బిజినెస్

రూ. 2.15 లక్షల కోట్లకు కొనేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 18: జపాన్‌కు చెందిన బహుళజాతి టెలీకమ్యూనికేషన్స్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్.. ఐఫోన్ చిప్ డిజైనర్ ఎఆర్‌ఎమ్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేస్తోంది. 32 బిలియన్ డాలర్ల (24.3 బిలియన్ పౌండ్లు లేదా 29 బిలియన్ యూరోలు)కు ఎఆర్‌ఎమ్‌ను కొనేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మొత్తం లావాదేవీ కూడా నగదు రూపంలోనే జరుగుతుండటం గమనార్హం. డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ ప్రకారం ఈ డీల్ విలువ సుమారు 2,15,000 కోట్ల రూపాయలు. ఇక యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) తర్వాత బ్రిటన్‌కు వచ్చిన భారీ విదేశీ పెట్టుబడి కూడా ఇదే కావడం విశేషం. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, అత్యుత్తమ టెక్నాలజీ సంస్థగా ఎఆర్‌ఎమ్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది.’ అని సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోషి సన్ తెలిపారు. ఈ డీల్ విలువ 32 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఈ కొనుగోలు బ్రిటన్‌కు, సాఫ్ట్‌బ్యాంక్‌కు ఉన్న బలమైన కమిట్‌మెంట్‌కు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. కాగా, బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాందోళనల మధ్య ఈ డీల్‌ను బ్రిటన్ నూతన ఆర్థిక మంత్రి ఫిలిప్ హమ్మండ్ కొనియాడారు.
‘ఈ 24 బిలియన్ పౌండ్ల పెట్టుబడి ఆసియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన పెట్టుబడుల్లో అతిపెద్దది. అని హమ్మండ్ ఓ ప్రకటనలో అన్నారు. ఈ డీల్‌తో రాబోయే ఐదేళ్లకుపైగా కాలంలో బ్రిటన్‌లోని ఎఆర్‌ఎమ్‌లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద బ్రిటన్ సంస్థగా ఇది అవతరిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ‘బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గురించి సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ బ్రిటన్‌కున్న అంతర్జాతీయ మదుపరులు ఎక్కడికీ వెళ్లలేదు. రెఫరెండం నిర్ణయం తర్వాత కేవలం మూడు వారాల్లోనే ఇది తేటతెల్లమైంది. వ్యాపారానికి బ్రిటన్ ఎప్పుడూ తలుపులను తెరిచే ఉంచుతుంది. విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యమిస్తూనే ఉంటుంది.’ అని హమ్మండ్ అన్నారు. మరోవైపు బ్రెగ్జిట్ కారణంగా డాలర్‌తో పోల్చితే పౌండ్ విలువ పడిపోవడంతో బ్రిటన్ సంస్థలు విదేశీ మదుపరులను ఆకట్టుకుంటున్నాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. త్వరలోనే మరిన్ని విదేశీ సంస్థలు బ్రిటన్ సంస్థలను టేకోవర్ చేయవచ్చని ఇటిఎక్స్ క్యాపిటల్ ట్రేడింగ్ గ్రూప్‌లోని విశే్లషకుడు నెయిల్ విల్సన్ అన్నారు. ఇప్పటికే గత వారం బ్రిటీష్ డిస్కౌంటర్ పౌండ్లాండ్‌ను దాదాపు 597 మిలియన్ పౌండ్లకు టేకోవర్ చేసేందుకు దక్షిణాఫ్రికాకు చెందిన జనరల్ రిటైల్ గ్రూప్ స్టెయిన్‌హాఫ్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చిందన్నారు. ఇదిలావుంటే ఒక్కో ఎఆర్‌ఎమ్ షేర్‌కు 17 పౌండ్లను ఇచ్చేందుకు సాఫ్ట్‌బ్యాంక్ అంగీకరించింది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎఆర్‌ఎమ్ షేర్ విలువ 45 శాతం వరకు దూసుకెళ్లింది.

చిత్రం.. సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోషి సన్