బిజినెస్

కరెంట్ ఖాతా లోటు తగ్గడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దేశ కరెంటు ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో10.1 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సంస్థ సిటీ గ్రూపునివేదిక అభిప్రాయ పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (సిఏడి) జిడిపిలో 1.2 శాతం లేదా 30 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని కూడా ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అక్టోబర్ నెల గణాంకాలు, పెద్ద నోట్ల రద్దు చర్య అనంతరం డిమాండ్ తగ్గే అవకాశం ఉన్న కారణంగా 2017 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు జిడిపిలో 0.5 శాతం లేదా 10.1 మిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చని తాము భావిస్తున్నామని సిటీ గ్రూపు ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. అయితే ముడి చమురు ధరలు సగటు స్థాయిలో పెరగవచ్చని భావిస్తూ ఉండడం, అలాగే బంగారానికి డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల కారణంగా 2018 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు పెరగవచ్చని కూడా ఆ నివేదిక పేర్కొంది.
మూడో త్రైమాసిక ఫలితాలపై ప్రభావం
ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆటోమొబైల్, ఎఫ్‌ఎణసిజి, రిటైల్, వినియోగ వస్తువులు లాంటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపించనున్న కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్పొరేట్ లాభాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయ పడింది. పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు చెలామణి తగ్గిపోయి కుటుంబాల వినియోగం సైతం భారీగా తగ్గిపోయిందని, ఫలితంగా నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తొలి అయిదు రోజుల్లో అన్ని రంగాల్లో వ్యాపారం 30నుంచి 80 శాతం దాకా పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపైన కూడా దీని ప్రభావం చాలానే ఉంటుందని ‘నోట్ల రద్దు: గ్రౌండ్ జీరోనుంచి ఫీడ్‌బ్యాక్’ పేరుతో రూపొందించిన నివేదికలో ఆ సంస్థ పేర్కొంది.
కాగా, పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మైక్రో ఫైనాన్స్ సంస్థలు, వాటినుంచి అప్పులు తీసుకునే వారిపైన స్వల్పకాలిక ప్రభావం చూపించే అవకాశముందని, రుణాలు తీసుకునే వారిపై ఈ ప్రభావం మరికాస్త ఎక్కువే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ జిందాల్ హరియా గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. మైక్రోఫైనాన్స్ సంస్థలనుంచి అప్పులు తీసుకునే వారు నగదు చెలామణి తగ్గిపోవడంతో డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న నగదుకు పొంతన కుదరక రుణాలు తీసుకున్న వాళ్లు తమ ఖర్చుల విషయాల్లో ప్రాధాన్యతలను తిరిగి నిర్ణయించుకుంటారని, దీని ఫలితంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు బకాయిలు చెల్లించకపోవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.