బిజినెస్

ప్రపంచ శ్రేణి బ్యాంక్ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)
* 1806 జూన్ 2న బ్యాంక్ ఆఫ్
కలకత్తాగా జననం
* 1921 జనవరి 27న ఇంపీరియల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం
* 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియాగా అవతరణ
* 1956 జూన్ 2న జాతీయం
* ప్రధాన కార్యాలయం: ముంబయి (మహారాష్ట్ర)
* చైర్‌పర్సన్: అరుంధతీ భట్టాచార్య
**
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రపంచ శ్రేణి బ్యాంక్ ఆవిర్భవించింది. నూతన ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రారంభ వేళ.. సరికొత్త శకానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నాంది పలికింది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను శనివారం తనలో విలీనం చేసుకున్న ఎస్‌బిఐ.. ఇప్పుడిక ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటైంది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రజుడిగా పేరున్న ఎస్‌బిఐలో ఇదివరకే రెండు బ్యాంకులు విలీనమయ్యాయి.
ఇప్పుడు మరో ఆరు బ్యాంకులు కలిసిపోయాయి. ఫలితంగా ఈ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఖాతాదారులు, శాఖలు, ఎటిఎమ్‌లు, డిపాజిట్లు ఇలా అన్నీ అమాంతం పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బిపి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బిటి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె), భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి)లు ఎస్‌బిఐలో విలీనమైనట్లు శనివారం అధికారికంగా ఎస్‌బిఐ ప్రకటించింది. ‘ఈ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మహా విలీనంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-50 బ్యాంకుల్లో ఎస్‌బిఐ చేరిందని పేర్కొంది.
విలీనం నేపథ్యంలో ఎస్‌బిఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు చేరిందని, దేశవ్యాప్తంగా దాదాపు 24,000 శాఖలు ఏర్పడ్డాయని, సుమారు 59,000 ఎటిఎమ్‌ల నెట్‌వర్క్ సాధ్యమైందని చెప్పింది. అంతేగాక విలీనానంతర బ్యాంక్‌లో డిపాజిట్ల విలువ 26 లక్షల కోట్ల రూపాయలను దాటిపోతుండగా, అడ్వాన్స్‌ల స్థాయి 18.50 లక్షల కోట్ల రూపాయలను మించుతోంది. ఆస్తుల విలువ కూడా 37 లక్షల కోట్ల రూపాయలను తాకుతుంది. కాగా, 2008లో తొలిసారిగా ఎస్‌బిఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది.
రెండేళ్ల తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా కలిసిపోయింది. తాజాగా ఇప్పుడు మరో ఐదు అనుబంధ బ్యాంకులనూ తనలో ఐక్యం చేసుకుంది ఎస్‌బిఐ. చివరకు కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా తెచ్చిన భారతీయ మహిళా బ్యాంక్‌నూ ఎస్‌బిఐలోనే విలీనం చేసేశారు. యుపిఎ హయాంలో మొదలైన బిఎమ్‌బి విలీనానికి గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదిలావుంటే విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకుల్లో మూడు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ ఉన్నాయి. ఎస్‌బిఐ బోర్డు ఆమోదం తెలిపిన విలీన ప్రక్రియ వివరాల ప్రకారం వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ భాగస్వాములకు 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి పది షేర్లకు రూపాయి ముఖ విలువ కలిగిన 28 ఎస్‌బిఐ షేర్లు అందుతాయి.
అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ భాగస్వాములకు 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి పది షేర్లకు రూపాయి ముఖ విలువ కలిగిన 22 ఎస్‌బిఐ షేర్లు అందనున్నాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ల కోసం ప్రత్యేకంగా విలీన పథకాలనూ ఎస్‌బిఐ ఆమోదించింది. ఈ రెండు బ్యాంకులు పూర్తిగా ఎస్‌బిఐకి చెందినవే కావడంతో షేర్ల మార్పిడి, నగదు బదిలీ వంటివేమీ ఉండవు.
అయితే ఈ మెగా విలీనానికి అనుబంధ బ్యాంకుల ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్నాయని, ఇలాంటి విలీనాల అవసరం ఎంతైనా ఉందని వాదిస్తోంది. బ్యాంకులు ఎక్కువయ్యేసరికి ఒక బ్యాంక్‌లో రుణం తీసుకుని ఎగవేసినవారే.. మరో బ్యాంక్‌లో రుణం తీసుకుంటూ ప్రజా ధనాన్ని బొక్కేస్తున్నారని చెబుతోంది. కాబట్టి తమ బ్యాంకుల ఏకీకరణ సిద్ధాంతం ముమ్మాటికి సరైనదేనంటూ సమర్థించుకుంటోంది. మొత్తానికి ఈ విలీనాలతో ఓ ప్రపంచ స్థాయి బ్యాంక్ ఆవిష్కృతమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
**
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
స్థాపించినది: 1913
శాఖలు: 976
ఉద్యోగులు: 10,627
ప్రధాన కేంద్రం: బెంగళూరు
**
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్
స్థాపించినది: 1945
శాఖలు: 1,157
ఉద్యోగులు: 13,775
ప్రధాన కేంద్రాలు: తిరువనంతపురం, పూజాప్పుర
**

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
స్థాపించినది: 1917
శాఖలు: 1,314
ప్రధాన కేంద్రం: పాటియాలా
**
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్
స్థాపించినది: 1963
శాఖలు: 1,360
ప్రధాన కేంద్రం: జైపూర్
**
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
స్థాపించినది: 1941
శాఖలు: 2,000
ఉద్యోగులు: 18,000
ప్రధాన కేంద్రం: హైదరాబాద్
**
భారతీయ మహిళా బ్యాంక్
స్థాపించినది: 2013
శాఖలు: 85
ప్రధాన కేంద్రం: న్యూఢిల్లీ
**
‘మూడు నెలల్లో విలీన ప్రక్రియను ముగిస్తాం. ఖాతాదారులకు విలీనానంతర బ్యాంక్ మరింత నాణ్యమైన సేవలను అందిస్తుందని హామీ ఇస్తున్నాం. విలీనం వల్ల భౌగోళిక ఇబ్బందులను అధిగమిస్తాం. బ్యాంక్ కార్యకలాపాల విస్తరణ కూడా పెరుగుతుంది. మొత్తం శాఖలను క్రమబద్ధీకరించి, అవసరమనుకున్నచోట కొత్త శాఖలను ఏర్పరుస్తాం. అభివృద్ధిపరమైన నిర్ణయాలు సత్వరమే వెలువడుతాయి. బ్యాంక్ ఆర్థిక పరిపుష్ఠిని సంతరించుకుంటుంది. ముఖ్యంగా విలీనంతో రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి, మొండి బకాయిల (ఎన్‌పిఎ లేదా నిరర్థక ఆస్తులు)నూ నియంత్రించగలుగుతాం. తద్వారా బ్యాంకు లాభాల్లో పయనించే వీలుంది.’
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య

చిత్రం..ముంబయలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం, ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య