బిజినెస్

ఎగుమతుల పెంపుపై పరిశ్రమల దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత పెంచడంపై భారత పరిశ్రమలు దృష్టి సారిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా చైనా నుంచి వివిధ దేశాలు దిగుమతులను దాదాపుగా నిలిపివేసిన నేపథ్యంలో, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా, అత్యంత వేగంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఎగుమతులను పెంచేందుకు ఇతోథిక సాయాన్ని అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో, ఈ ప్రకటనకు భారీ స్పందన కనిపిస్తున్నది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, సంస్థలు ఇప్పుడు ఎగుమతులను పెంచడంపై దృష్టి సారించాయి. చైనాను అధిగమించి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకూ వస్తుసేవల రంగాల్లో విస్తరించాలన్నది పరిశ్రమల రంగం ఆలోచన. నిజానికి, ఎగుమతులను మరింతగా పెంచాలంటే, వివిధ వస్తుసేవలపై పన్ను, సర్‌చార్జీల మినహాయింపు తప్పనిసరి. వివిధ కార్పొరేట్ సంస్థలు చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తునే ఉన్నాయి. జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదన భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ముందు కూడా ఉంది. జాతీయోత్పత్తిలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన వ్యవసాయ రంగం ఎగుమతుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తున్నది. వీటిని అమలు చేస్తే, ఎగుమతులు పెరుగుతాయన్నది ఎఫ్‌ఐఈఓఈ అభిప్రాయం. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులపై సబ్సిడీని ప్రకటించాలన్న డిమాండ్ కూడా ఉంది. దీని వల్ల వ్యవసాయాధారిత ఉత్పత్తుల ఎగుమతులు మరింతగా పెరుగుతాయన్నది నిపుణుల వాదన. ఇలావుంటే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను పెంచి, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని ఈ రంగాల్లోని పలువురు ప్రముఖులు అంటున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు ఉంటే తప్ప ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరగవన్నది వాస్తవం. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల లక్ష్యాన్ని 375 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్రం సరైన చర్యలు చేపట్టాలి. ఏటా సుమారు 325 నుంచి 330 బిలియన్ డాలర్ల విలువైన వస్తుసేవల ఎగుమతులు జరగాలంటే, తప్పనిసరిగా ప్రోత్సాహకాలను అందించాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం శుభపరిణామం. అదే సమయంలో ద్రవ్య లబ్ధత అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సమస్య అన్ని రంగాల మాదిరిగానే ఎగుమతుల రంగాన్ని కూడా వేధిస్తున్నది. దీని నుంచి బయటపడాలనంటే, జీఎస్‌టీని ఏకమొత్తంగా రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. పలు దశల్లో ఎగుమతిదారులు చెల్లించిన జీఎస్‌టీని సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ఎస్‌టీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతునే ఉంది. ఫలితంగా ద్రవ్య లబ్ధత సమస్యలు పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. ఇతరత్రా వస్తుసేవలకు కూడా డిమాండ్ ఉంది. ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా చైనా భారీగా ఎగుమతులు చేస్తున్నది. కరోనా వైరస్ కారణంగా అక్కడి నుంచి ఎగుమతులు తగ్గిన తరుణంలో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు దేశీయంగా ఉత్పత్తులు పెరగాలి. వ్యవసాయం కష్టసాధ్యంగా మారుతున్న నేపథ్యంలో, ఉత్పత్తులను పెంచాలంటే ప్రత్యేక సబ్సిడీని ప్రకటించడంతోపాటు, ఎగుమతులపై అన్నిరకాల పన్నులను ఎత్తివేయాలి. ఉత్పత్తులను పెంచడానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఈ అవసరాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఎగుమతులను పెంచడం అసాధ్యం. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.