బిజినెస్

నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా స్టీల్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఉక్కు కర్మాగారాలు నెలకొల్పేందుకు కేంద్రం సుముఖంగా ఉందని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి) డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ ఎన్‌కె నందా వెల్లడించారు. దేశంలో ఉక్కు కర్మాగారాలు విజయవంతంగా మనుగడ సాగించేందుకు అవసరమైన వ్యూహాలపై విశాఖలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్కటి 5 నుంచి 6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇనుప ఖనిజం పుష్కలంగా లభించే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, కర్నాటక రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పేందుకు కేంద్రం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి)లు ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఎస్‌పివిల్లో ఆయా కర్మాగారాలకు సొంత గనుల ఏర్పాటు అంశంలో ఎన్‌ఎండిసిని కూడా భాగస్వామ్యం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశీయంగా ఉక్కు కర్మాగారాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని, ఉత్పాదక వ్యయం అనూహ్యంగా పెరగడం సంక్షోభానికి కారణమైందన్నారు. చైనా, జపాన్, తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక వ్యయం ఎక్కువన్నారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన ముడి సరకులు కోకింగ్ కోల్, ముడి ఇనుము ధరలు, వీటి రవాణా వ్యయం కర్మాగారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. ముఖ్యంగా కోకింగ్‌కోల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. గతంతో పోలిస్తే కోకింగ్ కోల్ టన్ను ధర 70 నుంచి 200 డాలర్లకు పెరిగిందని, ఇక ముడి సరకు ఇనుప ఖనిజం రవాణా ఖర్చులు కూడా ఆర్థికంగా భారాన్ని మోపుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసుకుంటే బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజం రవాణాకు 12 శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని చెప్పారు. అలాగే కేంద్రానికి చెల్లించే రాయల్టీలు కూడా భారాన్ని పెంచుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌రంగ కర్మాగారాల ద్వారా సాలీనా 90 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోందన్నారు. విశాఖ ఉక్కు ఆపరేషన్స్ డైరెక్టర్ డిఎన్ రావు మాట్లాడుతూ భారత్‌లో తలసరి ఉక్కు వినియోగం కేవలం 62 కేజీలు మాత్రమేనని, అంతర్జాతీయంగా ఇది 120 కేజీలు ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ మనుగడ సాగించాలంటే నాణ్యతతో కూడిన ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయగలగాలన్నారు. దీంతోపాటు ఉత్పాదక వ్యయం నియంత్రించుకుంటే కర్మాగారాలు లాభాల బాటలో నడుస్తాయన్నారు. భారత్‌లో టన్ను ఉక్కు ఉత్పాదక వ్యయం 18 శాతం ఉండగా, చైనా, జపాన్ వంటి దేశాల్లో కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమేనన్నారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు వార్షిక సామర్థ్యాన్ని 6.5 నుంచి 7.5 మిలియన్ టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. 2030 నాటికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా విశాఖ ఉక్కు నిలుస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. టెక్నికల్ డైరెక్టర్ ఎస్‌కె రాయ్ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తిలో కర్మాగారాలు సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. అయితే ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి ద్వారా 350 నుంచి 400 కిలోల వ్యర్థాలు వస్తున్నాయని, పర్యావరణ పరంగా దీన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్ మాట్లాడుతూ పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక వంటివన్నారు. ఉక్కు పరిశ్రమ లాభాలు ఆర్జించాలంటే రవాణా వ్యయాన్ని కూడా నియంత్రించుకోవాలని అభిప్రాయపడ్డారు. ముడి సరుకు, ఉత్పత్తుల రవాణాకు జల రవాణా లాభదాయకంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఎయు మెటలర్జీ విభాగం ప్రొఫెసర్ ఎన్‌ఎస్ రావు, జాయింట్ ప్లాంట్ కమిటీ చీఫ్ ఎకనామిస్ట్ ఎఎస్ ఫిరోజ్ తదితరులు మాట్లాడారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న ఎన్‌ఎండిసి డైరెక్టర్ ఎన్‌కె నందా