బిజినెస్

ఆనందం ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాలం మారుతున్నకొద్దీ మనుషుల అవసరాలూ పెరుగుతున్నాయి. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో సమయమన్నది ఎంతో విలువైనదిమరి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తవ్వాలని ఇప్పుడు చాలామంది కోరుకుంటున్నారు. దీంతో తమ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగానే వివిధ పరిశ్రమలూ ముందుకెళ్తున్నాయి. టెక్నాలజీ సాయంతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ విషయంలో బహుళజాతి సంస్థల మధ్య నెలకొంటున్న పోటీ నూతన ఆవిష్కరణలకు ఊపిరిలూదుతుండగా, కస్టమర్లు సైతం డ్యూయల్ కమాడిటీలను ఇష్టపడుతున్నారు. తొలుత మొబైల్‌ఫోన్లలో డ్యూయల్ సిస్టమ్ విశేష ఆదరణ పొందగా, రెండు సిమ్‌కార్డులు, రెండు కెమెరాలు (ఫ్రంట్, బ్యాంక్ మెగాపిక్సల్ కెమెరాలు), ఫోన్‌గానే కాకుండా మినీ కంప్యూటర్ మాదిరిగా కూడా వినియోగించుకునే సౌకర్యం మొబైల్ యూజర్లను విపరీతంగా ఆకర్షించి మొబైల్ ఫోన్ల రంగానే్న హాట్‌హాట్‌గా మార్చేసింది. ఒకే ఫోన్‌లో రెండు నెట్‌వర్క్‌లను వినియోగిస్తూ వినియోగదారులూ లబ్ధి పొందగలుగుతున్నారు. ఇక స్మార్ట్ఫోన్ల రాకతోనైతే అరచేతిలో ప్రపంచాన్ని తీసుకొచ్చింది కొత్త టెక్నాలజీ. అలాంటి ఈ డ్యూయల్ టెక్నాలజీ ఒక్క ఫోన్లకే పరిమితం కాలేదు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్స్‌తోపాటు వాచీలు, చివరకు నిద్రించే దివాన్ సెట్లు, త్రాగే వాటర్ ప్యూరిఫయర్లు హాట్, కోల్డ్ వాటర్ డిస్పెన్సర్లు, ఎయిర్ కండీషనర్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్‌లు, మిక్సర్, గ్రైండర్లు.. ఇలా అన్నింట్లోనూ టెక్నాలజీ పోకడ మార్కెట్ తీరుతెన్నులనే మార్చేసింది. చివరకు వాహన రంగంలోనూ డ్యూయల్ టెక్నాలజీ అడుగుపెట్టింది. గ్యాస్‌తోపాటు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతోనూ నడిచే వాహనాలున్నాయి. అలాగే ఉదయం సూర్యరశ్మీ సాయంతో సోలార్ వ్యవస్థపై ఆధారపడి, రాత్రిళ్లు సాధారణ వాహనాల మాదిరిగానే పెట్రోల్, డీజిల్‌తో పరుగులు పెట్టే వాహనాలూ వచ్చేశాయి. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లలోనైతే రకరకాల మోడల్స్ నేడు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. క్రింద, పైనా ప్రత్యేకమైన డోర్లతో, బీరువా మాదిరి రెండు డోర్లతో, బ్యాంక్ లాకర్ల మాదిరి ప్రక్కప్రక్కనే నాలుగు విండోలతో కూడా రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు తగినదేదో ఎంచుకునిమరి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ధర కాస్త ఎక్కువైనా పట్టించుకోకపోవడంతో సంస్థలన్నీ కూడా వీటి తయారీకి ఆసక్తి కనబరుస్తున్నాయి. అలాగే వాషింగ్ మెషీన్లలోనూ పెరిగిన టెక్నాలజీ మార్కెట్ రూపురేఖలనే మార్చేస్తోంది. ఇంతకుముందు కేవలం టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్లుండగా, ఆ తర్వాత ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్లు పరిచయమయ్యాయి. తర్వాతర్వాత ఒకే మెషీన్‌లో పైన, క్రింద రెండు ఫ్రంట్‌లోడ్ సౌకర్యాలు రాగా, ప్రస్తుతం ఒకేదానిలో పైన ఫ్రంట్‌లోడ్, క్రింద టాప్‌లోడ్ సదుపాయాలు వచ్చాయి. దీనివల్ల గతంతో పోల్చితే ఒకేసారి ఎక్కువ బట్టలు ఉతికేసుకోవచ్చు. దుస్తులను డ్రై చేసికూడా ఇస్తుండటంతో వాటిని కాసేపు అలా గాలికి ఆరేస్తేచాలు ఎంచక్కా తొడుక్కుని తిరిగేయొచ్చు. విద్యుత్ వినియోగంలోనూ ఇవి ఆదా చేస్తున్నాయి. దీంతో మెజారిటీ వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కంప్యూటర్లను టెలివిజన్లుగా వినియోగిస్తుండటం ఎప్పట్నుంచో కనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత టెలివిజన్లనూ కంప్యూటర్లుగా మార్చుకునే సౌకర్యం రాగా, సిడి, డివిడి ప్లేయర్లలోనూ డ్యూయల్ సిస్టమ్ హల్‌చల్ చేస్తోంది. సౌండ్ సిస్టమ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. డబుల్ సౌకర్యాలతో వస్తున్న స్మార్ట్ వాచీలు సైతం యువతను అమితంగా ఆకర్షిస్తుండగా, సోఫా-బెడ్ సదుపాయంతో వస్తున్న దివాన్ సెట్లకూ మార్కెట్‌లో మంచి గిరాకీనే ఉంది. రెండు వైపులా (అటుఇటు తిప్పి) వేసుకునే దుస్తులు, అప్పర్, లోయర్లలో మార్పులు చేసుకునే అవకాశం, మల్టీ షేడ్‌లో కనిపించే ఆభరణాలు కూడా రావడం మార్కెట్‌లో డ్యూయల్ ఫీవర్ ఎంతగానో వ్యాపించిందనడానికి నిదర్శనం. మొత్తానికి నిత్యనూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుండగా, వినియోగదారుల అవసరాలను, ఆనందాన్ని కూడా రెట్టింపు చేసేస్తోంది.