బిజినెస్

లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 10: మద్యం వ్యాపారి, భారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పరారై లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు ఇంగ్లాండ్ కోర్టులో చుక్కెదురైంది. మాల్యాపై యుకె హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో, ఆయనను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు దర్యాప్తు ఏజన్సీలు భావిస్తున్నాయి. విజయ్ మాల్యా ఆస్తులను స్తంభింపచేయాలని కోరుతూ భారత్‌కు చెందిన 13 బ్యాంకులు ఇంగ్లాండ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ఆండ్య్రూ హెన్‌షా విచారించారు. భారతదేశం కోరుకుంటున్న ఆర్థిక నిందితుడు విజయ్ మాల్యా, తనపై వచ్చిన ఆర్థిక నేరాలు, అభియోగాల నుంచి తప్పించుకునేందుకు, భారత్‌కు తనను అప్పగించకుండా ఉండేందుకు మాల్యా ఎత్తుగడలు వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. మాల్యా ఆస్తులను స్తంభింప చేయాలన్న బ్యాంకుల వినతిని కోర్టు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాను 1988 నుంచి ప్రవాస భారతీయుడినని, 1992 నుంచి ఇంగ్లాండ్‌లో ఉంటున్నట్లు మాల్యా పేర్కొనడాన్ని కోర్టు తిరస్కరించింది. 2016 మార్చి వరకు కేవలం వ్యాపార, రాజకీయ ప్రయోజనాల నిమిత్తమే ఇంగ్లాండ్‌కు మాల్యా వచ్చేవారని కోర్టు పేర్కొంది. 2003లో టిప్పు సూల్తాన్‌ను కొని వేలం వేసినప్పుడే కర్నాటక కోర్టు చివాట్లు పెట్టిన విషయాన్ని ఇంగ్లాండ్ కోర్టు గుర్తు చేసింది. యుకె కోర్టులు ఇచ్చిన రూలింగ్‌ను ఈ కేసులో భారత్ బ్యాంకుల తరఫున వాదిస్తున్న న్యాయ కనె్సల్టెన్సీ సంస్థ టిఎల్‌టిఎల్‌ఎల్‌పి స్వాగతించింది. కోర్టు ఇచ్చిన రూలింగ్‌తో భారతీయ అప్పుల రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేసేందుకు దర్యాప్తు సంస్థలకు సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. మాల్యాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమవుతోందని టిఎల్‌టి బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసస్ న్యాయవాది పాల్ గైర్ చెప్పారు.మాల్యా బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలన్న ఆదేశాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. మాల్యాకు ఆదాయ వనరుల మార్గంపై వేటు పడితే, వారానికి ఒక సారి అలవెన్సును పొందే అవకాశం ఉంటుందని చెప్పారు గత ఏడాది ఏప్రిల్ నుంచి మాల్యాపై వారెంట్ అమలులో ఉంది. అప్పటి నుంచి కూడా మాల్యా బెయిల్‌పై ఇంగ్లాండ్‌లో ఉంటున్నారు. జూలై 11వ తేదీన మాల్యాను అప్పగించడంపై కేసును వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించనుంది. మాల్యా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు కోర్టు వచ్చినట్లు తాజా తీర్పులో వెల్లడైందని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు పేర్కొంది. భారత్ ప్రభుత్వం తరఫున ఈ సంస్థ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. కాగా తనపై ఉన్న అభియోగాల్లో పసలేదని, రాజకీయ దురుద్దేశ్యంతో నమోదుచేసినవేనని మాల్యా తరచుగా ప్రకటనలు చేస్తున్న విషయం విదితమే.