బిజినెస్

లారీలు లేక పేరుకుపోతున్న మొక్కజొన్న నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, అక్టోబర్ 23: లారీల కొరత ఏర్పడడంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న రాసులు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వాహనాలు కేటాయించినప్పటికీ, అవి రెండుమూడు రోజుల పాటు రాకపోవడంతో ఎక్కడికక్కడ అటు పంట నిల్వలు, వాటిని నింపిన బస్తాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో సొసైటీ ఆధ్వర్యంలో, ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల, తాళ్లరాంపూర్ సొసైటీల ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మోర్తాడ్‌లో ముందస్తుగానే మొక్కజొన్న అమ్మకాలు జరిగిపోయినప్పటికీ, ఆలస్యంగా పంట సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలకే మక్కలు తీసుకువచ్చారు. స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన మైదానంలో రైతులంతా మక్కలను ఆరబోసి అక్కడే తూకం వేసి సొసైటీలకు అందిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు కూడా వెంటదివెంట కొనుగోలు చేసిన మక్కలను నిర్దేశిత మార్కెట్‌కు తరలించినప్పటికీ, గడిచిన కొన్ని రోజులుగా సకాలంలో లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడ కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. టార్పాలిన్ కవర్లు కప్పేసి, రైతులు కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నారు. అధికారులు కూడా సేకరించిన బస్తాలను అక్కడే ఉంచుతున్నారు. తాళ్లరాంపూర్ సొసైటీలోనూ దాదాపు 8వేల బస్తాలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. లారీలు సకాలంలో రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పక్షం రోజుల్లో డబ్బులు చేతికందుతాయని రైతులు భావిస్తున్నప్పటికీ, కొనుగోళ్ల ప్రక్రియలోనే తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మక్కల కొనుగోళ్లు జరుగుతుండగానే, ధాన్యం దిగుబడులు కూడా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మక్కల సేకరణ పూర్తయితే తప్ప, ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండాపోతోంది. అందువల్ల అధికారులు దృష్టిసారించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయిన మొక్కజొన్న నిల్వలను నిర్దేశిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కూడా తీసుకువస్తామని, లేనిపక్షంలో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. అమ్మిన మక్కలకు సంబంధించి డబ్బులు కూడా సకాలంలో తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

చిత్రం..కొనుగోలు కేంద్రంలో లారీలు లేక పేరుకుపోతున్న మొక్కజొన్న నిల్వలు