బిజినెస్

అమ్మకానికి మాల్యా సౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి తమకు రావలసిన బకాయిలను వసూలు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం గోవాలో ఆయనకు చెందిన ప్రధాన స్థిరాస్తి ‘కింగ్‌ఫిషర్ విల్లా’ను అమ్మకానికి పెట్టింది. విజయ్ మాల్యా గతంలో విలాసవంతమైన పార్టీల కోసం ఉపయోగించుకున్న ఈ విల్లాను 85.29 కోట్ల రూపాయల రిజర్వు ధరతో వచ్చే నెల 19వ తేదీన ఇ-ఆక్షన్ ద్వారా అమ్మనున్నారు. ఈ విల్లాతో పాటు అక్కడి స్విమ్మింగ్ పూల్స్, ఏసీ డక్టింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, పైపింగ్, పంపింగ్ వ్యవస్థలు సహా ఆ ప్రాంగణంలోని నిర్మాణాలు, భవనాలు తదితర స్థిరాస్తులకు ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు బహిరంగ నోటీసులో ఎస్‌బిఐ క్యాప్ ట్రస్టు స్పష్టం చేసింది. అయితే కింగ్‌ఫిషర్ విల్లా ప్రాంగణంలోని చరాస్తులను మాత్రం ఈ వేలంలో చేర్చలేదని, విల్లాను కొనుగోలు చేయదల్చుకున్న వారు ఈ నెల 26, 27 తేదీల్లో గానీ, లేక అక్టోబర్ 5, 6 తేదీల్లో గానీ దానిని తనిఖీ చేసుకోవచ్చని ఎస్‌బిఐ క్యాప్ ట్రస్టు పేర్కొంది. బ్యాంకులకు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన విజయ్ మాల్యా ఆధీనంలోని ఈ ఆస్తి దాదాపు 12,350 చదరపు మీటర్ల స్థలంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యా ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పిఎన్‌బి), ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి), అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులకు 6 వేల కోట్ల రూపాయల రుణాలతో పాటు వాటిపై వడ్డీలు, పెనాల్టీలు కలిపి రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ బ్యాంకులన్నీ యునైటెడ్ స్పిరిట్స్ సంస్థపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిపి ఈ ఏడాది మే 13వ తేదీన కింగ్‌ఫిషర్ విల్లాను స్వాధీనం చేసుకున్నాయి. మాల్యాకు చెందిన సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ ఆధీనంలో ఉన్న ఈ విల్లాను రుణాల కోసం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ 2010లో 17 బ్యాంకుల కన్సార్టియంకు తనఖా పెట్టింది.
మాల్యాకు రుణాలిచ్చిన సంస్థలు, ఆదాయ పన్ను విభాగం అధికారులు గత నెలలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనేక స్థిర, చరాస్తులను రెండో విడత వేలానికి పెట్టినప్పటికీ వాటిని కొనుగోలు చేసేందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ ఆస్థుల్లో ముంబయి విమానాశ్రయానికి సమీపంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రధాన కార్యాలయం ‘కింగ్‌ఫిషర్ హౌస్’, కార్లు, విజయ్ మాల్యా వ్యక్తిగత జెట్ విమానం, ‘ఫ్లై విత్ గుడ్ టైమ్స్’ సహా అనేక ట్రేడ్‌మార్కులు, బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో చాలా ఆస్తుల విలువను తగ్గించి రెండో విడతలో వేలానికి పెట్టారు. విలే పార్లే శివారులోని ప్రధాన ప్రదేశంలో 17 వేలకు పైగా చదరపు అడుగుల స్థలం విస్తరించిన ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్ రిజర్వు ధరను రూ.150 కోట్ల నుంచి రూ.135 కోట్లకు, అలాగే కింగ్‌ఫిషర్ లోగో, ‘ఫ్లై విత్ గుడ్ టైమ్స్’ ట్యాగ్‌లైన్ సహా ఆ విమానయాన సంస్థకు చెందిన ట్రేడ్‌మార్కుల రిజర్వు ధరను రూ.366.70 కోట్ల నుంచి రూ.330.33 కోట్లకు తగ్గించినప్పటికీ కొనుగోలుదారులు ముందుకు రాలేదు.

చిత్రాలు..బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా