బిజినెస్

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జిఎస్‌టి ఆమోదం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్న దృఢమైన విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోగల యుపిఎ కూటమిలో భాగస్వాములైన డిఎమ్‌కె, ఎన్‌సిపి తదితర పార్టీలతోసహా దేశంలోని ప్రాంతీయ పార్టీలు జిఎస్‌టికి గట్టిగానే మద్దతునిస్తున్నాయని ఆయన చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన భారతీయ మహిళా పాత్రికేయ సంఘం (ఐడబ్ల్యుపిఎస్) సమావేశంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లు పాసవుతుందనడానికి కారణాలున్నాయన్నారు. ‘జిఎస్‌టి బిల్లు ఆమోదంపై నాకున్న దృఢ విశ్వాసానికి కారణం ఉంది. కాంగ్రెస్‌తోసహా ప్రతి రాజకీయ పార్టీ జిఎస్‌టి బిల్లుకు మద్దతు పలుకుతున్నాయి. నిజానికి ఈ జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. ఎందుకంటే ఈ బిల్లు ఆలోచన ఆ పార్టీదే కాబట్టి.’ అని ఐడబ్ల్యుపిసి సమావేశంలో జిఎస్‌టి బిల్లు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని అంతా నమ్మకం ఏమిటంటూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అంతేగాక ఉత్తరప్రదేశ్‌లోని ఎస్‌పి, బిఎస్‌పి, బిహార్‌లోని జెడియు, ఆర్‌జెడి, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్, వామపక్షాలు, కేరళలోని వామపక్షాలు, బిజెడి పార్టీలు కూడా జిఎస్‌టి బిల్లుకు మద్దతిస్తున్నాయని చెప్పారు. జిఎస్‌టి బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం ఆమోదం పొందలేకపోయింది. లోక్‌సభలో అధికార బిజెపికి మెజారిటీ ఉండటంతో అక్కడ నెగ్గింది. అయితే రాజ్యసభలో అంతగా మెజారిటీ లేకపోవడం, కాంగ్రెస్‌కు ఆధిపత్యం ఉండటంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. ఈ క్రమంలో బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ సూచించిన కొన్ని మార్పులకూ బిజెపి అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఇక బిల్లు ఆమోదాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌సహా ఇతర ప్రతిపక్షాలకు అవకాశమే లేదని జైట్లీ చెబుతున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది నెరవేరలేదు.
సత్సంబంధాలు ఉండాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య సత్సంబంధాలు ఉండాలని జైట్లీ అన్నారు. ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం ముగుస్తున్న క్రమంలో మరోసారి గవర్నర్ బాధ్యతలను చేపట్టాలని ఉందన్న రాజన్ మనసులో మాటపై స్పందించేందుకు నిరాకరించిన జైట్లీ.. పైవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. దేనిపైనైనా ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం కలిగిన రాజన్.. గతంలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించి విమర్శల పాలైనది తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై స్పందిస్తూ ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అని రాజన్ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. వడ్డీరేట్ల తగ్గింపు అంశంపైనా ఆర్‌బిఐ, ఆర్థిక శాఖ మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగేందుకు సిద్ధమేనన్న రాజన్ కోరికపై స్పందించేందుకు జైట్లీ నిరాసక్తి ప్రదర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సింగపూర్‌తో పన్ను ఒప్పందంపై..
మారిషస్‌తో పన్ను ఒప్పందాన్ని ఇటీవలే సవరించిన భారత్.. సింగపూర్‌తో చేసుకున్న పన్ను ఒప్పందంపైనా మళ్లీ చర్చలు జరపనుంది. ఈ మేరకు జైట్లీ తెలిపారు. అయితే ఈ దిశగా సంప్రదింపులు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై మాత్రం జైట్లీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. 34 ఏళ్ల క్రితం మారిషస్‌తో చేసుకున్న పన్ను ఒప్పందాన్ని సవరిస్తూ ఆ దేశం నుంచి భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పన్నులు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినది తెలిసిందే. దీనిపై వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) తగ్గుతాయని అంచనాలున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. భారత్‌లో డబ్బు సంపాదించాలంటే పన్నులు చెల్లించాల్సిందేనని విదేశీ మదుపరులకు ఆదివారం జైట్లీ స్పష్టంగా తెలియజేశారు కూడా. ఈ క్రమంలో ఇప్పుడు సింగపూర్ పన్ను ఒప్పందాన్నీ సవరించేందుకు భారత్ సిద్ధమవుతోంది.
పరిస్థితి చక్కబడుతుంది
భారత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రమాదంలో పడేసిన మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)పై జైట్లీ మాట్లాడుతూ నిరర్థక ఆస్తులు పతాక స్థాయిని అందుకున్నాయని, అయితే త్వరలోనే ఈ పరిస్థితి చక్కబడుతుందన్న ధీమాను వెలిబుచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్ల శక్తి పెరగగలదని, తద్వారా వ్యాపారపరమైన నష్టాలను ఎదుర్కొంటున్న కీలక రంగాలు మళ్లీ పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిరుడు డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పిఎ 7.30 శాతానికి పెరిగింది. నిరుడు మార్చిలో ఇది 5.43 శాతంగానే ఉంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 2015 మార్చిలో 2,67,065 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు.. 2015 డిసెంబర్ నాటికి 3,61,731 కోట్ల రూపాయలకు పెరిగాయి.
మాల్యాను భారత్‌కు రప్పిస్తాం
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని జైట్లీ స్పష్టం చేశారు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. 17 బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగా బకాయిపడినది తెలిసిం దే. ప్రస్తుతం విమాన సేవలకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దూరమవగా, తీసుకున్న రుణాలను ఎంతకీ చెల్లించకపోవడంతో మాల్యాను బ్యాంకర్లు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ప్రకటించాయి. ఈ క్రమంలో లండన్‌కు పారిపోయిన మాల్యాపై అరెస్టు వారెంట్‌లు జారీ అవగా, దర్యాప్తు ఏజెన్సీలు మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి పెట్టాయని చెప్పారు. సిబిఐతోపాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆదాయ పన్ను శాఖలు మాల్యా కేసును దర్యాప్తు చేస్తున్నాయి.