బిజినెస్

భవిష్య నిధి అగమ్యగోచరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి (జీపీఎఫ్) వ్యవహారం అగమ్యగోచరంగా తయరైంది. వేతనాల్లో భవిష్యనిధి కింద కొంత మొత్తం మినహాయిస్తున్నప్పటికీ, ఆ మొత్తం జీపీఎఫ్ ఖాతాల్లో జమ కావడం లేదు. భవిష్యనిధికి సంబంధించి పురపాలక శాఖ నాలుగు విధానాలను అమలు చేయడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. రాష్ట్ర శాసన మండలిలో ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ, ఇప్పటికీ పురపాలక శాఖ స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు గురి అవుతోంది. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరందరికీ ఇతర ఉద్యోగుల తరహాలో భవిష్య నిధి ఖాతాలను ప్రారంభించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో ఇతర విభాగాల సిబ్బందికి మాదిరిగానే వీరికీ భవిష్యనిధి సౌకర్యం వర్తింప చేయాల్సి ఉంది. కానీ మున్సిపల్ ఉపాధ్యాయులకు మాత్రం భవిష్యనిధి వర్తింప చేసే అంశంపై పురపాలక శాఖ నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది. దీంతో వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు రకాలుగా భవిష్య నిధి ఖాతాలను ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నారు. 2009 ఏప్రిల్‌లో మున్సిపల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతం సహా భవిష్యనిధి అమలు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా, భవిష్య నిధి ఖాతాలను ఇప్పటికీ పురపాలక శాఖ ప్రారంభించక పోవడం గమనార్హం. భవిష్య నిధి ఖాతాను ప్రారంభించకుండా, ఉపాధ్యాయుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి, ఆ మొత్తాన్ని మున్సిపల్ కమిషనర్ల ఖతాల్లో జమ చేస్తున్నారు. చాలా మున్సిపాలిటీల్లో దానికి సరైన లెక్కలు ఉండటం లేదు. వడ్డీ కూడా చెల్లించడం లేదు. ఒక టీచర్ వేరే మున్సిపాలిటీకి బదిలీ అయిన సందర్భంలో, భవిష్యనిధి కింద వసూలు చేసిన మొత్తం చెల్లించడం లేదా బదిలీ కానీ చేయడం లేదు. చాలా సందర్భాల్లో అసలు తమ వద్ద భవిష్యనిధి పేరుతో ఎంత మొత్తం వసూలు చేశారన్న అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం ఉపాధ్యాయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. భవిష్య నిధి కింద వసూలు చేస్తున్న మొత్తాలపై కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయా మొత్తాలను వారికే తిరిగి చెల్లించాలంటూ 2013లో, 8 శాతం వడ్డీతో ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేయాలని 2014లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కడప మున్సిపల్ టీచర్లకు 2016 వరకూ ఉన్న భవిష్య నిధి నిల్వను లెక్కించి 8 శాతం వడ్డీతో ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లోకి జమ చేశారు. దీంతో ఒక్కో టీచరుకు దాదాపు 1.5 లక్షల రూపాయల వరకూ వచ్చాయి. తిరుపతి, గూడూరు, రేపల్లె, చీరాల మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధంగా భవిష్యనిధి మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిసింది. అయితే పుంగనూరు, మార్కాపురం మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు భవిష్యనిధి ఖాతాలు ఉండటం గమనార్హం. గుంటూరు నగర పాలక సంస్థకు ఒక పీఎఫ్ ఖాతా నెంబర్‌ను మున్సిపల్ కమిషనర్ కేటాయించారు. నగర పాలక సంస్థ నిర్వహించే ఈ ఖాతాలో ఉపాధ్యాయుల నుంచి భవిష్యనిధి కింద మినహాయించిన మొత్తాలను జమ చేస్తున్నారు. ఈ ఖాతా నిర్వహణ తీరుపై కూడా ఆరోపణలు ఉండటం గమనార్హం. ఇక మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో భవిష్యనిధి కింద మినహాయించిన మొత్తాలను కొన్ని చోట్ల బ్యాంక్‌ల్లో, కొన్ని చోట్ల పోస్ట్ఫాసుల్లో జమ చేస్తున్నారు. ఈ మొత్తాలపై ప్రభుత్వ ఆడిట్ లేకపోవడంతో నిధు ల పరిస్థితి ఏమిటో ఉపాధ్యాయులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలు సురక్షితంగా ఉన్నాయా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. గతంలో మున్సిపల్ ఉపాధ్యాయులకు భవిష్యనిధి ఖాతాలను తెరిచేందుకు అక్కౌంట్స్ జనరల్ ఆఫీసర్ ముందుకు వచ్చినప్పటికీ, పట్టణ స్థానిక సంస్థల్లో పని చేస్తున్న వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేనట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై గతంలో శాసన మండలిలో చర్చకు రాగా, తగిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హామీపై కార్యాచరణ లేకపోవడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో మున్సిపల్ ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని అప్పట్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. భవిష్యనిధికి సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరారు. ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేశారు.