బిజినెస్

విశాఖ పోర్టు సరకు రవాణా 65.30 మిలియన్ టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ పోర్టు ట్రస్ట్ 2081-19 ఆర్థిక సంవత్సరంలో 65.30 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని సాధించిందని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. పోర్టు చైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల పదో తేదితో ముగియనున్న నేపథ్యంలో గురువారం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన హయాంలో పోర్టు సాధించిన ప్రగతి విశేషాలను వివరించారు. ముఖ్యంగా విశాఖ పోర్టు సామర్థ్యం పెంపునకు రూ.3,171 కోట్లతో 15 ప్రాజెక్టులు చేపట్టగా, వీటిలో 11 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ప్రైవేట్ పోర్టుల నుంచి ఎదురవతున్న పోటీని తట్టుకుంటూనే ఆధునికీకరణ పద్ధతులను ఉపయోగిస్తూ సరకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. దేశంలో ఏ పోర్టులోనూ లేని విధంగా అత్యధికంగా క్రూడాయిల్ దిగుమతులు 16.32 మిలియన్ టన్నులు విశాఖలో జరిగాయని, తర్వాతి స్థానాల్లో ఇనుప ఖనిజం, కోల్, ఎరువులు ఉన్నాయన్నారు. కంటైనర్ ట్రాఫిక్ కూడా పెరిగి 11.07మిలియన్లకు చేరిందన్నారు. విశాఖ పోర్టుకు చేరుకున్న ప్రతి నౌకా సగటున రెండున్నర రోజుల్లో ఎగుమతి, దిగుమతి పూర్తి చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోర్టులో బెర్తుల సామర్థ్యం కూడా రోజుకు 13,791 టన్నులకు చేరిందన్నారు. అదే విధంగా మూడు వందల కోట్ల వ్యయంతో పోర్టు చానల్ లోతు 11 మీటర్ల నుంచి 14 మీటర్లకు పెంచామని, దీంతో లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హర్బర్‌లోకి పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉందని, బెర్తుల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పోర్టు కాలుష్యం కారణంగా ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు గురికాకుండా ఉండేందుకు పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే కాలుష్యాన్ని తగ్గించే విధంగా పోర్టులో కవర్డ్ స్టోరేజీ సెంటర్లను నిర్మించనున్నామని, అయితే ఈ నిర్మాణానికి సంబంధించిన పరిశీలనను మద్రాస్ ఐఐటీ సంస్థకు అప్పగించడంతో జాప్యం జరిగిన కారణంగా, త్వరలోనే బహిరంగ టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పోర్టు చరిత్రలో ఎన్నూడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదేళ్లలో రూ.1158 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించిందన్నారు. పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా విద్య, వైద్యం, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగరమాల ప్రాజెక్టు కింద విశాఖలోని పోర్టు రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడంతో పాటు, షీలానగర్ నుంచి సబ్బవరం వరకూ కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ పోర్టులో రూ.65 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్‌ను నిర్మించామని దీని ద్వారా పది మెగావాట్ల విద్యుత్ లభిస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ పోర్టు చైర్మన్ హరనాథ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
చిత్రం... విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు