బిజినెస్

అవాంఛిత కాల్స్ నిరోధానికి యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: డునాట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) కింద నమోదు చేసుకున్నప్పటికీ వివిధ టెలీ మార్కెటీర్ల నుంచి వస్తున్న కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక యాప్‌ను రూపొందించింది. డిఎన్‌డి సర్వీస్ యాప్‌గా వ్యవహరించే ఈ యాప్‌ను సెల్‌ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజానికి డిఎన్‌డి కింద 1909కి ఫోన్ చేసి టెలీమార్కెటీర్ల కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌లు అవసరం లేదని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా రిజిస్టర్ చేసుకున్న వారికి వివిధ టెలీమార్కెటీర్ల నుంచి కాల్స్ రావు. అయినప్పటికీ కొన్ని టెలీ మార్కెటింగ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ కాల్స్ కారణంగా సెల్‌ఫోన్ వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ట్రాయ్‌కు ఫిర్యాదులు అందుతుండటంతో తాజా యాప్‌ను రూపొందించింది. గతంలో ఈ తరహా కాల్స్‌పై ఫిర్యాదు చేయాలంటే కష్టసాధ్యంగా ఉండేది. డిఎన్‌డి కింద రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు టెలీమార్కెటీర్ల నుంచి ఇబ్బందికర కాల్స్ వస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు మీద తీసుకున్న చర్యలను గమనించే ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందులో ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయా టెలీమార్కెటీర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్ కనెక్షన్‌ను ముందుగా రద్దు చేస్తారు. ఆ తరువాత ఆ పేరు, చిరునామాతో సెల్‌ఫోన్ కనెక్షన్ రెండేళ్లపాటు ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో 2.5 లక్షల రూపాయల వరకూ అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. డిఎన్‌డి సేవలు అందుబాటులోకి వచ్చాక సెప్టెంబర్ 2011లో వారానికి 44 వేల ఫిర్యాదులు వచ్చేవి. ట్రాయ్ అధికారులు ఇటువంటి ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో జూలై 2016 నాటికి ఈ ఫిర్యాదుల సంఖ్య వారానికి 3,460కి తగ్గడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ తరహా ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అధికారులు రిజిస్టర్ చేసుకోని టెలీమార్కెటీర్లకు సంబంధించి 3,17,784 ఫోన్ నెంబర్లను రెండేళ్ల పాటు బ్లాక్ చేశారు. ఈ యాప్‌ను గూగుల్ యాప్ స్టోర్ నుంచి లేదా మొబైల్ సేవా యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్స్‌కు సంబంధించి యాప్‌ను రూపొందించారు. త్వరలో యాపిల్ ఐఫోన్‌కు కూడా పనిచేసేలా యాప్‌ను రూపొందించనున్నారు.