బిజినెస్

రోడ్డున పడ్డ ఉల్లి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాలు నిలిపివేయడంతో ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో అన్ని పంటల ఉత్పత్తులను ఈ నామ్ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఉల్లి పంటను మాత్రం బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉల్లి ఉత్పత్తిని కూడా ఈనామ్ పద్దతిలో క్రయవిక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉల్లి వ్యాపారులు ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలు జరపలేమని ఏకంగా బహిరంగ వేలాన్ని నిలిపివేశారు. దీంతో ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు.
కొద్దిరోజుల క్రితం ఉల్లిఘాటు దేశాన్ని కుదిపేసింది. మార్కెట్ యార్డుల్లో క్వింటాలు ఉల్లి ఏకంగా రూ.14 వేల వరకు ధర పలికింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.150 నుంచి రూ.180 వరకు ధర పలికేది. సామాన్య ప్రజలు ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతు బజార్లలో రాయితీ కింద రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.25 చొప్పున 2 కిలోలు విక్రయించింది. గత కొనే్నళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట సక్రమంగా రాకపోవటమే కాకుండా ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే వచ్చేది. 6 నెలల నుంచి ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. రైతులు ఆనందంతో మార్కెట్ యార్డుకు పంట తీసుకొచ్చి విక్రయించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన ఉత్పత్తులన్నింటినీ ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా క్రయ విక్రయాలను జరిపేందుకు ఈ-నామ్ పద్దతిని ప్రవేశపెట్టాయి. ప్రతి మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులను ఈనామ్ ద్వారానే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఉల్లి పంటను సైతం ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలను జరపాలని మార్కెట్ కమిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉల్లి వ్యాపారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ వేలం ద్వారానే ఉల్లి క్రయవిక్రయాలు జరపాలని లేని పక్షంలో సరుకు తీసుకునేది లేదని తెగేసి చెప్పి క్రయవిక్రయాలను నిలిపేశారు. ఎందుకంటే రైతులు ఉల్లినారు పోసినప్పటి నుంచి నాటు వేసిన తర్వాత కలుపు మందులు, కూలీల ఖర్చులు, పెట్టుబడికి రైతుల వద్ద డబ్బులు లేకపోతే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లే పంట సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బు ఇస్తుంటారు. ఈ విధంగా 50శాతం మంది రైతులు సాగు ఖర్చుల కోసం ముందుగానే వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. వేలం పాటల్లో పాల్గొనే వ్యాపారులు ఆరోజు ధరలో పాత అప్పు మినహాయించుకుని మిగతా డబ్బు రైతులకు చెల్లిస్తుంటారు.
అయితే ఈనామ్ విధానం వల్ల సరుకు ఏ వ్యాపారికి వెళ్తుందో తెలియదు. దీంతో ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన వ్యాపారుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పండించిన పంటలకు అన్ని విధాలుగా మద్దతు ధర కల్పించిన తర్వాత ఈనామ్‌ను పెడితే సరిపోతుందని రైతులు అంటున్నారు. రైతులు మార్కెట్ కమిటీ అధికారుల దగ్గరికి వెళ్లి తమ పంట ఉత్పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. అప్పటికే రోజులు గడవటంతో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో దిక్కుతోచని రైతులు మార్కెట్ యార్డు బయట రోడ్డుమీద పెట్టుకొని ఉల్లిగడ్డలు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
రైతులకు న్యాయం చేస్తాం
మార్కెట్ యార్డులో ప్రతి పంట ఉత్పత్తిని ఈనామ్ ద్వారానే క్రయ విక్రయాలు చేపడుతున్నాం. ఉల్లి పంటను బహిరంగ వేలం ద్వారా క్రయ విక్రయాలను నిర్వహిస్తున్నారు. ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలు చేపడితే రైతు నష్టపోకుండా ఉండటమే కాకుండా ప్రభుత్వానికి సక్రమంగా సెస్సు వసూలవుతుంది. ఉల్లి వ్యాపారులతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.
- మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి

*చిత్రం... కర్నూలు వ్యవసాయ మార్కెట్ బయట రోడ్డుమీద పెట్టుకొని ఉల్లిగడ్డలు తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు