఈ విధంగా 14 రోజులలో పూర్తిగా ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపుల విధానాన్ని కూడా సింగిల్ డెస్క్ పరిధిలోకే తీసుకువచ్చారు. అతి తక్కువ సమయంలోనే కేటాయింపులు జరిగే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) తరపున ప్రపంచ బ్యాంకు 2015 సెప్టెంబర్‌లో జరిపిన ఒక అధ్యయనంలో వ్యాపారం సులభతరంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనువైనదిగా తేలింది.
ఇంధనశాఖకు అత్యధిక దరఖాస్తులు
సింగిల్ డెస్క్ బ్యూరోకు అత్యధికంగా ఇంధన శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఈ రంగంలో మొత్తం 3,807 దరఖాస్తులు రాగా, 3,529 అనుమతించారు. పలు కారణాల వల్ల 240 తిరస్కరించారు. ఆ తరువాత పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ, ఎపి కాలుష్య నియంత్రణ మండలికి ఎక్కువగా వచ్చాయి. ఈ విభాగంలో 3,366 దరఖాస్తులు రాగా, 3,102కు ఆమోదం తెలిపారు. 126 తిరస్కరించారు. పరిశ్రమల శాఖకు 1571 దరఖాస్తులు రాగా, 1507 అనుమతించారు. 51 దరఖాస్తులు తిరస్కరించారు. కొన్ని విభాగాలలో వచ్చిన అన్ని దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, వ్యాట్, సీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వచ్చిన దరఖాస్తులను వంద శాతం పరిష్కరించారు. ఈ ఏడాది జులైలో మొత్తం 998 దరఖాస్తులు రాగా, 949కి అనుమతులు మంజూరు చేశారు. ఆగస్టులో 819 దరఖాస్తులు రాగా, 757కు ఆమోదం తెలిపారు. ఇన్ని దరఖాస్తులకు ఇంత త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విధానంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీల వల్ల దేశవిదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. తద్వారా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.