బిజినెస్

గడువు పెంచేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: రద్దయిన 500, 1,000 రూపాయల నోట్ల మార్పిడికిగాను చేసే డిపాజిట్లకున్న గడువును పెంచే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. ఈ నెల 8వ తేదీ రాత్రి ఈ మేరకు నరేంద్ర మోదీ ప్రకటించగా, డిసెంబర్ 30 వరకు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో రద్దు చేసిన నోట్లను డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువ కలిగిన కొత్త నోట్లను తీసుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వద్ద కావాల్సినంత నగదు నిల్వలున్నాయని రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. చిల్లర సమస్య తలెత్తకుండా 100 నోట్ల సరఫరాను పెంచినట్లు వివరించారు. అయితే నోట్ల మార్పిడికి డిసెంబర్ 30 వరకు విధించిన గడువును పెంచే వీలుందా? అన్న దానికి బదులిస్తూ ఇప్పటికైతే అదేమీ లేదన్నారు. ప్రజలంతా తమ వద్దనున్న పాత 500, 1,000 రూపాయల నోట్లను డిసెంబర్ 30 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ వాణిజ్య, సహకార బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి మూడు వారాలైనా బ్యాంకుల వద్ద ఇప్పటికీ భారీ క్యూలు కనిపిస్తునే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం ఇచ్చిన తాజా వివరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆర్‌బిఐ కేంద్రాల్లోనూ పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నది తెలిసిందే. ఇదిలావుంటే రద్దు నిర్ణయం నాటికి (నవంబర్ 8) చెలామణిలో 1,716.50 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.80 కోట్ల 1,000 రూపాయల నోట్లు ఉన్నాయి. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసినవారికి కొత్త 500, 2,000 రూపాయల నోట్లను అందిస్తుండగా, 500 రూపాయల నోట్ల సరఫరా తొలుత లేకపోవడంతో 2,000 రూపాయల నోట్లతో చిల్లర సమస్య తలెత్తింది. దీంతో కొత్తగా 100 రూపాయల నోట్లనూ ఆర్‌బిఐ ముద్రించడం మొదలు పెట్టినట్లు మంత్రి తెలిపారు. 100 రూపాయల నోట్ల కోసం ఎటిఎమ్‌ల వద్ద బారులు తీరుతున్న జనం పాట్లపైనా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్య సద్దుమణుగుతుందని, ఆర్‌బిఐ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణయాలు చేపడుతోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. పెట్రోల్ బంకులు, ఓలా క్యాబ్‌లు, బిగ్ బజార్లలో నగదు ఉపసంహరణలకు అవకాశం ఇచ్చింది. ఎటిఎమ్ లావాదేవీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై చార్జీలనూ బ్యాంకులు ఎత్తివేశాయి. ఇకపోతే కేంద్రం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్రమార్కులు తమ అవినీతి సంపదను అడ్డదారుల్లో సక్రమంగా మార్చుకునే వీలుండటంతో డిపాజిట్లపై ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించినది విదితమే. రోజుకు 50,000 రూపాయలను మించి డిపాజిట్ చేయరాదని, డిసెంబర్ 30లోగా సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ అయిన మొత్తం 2.50 లక్షల రూపాయలు దాటరాదని, కరెంట్ ఖాతాలో 12.50 లక్షల రూపాయలు మించరాదని స్పష్టం చేసింది. ఈ పరిమితి మీరితే ఆదాయ పన్ను శాఖకు వివరణ ఇచ్చుకోవాల్సిందే. బ్యాంకులూ విధిగా డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖ, ఆర్‌బిఐలకు తెలియపరచాలని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇక నల్లధనంతో బంగారం కొనుగోళ్లు జరుపుతున్నారని గుర్తించిన ఐటి శాఖ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తుండగా, జన్ ధన్ ఖాతాల్లో జమవుతున్న డిపాజిట్లపైనా దృష్టి సారించింది. మరోవైపు స్వచ్చంధంగా తమ అక్రమ సంపద వివరాలను చెబితే 50 శాతం దక్కుతుందని, తామే పట్టుకుంటే 15 శాతమే మిగులుతుందని సోమవారం కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు ప్రతిపాదించింది. కాగా, మాల్స్, దుకాణాదారులు తమ రోజువారి అమ్మకాల ఆదాయాన్ని ఇక బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది. అలాగే చెలామణిలోకి వచ్చిన కొత్త 2,000, 500 రూపాయల నోట్ల డిపాజిట్‌పై వ్యాపారులకు విత్‌డ్రా పరిమితిని పెంచింది. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలపై ఆంక్షలు వచ్చిపడినది తెలిసిందే. అయితే వాటిని తాజాగా ఆర్‌బిఐ సడలించింది. చాలామంది వ్యాపారులు నగదు ఉపసంహరణలపై ఉన్న ఆంక్షలతో డిపాజిట్లు చేయడం లేదని, దీనివల్ల నగదు కొరత వస్తోందని ఆర్‌బిఐ పేర్కొంది. ముఖ్యంగా 100 రూపాయల నోట్లు స్తంభించిపోయాయంది. అయితే ఈ నిర్ణయంతో కొంత వెసులుబాటు లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.