బిజినెస్

పారిశ్రామిక సమస్యలను తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్రలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) విశాఖపట్నం జోన్ చైర్మన్ డి తిరుపతి రాజు అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ‘ఒక పరిశ్రమ స్థాపించాలంటే భూమి అవసరం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. భూ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏదైనా కొత్త వస్తువును తయారు చేయడానికి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వచ్చి, పరిశ్రమకు కావల్సిన భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే, కనీసం రెండేళ్ల వరకూ ఆ భూమి సదరు వ్యక్తి చేతికి రావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఇది మరింత ఆలస్యమైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈలోగా సదరు పారిశ్రామికవేత్త తయారు చేయదలచిన కొత్త ప్రొడక్ట్ వివరాలు లీక్ అవుతున్నాయి. భూమి కోసం ఎదురు చూస్తున్న పారిశ్రమికవేత్తకన్నా, మరొకరు ఆ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చేస్తున్నారు. ఇలా చాలామంది నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.’ అని తిరుపతి రాజు తెలియచేశారు. అయతే రాష్ట్రంలో లైసెన్సింగ్ విధానం, అనుమతులు అతి త్వరగా లభిస్తున్నాయని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందించాల్సిందేనన్నారు. కేవలం 20 రోజుల్లో లైసెన్స్‌లు జారీ అవుతున్నాయని, మరే రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా జరగడం లేదన్నారు. కానీ పారిశ్రామికవేత్తే తన భూమిలో ఇండస్ట్రీ పెట్టుకున్నా, సదరు పరిశ్రమకు కావల్సిన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేకపోతోందని తిరుపతి రాజు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి చాలామంది ముందుకు వస్తున్నారని, అయితే ప్రభుత్వం తగిన వౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందన్నారు. ‘వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తులను నేరుగా పరిశీలించేందుకు విదేశీ బృందాలు వస్తున్నాయి. వారిని పరిశ్రమ వరకూ తీసుకువెళ్లాలంటే, కనీసం రోడ్డు కూడా ఉండదు. దీంతోటే వారికి మన ఉత్పత్తులపై నమ్మకం పోతోంది. అంతేకాకుండా, నాణ్యమైన విద్యుత్‌ను అందించలేకపోతున్నాం.’ అని ఆయన అన్నారు. ఒక ఇండస్ట్రీలో పవర్ ట్రిప్ అయితే, కనీసం మూడు గంటలపాటు ఉత్పత్తి నిలిచిపోతుందని, ఈ నష్టం తీవ్రంగా ఉంటుందని, అటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు కనీసం మూడుసార్లు పవర్ ట్రిప్ అవుతోందని, దీనివలన ఇండస్ట్రీ యజమానికి ఎంత అదనపు భారం పడుతుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ఈపిడిసిఎల్ అధికారులకు ఈ విషయాన్ని అనేకసార్లు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని తిరుపతి రాజు చెప్పారు.
ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం స్కిల్డ్ లేబర్ లేకపోవడమేనన్నారు. కనీసం స్కిల్డ్ సెక్యూరిటీ గార్డులు కూడా మన రాష్ట్రంలో దొరకడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే భారీ పరిశ్రమలకు కావల్సిన వివిధ రకాల సర్వీసెస్‌ను అందించి ఉపాధి పొందవచ్చని, కానీ వీటిపై ఎవ్వరూ దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. కేవలం కూలీలను మాత్రమే మనం స్థానికంగా తీసుకోగలుగుతున్నామని, మిగిలినవాటిని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవలసి వస్తోందని చెప్పారు. ప్రధాన పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, ఉత్తరాంధ్రలో అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయని, ఈ కంపెనీల్లో పీస్ వర్క్‌లు చాలా ఉంటాయని వివరించారు. ఉదాహరణకు స్టీల్ రాడ్ వెల్డింగ్ పనులు దాదాపు అన్ని కంపెనీల్లోనూ ఉంటాయని, కానీ దీనికి సంబంధించిన స్కిల్డ్ వర్కర్స్ మన రాష్ట్రంలో లేరన్నారు. అలాగే హెడ్‌డిపిఇ బ్యాగ్స్ ప్రతి ఇండస్ట్రీకి కావాలని, వీటిని తయారు చేసే వారు మన రాష్ట్రంలో లేరన్నారు. అలాగే లిక్విడ్ ప్రొడెక్ట్‌ను సీసాల్లో నింపాలంటే ఆ సీసాలు మన రాష్ట్రంలో దొరకడం లేదు. వీటిని బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తిరుపతి రాజు చెప్పారు. భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ప్రొడక్ట్స్ ఇక్కడే తయారయ్యే విధంగా యువతకు శిక్షణ ఇస్తే, మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా వరకూ తగ్గిపోతుందని వివరించారు.

చిత్రం..తిరుపతి రాజు