బిజినెస్

ఫలితమివ్వని జరిమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలో లిస్టెడ్ కంపెనీల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆజమాయిషీ చేసే సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మోసపూరితంగా వ్యవహరించే కంపెనీల తీరు మారడం లేదు. సెబీ విధిస్తున్న జరిమానాలు కూడా ఫలితం ఇవ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, మోసపూరిత కంపెనీలు ఏవీ సెబీ చర్యలకు భయపడడం లేదు. సెక్యూరిటీస్ చట్టానికి లోబడే సెబీ వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్న కంపెనీలపై కఠినాతికఠినంగా వ్యవహరించేందుకు వీలుండదు. నిబంధనలకు తూట్లు పొడుతున్న వివిధ కంపెనీలను గుర్తించడం, వాటికి జరిమానా విధించడం మినహా సెబీ భారీ చర్యలు తీసుకోలేకపోతున్నది. ఇటీవలే 17 కంపెనీలపై సెబీ 94.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. 2015 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా చూస్తే, కంపెనీలు మోసాలకు పాల్పడడానికి, సెబీ తన నిర్ణయానికి ప్రకటించడానికి మధ్య కాల వ్యవధి చాలా ఎక్కువగా ఉందనేది స్పష్టమవుతుంది. కోట్లాది రూపాయల మేరకు కుంభకోణాలు చేసిన కంపెనీలు కొద్దిపాటి జరిమానాతో తప్పించుకోవడం సెక్యూరిటీస్ చట్టాల్లోని లొసుగులకు నిదర్శనం. స్టాక్ మార్కెట్‌లో సులభంగా అమ్మలేని షేర్లు, సెక్యూరిటీలను అక్రమ మార్గంలో విక్రయించినందుకు సెబీ తాజాగా 17 కంపెనీలపై జరిమానా విధించింది. స్టాక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్‌లో ఒకే రోజు క్లయింట్లు, కౌంటర్ పార్టీల మధ్య లావాదేవీలు జరగడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను బేఖాతరు చేశాయంటూ వచ్చిన ఫిర్యాదులపై సెబీ విచారణ జరిపింది. సుమారు నాలుగేళ్ల తర్వాత జరిమానా విధిస్తూ, ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీలు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే, సెక్యూరిటీస్ చట్టంలో కీలక సవరణలు చేయాల్సిన అవసరం ఉందని సెబీ వాదిస్తున్నది. అందుకే తనకు విస్తృతాధికారాలు ఇవ్వాలని కోరుతున్నది. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో సెబీ తీసుకుంటున్న చర్యలు చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.