బిజినెస్

విమానయాన రంగానికి మహర్దశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత అత్యున్నత వౌలిక సదుపాయాలు గల స్మార్ట్ సిటీలను తయారుచేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశలోనే ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడే విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలుంటే వాటిలో ఐదు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనూ, ఒకటి పుట్టపర్తిలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ నడుస్తున్నాయి. వీటిలో విశాఖపట్నంలోని విమానాశ్రయానికి మాత్రమే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు ఉంది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలు దేశవాళీ విమానాశ్రయాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలోని విమానాశ్రయాల రూపురేఖలను పూర్తిగా మార్చేయాలన్న నిర్ణయానికొచ్చారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నేవీ ఆధ్వర్యంలో ఉండటంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఆపరేట్ చేసే విధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో పాటు కుప్పం (చిత్తూరు), దగదర్తి (నెల్లూరు), ఓర్వకల్లు (కర్నూలు), ఒంగోలు (ప్రకాశం), తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి)లలో కూడా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌లను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు దొనకొండ, నాగార్జునసాగర్‌లలో రెండు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని నిర్ణయించారు. విజయవాడకు సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని ప్రాంతానికి ఎక్కువ దూరం లేకపోయినా నగరం మధ్యలోంచి ప్రయాణించాల్సి రావడం, ట్రాఫిక్ సమస్యలు తదితరాల కారణంగా మంగళగిరిలో మరో విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఐదువేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇదే జరిగితే మంగళగిరి నుంచి రాజధాని ప్రాంతానికి త్వరగా వెళ్లొచ్చు. ఇవి కాక ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, హెలీప్యాడ్, హెలీపోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు బ్యాంకుల నుంచి నిధులు సమీకరించి విమానాశ్రయాల నిర్మాణాన్ని 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని విమానయానం చేసే ప్రయాణికుల ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. 2013-14 సంవత్సరం లెక్కల ప్రకారం దాదాపు 16 లక్షల మంది విమానాల్లో ప్రయాణిస్తే ఆ మరుసటి సంవత్సరం 17 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది నాటికి దాదాపు 21 లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. ఈ విమానాల ద్వారా సరుకు రవాణా కూడా ఏటికేడాది భారీగా పెరుగుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. 2013-14లో జాతీయ, అంతర్జాతీయ సరుకు రవాణా దాదాపు రెండువేల టన్నుల వరకు ఉంటే ఆ మరుసటి ఏడాది మూడువేల టన్నుల సరుకు రవాణా జరిగినట్టు తెలుస్తోంది. 2020 నాటికి దేశీయంగా ఐదువేల మెట్రిక్ టన్నులు, అంతర్జాతీయంగా 15వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత విమానాశ్రయాలను ఆధునీకరించడంతో పాటు జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తే ఎయిర్ కనెక్టివిటీ పెరిగి ప్రయాణికుల సంఖ్య, సరుకు రవాణా కూడా భారీగా పెరుగుతుందని, ఇదే జరిగితే వచ్చే ఐదేళ్లకు మన రాష్ట్రం నుంచి విమానాల్లో తిరిగే ప్రయాణికుల సంఖ్య ఏడాదికి కోటి దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విమానాశ్రయాల అభివృద్ధి జరిగితే వాటిలో వౌలిక సదుపాయాల కల్పన, ఎయిర్ నావిగేషన్ సర్వీసుల పెరుగుదల, రన్‌వే, విమానాల పార్కింగ్ స్థలమైన ఆప్రాన్, రాత్రిళ్లు విమానాలు నిలుపుకునే వసతి, టెర్మినల్ బిల్డింగ్, ప్రయాణికుల వసతులు వంటి అనేక అంశాల్లో అభివృద్ధి జరుగుతుంది. విమానాశ్రయాలకు అనుబంధంగా ఎయిర్ కార్గో ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ స్టోరేజ్, ఎయిర్ ప్రైట్ స్టేషన్స్, వేర్‌హౌస్‌లు, రోడ్ కనెక్టివిటీ, ప్రైవేట్ విమానయాన సంస్థలు, ఏవియేషన్ ట్రైనింగ్, ఎడ్యుకేనల్ ఇన్‌స్టిట్యూట్స్, వాటిలోకి పెట్టుబడులు వస్తాయి. పెద్ద విమానాశ్రయాలకు అనుబంధంగా ఏరోస్పేస్ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వంటివి కూడా ఏర్పడతాయి. ఒక విమానాశ్రయం నిర్మాణం జరిగిందంటే దానికి అనుబంధంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ విమానాశ్రయం నుంచి పోర్టులకు ఎక్స్‌ప్రెస్ వేస్, రైల్వే ప్రాజెక్టులు, రవాణా వసతులు కల్పించాల్సి ఉంటుంది. సీ ప్లేన్ సర్వీసెస్, ఏరో స్పోర్ట్ యాక్టివిటీస్ వంటి పర్యాటకాంశాలు అభివృద్ధి చెందుతాయి. మెడికల్ ఎమెర్జెన్సీ కోసం ఎయిర్ అంబులెన్సులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం విమానాలు, హెలికాప్టర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు విమానాల నిర్మాణానికి సంబంధించిన పరిశ్రమలు, వాటి అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి.