బిజినెస్

అందరి భయం అదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉగ్రవాదం.. వాతావరణ మార్పులు.. అవినీతి.. పేదరికం.. నేడు ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్యేదో తెలుసా?.. అంటే అందరూ ముందుగా కాస్త అటుఇటుగా చెప్పే సమాధానాలివే. కానీ వీటన్నిటికంటే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. నిరుద్యోగం. అవును.. ముమ్మాటికి ఇది నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యధికులు ఆందోళన చెందినది నిరుద్యోగమేనని తేలింది మరి. గ్లోబల్ మార్కెట్ రిసెర్చర్, కన్సల్టింగ్ సంస్థ అయిన ఇప్సోస్ చేపట్టిన సర్వేలో నిరుద్యోగంపట్లే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో ఇప్సోస్ ఆన్‌లైన్ ప్యానెల్ వ్యవస్థ ద్వారా చేసిన ఈ సర్వేలో 36 శాతం జనాభా నిరుద్యోగంపై ఆందోళన కనబరిచారు. ఆ తర్వాత ఆర్థిక/రాజకీయ అవినీతిపై 34 శాతం మంది, పేదరికం, సామాజిక అసమానత్వంపై 33 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. అంతా అనుకుంటున్నట్లుగా తీవ్రవాదంపై ఆందోళన చెందుతున్నవారు కేవలం 20 శాతమేనని వెల్లడైంది. దీనికంటే కూడా నేరాలు, హింసపై 30 శాతం మంది, ఆరోగ్యంపై 23 శాతం మంది ఆందోళన పడుతున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాసహా ఎందరో దేశాధినేతలు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు చాలాచాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణ మార్పులు, భూతాపంపై ఆందోళనపడుతున్న ప్రజలు 9 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే ద్రవ్యోల్బణంపై 9 శాతం, పిల్లల్లో స్థూలకాయంపై 9 శాతం, రుణాల మంజూరు అంశంపై 2 శాతం మంది ఆందోళన కనబరిచారని ఇప్సోస్ సర్వే చెప్పింది.
ఇదిలావుంటే భారత్ విషయానికొస్తే 45 శాతం మంది ఆర్థిక/రాజకీయ అవినీతిపై, 40 శాతం మంది నిరుద్యోగంపై ఆందోళన కనబరిచారు. కాగా, జూన్‌తో పోల్చితే జూలైలో నిరుద్యోగంపై ఆందోళన చెందుతున్నవారి సంఖ్య 2 శాతం పెరగడం గమనార్హం. జూలై 1 నుంచే దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చినది తెలిసిందే. దీని ప్రభావం వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఉండగా, నిరుద్యోగంపై ఆందోళనలూ పెరిగిపోయాయి. ఇకపోతే ఆయా దేశాలవారీగా చూస్తే స్పెయిన్ (65 శాతం), ఇటలీ (63), దక్షిణ కొరియా (63), సెర్బియా (58), దక్షిణాఫ్రికా (58), అర్జెంటీనా (47), ఫ్రాన్స్ (45), సౌదీ అరేబియా (43), బ్రెజిల్ (42 శాతం) దేశాల్లో నిరుద్యోగంపట్ల ఆందోళనలు పెద్ద ఎత్తున కనిపించాయి. అగ్ర దేశాల విషయానికొస్తే అమెరికాలో 18 శాతం, బ్రిటన్‌లో 14 శాతం, జర్మనీలో 12 శాతం మేర జనాభా నిరుద్యోగంపై భయపడుతున్నారు. అయితే అమెరికాలో ఆరోగ్యంపై అత్యధికంగా 39 శాతం, బ్రిటన్‌లో తీవ్రవాదంపై ఎక్కువగా 43 శాతం, జర్మనీలో పేదరికం, సామాజిక అసమానత్వంపై పెద్దగా 46 శాతం మంది ఆందోళన కనబరిచారు. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చైనా, హంగేరి, ఇజ్రాయెల్, జపాన్, మెక్సికో, పెరు, పోలాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్, టర్కీ తదితర దేశాల్లోనూ ఈ సర్వే జరిగింది. కాగా, చైనాలో మాత్రం ఆర్థిక/రాజకీయ అవినీతి, పేదరికం, సామాజిక అసమానత్వం, పన్నులు, మితిమీరిపోతున్న అతివాదం మినహా మిగతా అంశాలపైనే సర్వే నిర్వహించారు. మొత్తానికి ఈ సర్వే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. మళ్లీ ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయనడానికి ఈ సర్వే నిదర్శనంగా కూడా నిలుస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ, ఐటిసహా పలు కీలక రంగాల్లోని సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నామని చెబుతున్నది తెలిసిందే. దీనికి అనుగుణంగానే తాజా గ్లోబల్ సర్వేలో నిరుద్యోగంపై అత్యధికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.