బిజినెస్

విద్యుత్ బకాయలుంటే నిధుల్లో కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 9: పంచాయతీలు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత తప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ బి రామాంజనేయులు హెచ్చరించారు. బకాయిలు లేకుండా సక్రమంగా చెల్లిస్తే నిధులు పూర్తిగా విడుదలవుతాయన్నారు. 2014 డిసెంబర్ వరకు ఉన్న విద్యుత్ బకాయిలను తర్వాత కట్టినప్పటికీ, 2015 జనవరి నుంచి మాత్రం విద్యుత్ బిల్లుల బకాయిలను సక్రమంగా కట్టాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఎల్‌ఇడి బల్బుల వినియోగానికి సంబంధించి సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపిడిఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఇడి వెలుగులు ప్రసరించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వినియోగిస్తున్న బల్బుల వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతోందని, దీంతో బిల్లులు తడిసిమోపెడై భారంగా మారుతోందన్నారు. ఎల్‌ఇడి బల్బుల వినియోగం వల్ల విద్యుత్ ఆదాతోపాటు బిల్లులు కూడా తక్కువ వస్తాయని, దీనివల్ల పంచాయతీలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఎల్‌ఇడి బల్బుల వినియోగానికి గ్రామ సభల అనుమతులు అవసరం లేదని చెప్పారు. ఎల్‌ఇడి బల్బుల వినియోగం ద్వారా జరిగే ఆదాలో 20 శాతం నిధులను తిరిగి గ్రామాలకే ప్రోత్సాహకంగా చెల్లిస్తామన్నారు. విద్యుత్ సామాగ్రి కొనుగోళ్లలో పలుచోట్ల సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఆరోపణలు వచ్చేవని, కానీ ఎల్‌ఇడి బల్బుల వినియోగం వద్ద అక్రమాలకు అవకాశం ఉండదన్నారు. ఎల్‌ఇడి బల్బుల సరఫరా, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గుర్తించిన సంస్థలకు కేటాయించడం జరిగిందని, ఆయా సంస్థలు వీటి నిర్వహణను పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరుగుతున్నా ఆయా సంస్థలు తక్షణం గ్రామ పంచాయతీలకు తెలియజేస్తాయని వివరించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో 44 మంది ఆదివాసీ యువతకు ఎల్‌ఇడి బల్బుల తయారీలో శిక్షణ కల్పించి, తయారీ యూనిట్ నెలకొల్పడానికి సహకరించామన్నారు. దీని ద్వారా ఆదివాసీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారుచేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎల్‌ఇడి బల్బులు అందించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను కోరారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్, పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.