బిజినెస్

ఐటి, పర్యాటక కేంద్రం విశాఖే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విశాఖ కేంద్రంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), పర్యాటక రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్ స్పష్టం చేశారు. ఐటి, పర్యటక రంగాల ప్రతినిధులు, అధికారులతో విశాఖలో శుక్రవారం సమావేశమైన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యం గా ఈ రెండు రంగాలను ప్రోత్సహించే క్రమంలో ఐటి, పర్యాటక శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖలోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐటి, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు విశాఖలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. ఆయా రంగాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నూతన విధివిధానాలను రూపొందించిందన్నారు. ప్రస్తుతం విశాఖలో నెలకొన్న ఐటి పరిశ్రమల్లో కేవలం 19 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని, మరిన్ని వసతులు, వౌలిక సదుపాయాలు కల్పిస్తే లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విశాఖలో ఐటి కంపెనీలు తమ సంస్థలను స్థాపించేందుకు ముందుకు వస్తున్న తరుణంలో వారికి అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఐటి కంపెనీల ఏర్పాటుకు 20 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరమని, అందుకు తగిన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. వుడా ఆధ్వర్యంలోని రో హౌసింగ్, హౌసింగ్‌బోర్డులో భవనాలు, వుడా ఆధీనంలోని ఖాళీ స్థలాలను గుర్తించాలని కోరారు. తాత్కాలిక ప్రాతిపదికన వారికి స్థలాలు కేటాయించాలన్నారు. ఎపిఐఐసి ఆధ్వర్యంలోని ఐటి సెజ్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని, పనులు ప్రారంభించని సంస్థల వివరాలు సేకరించి, వాటిని వెనక్కు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తరణ ప్రణాళికలతో ముందుకు వచ్చే ఐటి కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఐటి కంపెనీలు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి కళాశాల నుంచి ఐదుగురు ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ నిచ్చి ఉపాధి కల్పించాలన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధిపై సమీక్షిస్తూ విశాఖ కేంద్రంగా పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఠక్కర్ అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని పర్యాటకరంగాన్ని విస్తరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక కేంద్రాల్లో వౌలిక వసతుల కల్పనకు జివిఎంసి, వుడా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారసత్వ సంపదగా వచ్చిన కట్టడాలను పరిరక్షిస్తూనే, వాటిపై ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించాలన్నారు. అరకును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడంతోపాటు అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయా రంగాలకు సంబంధించి హోటళ్లు, ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఐటి కంపెనీ ప్రతినిధులు తమ ప్రతిపాదనలు తెలిపితే ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పలువురు ఐటి కంపెనీల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విశాఖలో శుక్రవారం జరిగిన ఐటి సంస్థల ప్రతినిధులు, అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎస్ ఠక్కర్