సెంటర్ స్పెషల్

మహావిజేత 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

63
మహారాజు అగ్నివర్మ తన శయన మందిరానికి గాలవునీ, కుమార్తెనూ పిలిపించాడు. రాజ్య వ్యవహారాల్నీ, చంపకమాలిని భవిష్యత్తునీ కలిపి మాట్లాడసాగేడు.
‘పరిస్థితులూ, పరిసరాలూ, కాలమూ, వివేకమూ నన్ను హెచ్చరిస్తున్నై. ఇక ఈ సామ్రాజ్య భారాన్ని వహించగల వ్యక్తి మన భాగ్య విశేషంగా లభించాడనిపిస్తోంది. ఏమంటారు?’ ఇరువురినీ ఉద్దేశించి ప్రశ్నించాడు.
‘చంద్రహాసుని గురించేనా తమరు అడిగేది? అతని విజయ సాధనలూ, వ్యక్తిత్వ గుణసంపత్తీ అన్నీ తమరు భావిస్తున్నట్లు మనకు కరతలామలకమైనాయి’ గాలవులు రాజుగారి అభిప్రాయాన్ని బలపరిచారు.
రాకుమారి వౌనంగానే తన సమ్మతిని తెలిపింది.
మరి కొంతసేపు అతని గురించిన సంభాషణే నడిచింది. ఆ మీదట మహారాజు మదనుని రమ్మని కబురు పంపారు. వీరంతా దుష్టబుద్ధి కళింద్రలోనే ఉన్నాడనే భావనలో ఉన్నారు!
64
ఆకాశం మబ్బులు కమ్మింది.
కుమార్తె విషయ మందిరానికి హడావిడిగా వచ్చాడు దుష్టబుద్ధి. చంద్రహాస మదనులూ అక్కడే ఉన్నారు. ఆయనను ఆహ్వానించారు వాళ్లు.
కూర్చున్నాడు.
ఆయనలో తొట్రుపాటు కనిపిస్తోంది. దేనిని గురించో ఆయన ఆవేదన పడుతున్నట్లు అర్థమవుతోంది.
‘చెప్పండి నాన్నగారూ’ అన్నది విషయ. తండ్రిని పరిశీలనగా చూస్తూ.
‘ఆఁ... అదే చెప్పబోతున్నాను. మీ వివాహమై నేటికి మూడు రోజులు. మన ఆచారం ప్రకారం మూడు రోజులలోపు వరుడు ఒక్కడూ మన కుల దేవత కాళికాలయానికి వెళ్లి పూజ చేసి రావాలి. కారణాంతరాల వలన ఈ ఆవశ్యకతని మరచిపోయాను. అందుకని చంద్రహాసుడు సిద్ధమై వెంటనే వెళ్తే మంచిది’ అన్నాడు.
‘మీ ఆజ్ఞ. తప్పకుండా వెళ్తాను’ అన్నాడు చంద్రహాసుడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే పూజా సంభారాన్ని తీసుకుని అశ్వారూఢుడై బయల్దేరాడు చంద్రహాసుడు.
దుష్టబుద్ధి తన ఏకాంత మందిరానికి వెళ్లిపోయాడు.
ఆయన వెళ్లిన కొద్దిసేపటికే, చంద్రహాసుని వెనువెంటనే రమ్మని మహారాజు నుండి పిలుపు వచ్చింది.
మదనుడూ, విషయా ఒకరినొకరు చూసుకున్నారు. ‘నేను వెళ్లి ముందు బావగారిని పంపుతాను. దేవీపూజకు ప్రత్యామ్నాయ విధానమేమిటో ప్రధానార్చకులతో విచారించి వస్తాను. ఆ తర్వాత - దానిని ఆచరించవచ్చు’ అన్నాడు.
ఈ సూచనకి సరే అంది విషయ.
మదనుడు అశ్వారూఢుడై కాళికాలయ మార్గం పట్టాడు.
వానజల్లు మొదలైంది. శరీరచ్ఛాదనకి సదుపాయం ఉంది. దాన్ని ధరించాడు.
కాళికాలయం నగరానికి మూడు క్రోసుల దూరంలో ఉన్నది. అరణ్య మార్గం. తరులూ గిరులూ వేగానికి అవరోధమే.
ఒక క్రోసు దూరంలోనే చంద్రహాసుని కలుసుకో గలిగాడు మదనుడు. విషయాన్ని విస్తరంగానే చెప్పాడు.
పూజా ద్రవ్యాలను తీసుకుని ఆలయం వైపు తాను తరలిపోయాడు.
నగరం వైపునకు తిరుగుబాట పట్టాడు - చంద్రహాసుడు!
65
మహారాజ మందిరం.
అగ్నివర్మ ఎదురుగా చంద్రహాసుడు.
మహారాజు తన మనసులోని మాటని వెల్లడి చేశాడు. ‘కుంతల క్షేమం దృష్ట్యా నా పుత్రికనీ, రాజ్యాన్నీ స్వీకరించిన నా కోర్కెని అంగీకరించాలి నీవు’ అన్నాడు అగ్నివర్మ.
విచలితుడైనాడు చంద్రహాసుడు! కుళిందకుడూ, మేధావినీదేవీ, తన వారందరూ కళ్లల్లో మెదిలారు. తలెత్తి సంభ్రమాశ్చర్యాలతో రాకుమారిని చూశాడు. ఆమె నయనాల్లో చకోరాలు!
గాలవుల వారు భృకుటిని ఎత్తి ‘శుభం భూయాత్!’ అన్నాడు.
క్షణం తర్వాత మాట పెకల్చుకుని ‘తమ ఆజ్ఞ’ అని చేతులు జోడించాడు చంద్రహాసుడు.
గవాక్షాల్లో నుండీ వీస్తున్న చల్లగాలి మందిరాన్నంతా ఆహ్లాదపరుస్తోంది!

66
ఒంటరిగా కూర్చుని సురాపానం చేస్తున్నాడు దుష్టబుద్ధి.
ఒక ఉన్మత్త జాగ్రత్ సుషుప్తావస్థ!
సౌభాగ్యవతి విషయ - తన ప్రియ పుత్రిక రూపం కళ్ల ముందు నిలిచి దీనంగా రోదిస్తూ తనను శాపనార్థాలు పెడుతోంది! తన రాజ్యకాంక్షనీ, దుర్నీతినీ, క్రీనీడల రాజకీయాన్నీ - దూషిస్తోంది. ఆ మాటలు స్వభావోక్తులుగా దీపిస్తున్నాయి! తన దుర్మార్గం మీద మాటల ఈటెల్ని ప్రయోగిస్తోంది. కలవరపడ్డాడు. స్థిమితం పోయింది.
‘బంధం లేదు. బాంధవ్యం లేదు. దయలేదు. సానుభూతి లేదు. ఈ గుండెని కాల్చిన కొఱ్ఱుని పెరిగి పారేయక తప్పదు’ అని పూనకం వచ్చిన వాడిలా భీకరంగా అరుస్తూ లేచాడు.
ఆకాశం విలపిస్తూనే ఉంది. మెరుపుల ఖడ్గచాలనం చేస్తూనే ఉంది. అయినా సరే రథాన్ని తెప్పించుకున్నాడు. కాళికాలయానికి పోనిమ్మన్నాడు.
రథం కదిలింది.
దారిలోనే ఎదురైనారు ఛండాలమండలి. రథాన్ని ఆపించి వారిని ప్రశ్నించాడు. సురాపానోన్మత్తులై కేరింతలతో అమాత్యులు చెప్పిన విధిని నిర్వహించామని ధృవీకరించారు.
సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు దుష్టబుద్ధి. గుప్పెడు ద్రవ్యాన్ని వారి చేతుల్లోకి రువ్వాడు.
రథం వేగాన్ని హెచ్చించమన్నాడు.
వర్షం తీవ్రతా హెచ్చింది. ప్రళయార్భటిని ప్రదర్శిస్తోంది.
కాళికాలయాన్ని చేరింది రథం. చుట్టూ చీకటి. వింత ధ్వనులు. తగిన ఆచ్ఛాదనతో రథం దిగాడు. ఆలయంలోకి నడిచాడు. ఎక్కడా మనిషి జాడలేదు. దేవి ముంగిటాముదపు దీపం గుడ్డి వెలుగు నిస్తున్నది. కీచురాళ్ల అరుపు భీకరంగా వినవస్తోంది.
గర్భగుడి వాకిలి ముంగిట ఖండిత దేహం పడి ఉన్నది. శిరోభాగం వరకూ నడిచాడు. పిచ్చి ఆనందంతో రక్తసిక్తమై బోరగిలపడి వున్న ఖండిత శిరస్సుని చేత్తో పక్కకి తిప్పాడు.
అంతే! హృదయ చలనం ఆగిపోయింది! అది తన ప్రియపుత్రుడు మదనుని తల!
మొదలునరికిన చెట్టులా కూలిపోయాడు దుష్టబుద్ధి.
వేదన రోదనల విస్ఫోటనం! సర్వమూ కోల్పోయిన భావన! ఎవరో విషపు ముద్దని అరచేత పెట్టి తినిపిస్తున్న భావన!
ఒర నుండీ ఖడ్గాన్ని తీసి తన తల మీద తానే...
ఒకే ఒక్క వేటు!
దుష్టబుద్ధి ఆత్మ సమాపణం జరిగిపోయింది!
ప్రకృతి, వికృతిని పరిహసిస్తోంది!
67
చంద్రహాసుడు చెప్పిన సంగతి విని, కళ్లు చక్రాల్లా తిప్పుతూ, ‘నిజంగానా’ అని రెట్టించింది విషయ.
‘అవును. రాజ్యభారంతో పాటు ఈ బాధ్యతనీ ముడిపెట్టాడు మహారాజు’ సంజాయిషీగా అన్నాడు చంద్రహాసుడు.
‘అయితే మహామంత్రి కుమార్తె భావి పట్టపురాణీ, మహారాజపుత్రిక దేవీ’ అని గలగలా నవ్వింది.
‘అయినా - రాకుమారీ, నేనూ ఇప్పుడు అక్కచెల్లెళ్లమే, కాకుంటే ఇంతకు మునుపు తాను అక్కా, నేను చెల్లెల్ని. ఇక ముందు నేను అక్కనీ, తాను చెల్లెలూ... అంతేగా?’ అన్నది ఉత్సాహంగానూ, కించిత్ గర్వంతోనూ.
చంద్రహాసుడు ఆమెని అబ్బురంగా చూస్తున్నాడు.
విషయ నవ్వుతోంది. ఆమె జడలోని నాగమల్లెపూలూ నవ్వుతున్నాయి!
రాత్రి గడుస్తోంది.
తెల్లవారింది.
వార్త - కాదు దుర్వార్త!
మదనుడూ, దుష్టబుద్ధీ ఇద్దరూ నిహతులైనారు! కాళికాదేవి ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక వార్తాహరుని పంపారు. అటు మహారాజు ప్రాసాదానికీ, ఇటు అమాత్యుల భవనానికీ.
- ఆలయ ప్రాంగణమంతా అయినవారూ, కానివారూ అని లేకుండా జనంతో నిండిపోయింది. దారుణం అంటే దారుణం అనుకున్నారు. జరిగిన సంభవానికి కార్యకారణ సంబంధాల్ని అనే్వషించసాగారు కొందరు.
ప్రసేనుడు దీపపు సెమ్మెలా ఒక మూల నిలబడి ఉన్నాడు.
విషయ విలపిస్తున్నది. కొంత తెలిసీ, కొంత తెలియకా - అయోమయంలో ఉన్నదామె. విరజ విషయ పక్కగా కూర్చుని ఆమెని అనునయిస్తోంది.
చంపకమాలిని మరో పక్క ఉన్నది.
గాలవులు చంద్రహాసుని పక్కగా నిలిచి మహారాజుతో సంభాషిస్తున్నారు.
చంద్రహాసుడు అంతస్సంఘర్షణతో తల్లడిల్లుతున్నాడు. కాళికాలయం, పూజలలోని ‘ఆంతర్యం’ పూర్తిగా అర్థమైందతనికి. అయినా, మదనుని ఆలయానికి పంపటం అనేది తన తప్పిదంగా విశే్లషించుకుంటున్నాడు.
తటాలున అతని ఆలోచన తన కంఠహారంలోని విష్ణుశిల పైకి మరలింది.
‘అవును. దుష్టబుద్ధి తనకు పూజ్యుడు. (అంటే పిల్లనిచ్చిన మామ) మాత్రమే కాదు, కుంతల సామ్రాజ్యానికి మహామాత్యులుగానూ పూజ్యులే!

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600