బిజినెస్

ఫలితాన్నిస్తున్న ‘వివాద్ సే విశ్వాస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ద్వారా దేశంలో దాదాపు 90 శాతం ఆదాయం పన్ను వివాదాలను పరిష్కరించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం వల్ల త్వరితగతిన ఆదాయం పన్ను వివాదాలను నివృత్తి చేసుకునే వీలుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. దేశంలో 4.80 లక్షలకు పైగా ఆదాయం పన్ను వివాదాలు ఉన్నాయని, నికరంగా వీటి మొత్తం విలువ 9.32 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. కొత్త పథకం అనేక రకాలుగా సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందని, దీనివల్ల దాదాపు 90 శాతానికి పైగా ఆదాయం పన్ను కేసులు సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. స్థానికంగా ఓ సంస్థ నిర్వహించిన ఉపాధి ఉత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని పేర్కొన్న ఆయన ఆదాయం పన్ను వ్యవస్థలో అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్ అత్యంత సులభంగా మారిందని, గతంలో ఓ కంపెనీ రిజిస్టర్ కావడానికి రెండు నెలలు పట్టేదని, ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పన్నుల రీఫండ్ కోసం కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడడం వల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారికి నష్టం వాటిల్లుతోందని, వారి ప్రతిష్ట దెబ్బతింటోందని అన్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే ఈ రకమైన అక్రమాలను అరికట్టాలని స్పష్టం చేశారు. వ్యాపారవేత్తలను ఏవిధంగానూ వేధించవద్దని ఆదాయం పన్ను, జీఎస్టీ అధికారులను తాను ఆదేశించానని తెలిపారు. దాదాపుగా 95 శాతానికి పైగా కేసులు పరోక్ష పన్నుల చెల్లింపులోనే తలెత్తుతున్నాయని, అయితే ‘సబ్ కా విశ్వాస్ యోజన’ ద్వారా గత రెండు నెలల్లో వాటిని పరిష్కరించామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో 41 వేలకు పైగా ఆదాయం పన్ను వివాదాలు వివిధ ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి పరిష్కారమైతే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం అహరహం శ్రమిస్తోందని, దేశంలోని యువత క్రియాశీలకంగా పాల్గొనడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతామని అన్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మరింతగా మంచి ఫలితాలను ఇవ్వగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు సమీప భవిష్యత్తులోనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతాయని మంత్రి అన్నారు.