బిజినెస్

వ్యవసాయ రుణాలను పర్యవేక్షిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకులు అందచేస్తున్న వ్యవసాయ రుణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ బ్యాంకులు వ్యవసాయ రుణాలను ఏ విధంగా ఇస్తున్నాయన్న విషయంపై కేంద్ర దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ రంగంలో రుణాలను లక్ష్యంగా ఎంచుకున్నట్టు చెప్పారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఈనెల ఒకటో తేదీన లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాలను 11 శాతం మేరకు పెంచనున్నట్టు ఆమె అప్పుడే ప్రకటించారు. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ, 2022 సంవత్సరంలోగా వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకానికి 75,000 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 54,370 కోట్ల రూపాయల మేరకు రుణాలను అందచేయాలని లక్ష్యంగా ఎంచుకోగా, 75 వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75 వేల కోట్ల రూపాయలు లక్ష్యమైనప్పటికీ, దానిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ‘రుణ పరిమితిని పెంచాం. స్థానిక అవసరాల ఆధారంగా రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయని నమ్ముతున్నాను. డిమాండ్ పెరుగుతుందని, దానికి అనుగుణంగానే రుణాల పంపిణీ కూడా అధికమవుతుందనే ధీమాతో ప్రభుత్వం ఉంది. నేను ప్రత్యక్షంగా బ్యాంకులు ఏ విధంగా వ్యవసాయ రుణాలను అందచేస్తున్నాయనే విషయాన్ని పర్యవేక్షిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అనుగుణంగా, రైతులకు రుణాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ దిశగా కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తున్నది’ అని అన్నారు. బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు మరింతగా సేవలను అందించాలని అన్నారు. సహజంగా వ్యవసాయ రుణాలపై వడ్డీ ఏడాదికి తొమ్మిది శాతం ఉంటుందని, కానీ, తమ ప్రభుత్వం అందులో రెండు శాతం వడ్డీని సబ్సిడీ రూపంలో భరిస్తున్నదని వివరించారు. దీనితో, ఏడు శాతం వడ్డీ మీద రైతులకు మూడు లక్షల రూపాయల వరకూ స్వల్పకాలిక రుణాలు అందుతున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ రంగం బ్యాంకుల మెగా విలీనం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా మెగా విలీనంపై నోటిఫికేషన్‌ను సరైన సమయంలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి, నాలుగు బ్యాంకులుగా ఖరారు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగానే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో విలీనం చేశారు. దీనితో దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా పీఎన్‌బీ అవతరించింది. కాగా, సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌తో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంక్‌తో, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని కేంద్ర నిర్ణయించింది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల మెర్జర్ పూర్తయింది. బ్యాంక్ ఆఫ్ బరోరా పరిధి పెరిగింది. అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను కూడా ఎస్బీఐతో ప్రభుత్వం విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనితో ఎస్బీఐ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.
*చిత్రం...న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు