బిజినెస్

మూసివేత దిశగా టెక్స్‌టైల్ పార్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 27: ఆత్మహత్యలతో ‘ఉరిశిల్ల’గా మారిన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉపాధి మార్గాలు పెంచి ‘సిరిశాల’గా తీర్చిదిద్దాలన్న తలంపుతో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి టెక్స్‌టైల్ పార్కు క్రమంగా మూతకు దారితీస్తోంది. ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీలు అందక, బ్యాంకర్ల వేధింపులు తాళలేక ఇక్కడి పార్కులోని యూనిట్లలో నెలకొల్పిన అత్యాధునిక వస్త్ర ఉత్పత్తి యంత్రాలు (పవర్‌లూమ్స్) ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే నష్టాలు పెరగడంతో పలు యూనిట్లలోని యంత్రాల విక్రయాలు కూడా జరిగి తరలించుకుపోగా, తాజాగా శనివారం మరికొన్ని యూనిట్లలోని పవర్‌లూమ్స్ తమిళనాడు రాష్ట్రానికి తరలించారు. సిరిసిల్లలో ఉపాధి మార్గాలు కరువై కార్మికుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతున్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్‌రావు చొరవతో ఇక్కడ టెక్స్‌టైల్ పార్కు మంజూరైంది. జిల్లా కలెక్టర్ సుమిత్రా దావ్రా నేతృత్వంలో పార్కు ఏర్పాటుకు నోచుకుంది. ఏడు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆనాడు అంచనాలు వేశారు. అయతే ఆ ఆశయం నెరవేరకపోగా, 230 పరిశ్రమల యూనిట్ల కోసం నిర్ధేశించిన పార్కులో కేవలం 111 యూనిట్లు మాత్రమే ప్రారంభం అయ్యాయి. అందులో ఇప్పటికే ప్రభుత్వ ఆదరణ కరువై, అందాల్సిన సహాయం అందక 30 యూనిట్లు మూతపడ్డాయి. సిజిటిఎస్‌ఎంఇ పథకం కింద ఏర్పాటు చేసిన మరో 30 చిన్నతరహా యూనిట్లకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. సరైన ఆదరణ లేక ప్రభుత్వ సబ్సిడీలు, విద్యుత్ సబ్సిడీలు అందక, ఇతర అనేక నిర్వహణ భారాలు మోయలేక, మార్కెట్ సౌకర్యం కనిపించక సంక్షోభం అంచున పయనిస్తున్న టెక్స్‌టైల్ పార్కులో నష్టాల ఊబినుండి బయట పడడం కోసం వీటి యజమానులు యూనిట్లను ఎంతకో అంతకు అమ్మేసి వదిలించుకుంటున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలకు ప్రధానంగా తమిళనాడుకు యంత్రాలు తరలిపోతున్నాయి. ఇప్పటికే సూర్య టెక్స్‌టైల్, నాగుల సత్యనారాయణ, యెల్లె రాజేశంలకు చెందిన యూనిట్ల విక్రయాలు జరిగి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. తాజాగా శనివారం జ్యోత్స్న యూనిట్‌లోని యంత్రాలను క్రేన్‌లతో లారీలలోకి మార్చి తరలించారు. మరో నాలుగు యూనిట్లు కూడా విక్రయించడానికి బయానాలు జరిగాయి. మరోవైపు ఇప్పటికే జ్యోత్స్న, మైనిక యూనిట్ల యజమానులకు బ్యాంకర్ల వేలానికి పెట్టారు. ఇక్కడ రాణించని పరిశ్రమలు తమిళనాడులో మనగలగడానికి కారణాలున్నాయి. అక్కడ 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 3.65లకు మాత్రమే ఇస్తుండగా, ఇక్కడ రూ. 8 నుండి 9 వరకు వసూలు చేస్తున్నారు. యూనిట్ల యజమానులపై కేవలం విద్యుత్ బిల్లులే నెలనెలా తడిసి మోపెడవుతున్నాయ. అలాగే తగిన అవకాశాలు, సౌకర్యాలు లేక ఇతర రాష్ట్రాలతో ఇక్కడి వస్త్ర పారిశ్రామికులు పోటీని తట్టుకోలేక మార్కెట్‌లో నిలబడలేకపోతున్నారు. గత ప్రభుత్వాల హయాం నుండి రావల్సిన సబ్సిడీలు అందకపోవడం, యూనిట్ల రుణాలపై బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించలేక చిన్న పరిశ్రమలు వేలానికి, మూతకు దారితీస్తున్నాయి. ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె తారకరామారావు దృష్టిలో ఉండగా, పలుసార్లు ఆయనకు వినతి పత్రాలు కూడా సమర్పించారు. పార్కులోని సమస్యలు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఏర్పడిన తొలి టెక్స్‌టైల్ పార్కు మూత పడడం ఖాయంగా భావిస్తున్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం గత అయిదేళ్ళుగా నిరీక్షించగా, కెటిఆర్ చొరవతో రూ. 7.19 కోట్ల విద్యుత్ సబ్సిడి మంజూరుకు నోచుకుంది. ఇప్పటికీ ఇందులో విద్యుత్ సరఫరా అందించే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస థ(సెస్)కు 20 శాతం మేర సుమారు కోటి రూపాయల విద్యుత్ సబ్సిడీ బకాయలు, అలాగే యూనిట్ల యజమానులకు మరో 20 శాతం మేర సబ్సిడీ బకాయలు విడుదల చేయాల్సి ఉంది. అవి నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లించడం, బ్యాంకర్లకు వడ్డీలు కట్టలేక యూనిట్లపై పెనుభారం పడుతున్నది. ఫలితంగా సిరిసిల్ల పార్కులో 1,250 మంది జీవనోపాధి పొందుతుండగా వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిజానికి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళిన వస్త్ర పారిశ్రామికులు సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్కు నెలకొల్పడంతో ఇక్కడికి తిరిగి వచ్చి యూనిట్లను నెలకొల్పారు. అయితే తాజా పరిస్థితుల మధ్య వారికి మరెటు వలసవెళ్ళాలో అంతుచిక్కడం లేదిప్పుడు. మొత్తానికి చేనేత రంగంపై అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడటం సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు పాలిట శాపంలా పరిణమించింది.

చిత్రం.. టెక్స్‌టైల్ పార్కు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న అత్యాధునిక వస్త్ర యంత్రాలు