సెంటర్ స్పెషల్

మహావిజేత 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రహాసుడూ, అక్షయుడూ, పద్మినీ, దుర్గీ వారు కూర్చున్న చోటనే మిగిలిపోయారు. దుర్గికి మాత్రం మనస్సులో కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. పద్మినిలాగా తానూ బాణాల్ని వేయలేక పోయాననే ఆత్మన్యూనత అది. చేతిలోని విల్లును అటూఇటూ మార్చుకుంటూ అధోముఖియై ఆలోచిస్తోంది.
దుర్గి అస్తిమితాన్ని, అంతరంగ మధననీ పసిగట్టాడు చంద్రహాసుడు. యధాలాపంగా చెప్పసాగేడు. ‘సముద్రంలో ‘తిమి’ అనే చేపని తిమింగలం తింటుంది. దాన్ని ‘తిమింగిలగిలం’ అనేది తింటుందిట. దాన్ని కూడా చంపి తినే ‘రాఘవం’ అనే జలజంతువు కూడా ఉందిట. అందుకనే తాటిచెట్టుని తనే్నవాడుంటే, వాడి తలదనే్నవాడూ ఉంటాడనే సామెత వచ్చింది. ‘మనందరిలోనూ నేను ఘనుడిననీ, ఘటికుడిననీ మీరు అందరూ తక్కువవారనీ అనుకోకండి. ప్రస్తుతం మనం విద్యాభ్యాసంలో ఉన్నాం. సమయం కూడా మించిపోయిందేమీ లేదు. మనసులో న్యూనతని పెంచుకోకూడదు. ‘ఉత్తమ నైపుణ్యాన్ని సాధించడానికీ, సామర్థ్యాన్ని పొందటానికీ మూలశక్తి ఒక ఆత్మవిశ్వాసమే’ - అని గురువుగారు ప్రతిరోజూ చెప్తున్నారు గదా. ఎవ్వరూ ఇంకొకరికన్నా తక్కువ కాదు. లక్ష్యాన్ని సాధించేవరకూ దీక్షతో సాధన చేద్దాం’
చంద్రహాసుని మాటలు దుర్గికి సంతృప్తినిచ్చాయి.
నడుస్తూనే అడిగింది పద్మిని, ‘అసలు నీకీ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి చంద్రా?’ ఆమె వైపు చూడకుండానే ముందడుగు వేస్తూ అన్నాడు చంద్రహాసుడు. ‘విశేషమేం లేదు. మీకంటే కొంత ఎక్కువగా ఈ లోకాన్ని చూశాను కదా. అదొక కారణం. మరొకటేమో...’ అని, ‘మీ అందరికంటే ముందు పుట్టాను కదా!’ అదోలా అన్నాడు.
అతని మాటలో చివరగా వచ్చిన తేడాను ఎవ్వరూ గమనించలేదు. గలగలా నవ్వేశారందరూ!
6
సంవత్సరాలు జరుగుతున్నాయి. పిల్లలు పెద్దవారవుతున్నారు.
కళింద్ర మండలం అభ్యున్నతి వీరశివుడికి కంటగింపుగా ఉంది.
కరదమండలాధిపతి వీరశివుడు గిరిజన, కొండ్ర తెగల వారిని అకారణ కలహాలకు రెచ్చగొట్టి, కళింద్ర మీదకు ఉసిగొల్పి కుళిందకునికి సమస్యలు సృష్టించటం చేస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు జరిగిందీ అదే. ఆ అలజడిని అణచి సరిహద్దులో తన పాలనాధికారులకి తగిన సహాయ సహకారాలూ, అధికారాలూ, వనరులూ సమకూర్చి తిరిగి వస్తున్నాడు కుళిందకుడు.
రథం సాగుతోంది.
కొండలూ, అడవులూ మార్గం దుర్గమంగా ఉంది. కరదకూ, కళింద్రకూ సరిహద్దులో ప్రయాణం సాగుతోంది.
దక్షణ్ణ, అడివప్ప, చంద్రహాసుడు, ఇతరులూ ముందు వెళ్తున్నారు.
మధ్యాహ్నమైంది. ఎండ కరకరలాడుతున్నది.
దక్షణ్ణ రథం పక్కకి వచ్చాడు. రథం ఆగింది.
‘ప్రభూ! ఈ ప్రాంతంలో మన మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేసుకునే వీలుంది. ఆ తర్వాత కొద్దిసేపు మీరు విశ్రమించవచ్చు’
‘సరి. కానివ్వండి’ అని అనుమతినిచ్చాడు ప్రభువు.
రథాన్ని దిగి ప్రక్కగా నిలిచాడు. చంద్రహాసుడు దిగి ఆయన ప్రక్కగా నిలబడ్డాడు. అతన్ని తేరిచూశాడు ప్రభువు. మీసాలు సొగసుతో మిసమిసలాడుతున్నాడు చంద్రహాసుడు. సన్నగా నవ్వుకున్నాడు -
కుళిందకుడు.
చూపుని పక్కకి మరల్చి పరిసరాల్ని గమనించాడు.
అక్కడ కొంత జనసంచారం ఉంది. పరిమిత సంఖ్యలో మనుషులు తిరుగుతున్నారు. ఒక అన్నసత్రం కనిపించింది. కానీ భోజన ఏర్పాట్లు లేవు. పరివారంలోని కొందరు ఆ ఏర్పాట్లు చూడటానికి భవనంలోకి వెళ్లారు.
అడివప్ప ముందు నడువగా కుళిందకుడూ, చంద్రహాసుడూ ఆయనను అనుసరిస్తూ సాగారు.
ప్రాంగణంలో ఒక మండపం ఉంది. భవనంలోకి ప్రవేశించారు. దాని లోకప్పుకు గల చిత్రాల్ని చూస్తున్నాడు మహారాజు. చాలా మనోజ్ఞంగా వున్నాయా చిత్రాలు.
కుడ్య చిత్రాలు కూడా చాలా ఆకర్షణీయంగా వున్నై. వాటిలో మరీ వీక్ష్యమానంగా ఉంది ఒక రాతిశిల్పం. సహజ సౌందర్యంతో శోభిల్లుతున్న అన్నపూర్ణ విగ్రహం అది. చేతిలో అక్షయ పాత్ర దాల్చి, చిరునవ్వుతో, చూపులతో కరుణామృతాన్ని పంచుతోంది ఆమె. ‘రండి, వడ్డన చేస్తాను. ఆరగిద్దురుగాని’ అన్నట్లుగా ఆమె కుడిచేతి నుంచీ గరిటెను ఎడమచేతిలోని పాత్రలోనికి దింపుతున్నట్లుగా ఉంది. చెవులకు పచ్చల్ని బోలిన అలంకరణ ఉంది. ముక్కున బులాకితో, మెడలో తొమ్మిది వరుసల కంఠాభరణాలతో, నడుమ వడ్డాణంతో, దండపురులతో అలంకృతయై ఉంది - అన్నపూర్ణాదేవి!
దక్షణ్ణ కూడా వచ్చి వారితో కలిశాడు. అందరూ దేవి విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తన్మయులవుతున్నారు.
క్షణాలు గడిచిన తర్వాత-
‘అంత ఆదరంతో బాటసారుల్ని స్వాగతిస్తున్న ఆ తల్లి విగ్రహానికి తగినట్లు ఇక్కడ భోజన వసతి ఏర్పాట్లు చేసి ఉంటే అనుకూలంగా వుండేది కదా ప్రభూ’ అన్నాడు చంద్రహాసుడు.
చంద్రహాసుని మాటలకు అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రభువు ఏమి సమాధానం చెబుతారోనని వేచి చూస్తున్నారు. ఆయన మాట్లాడలేదు.
మళ్లీ చంద్రహాసుడే, ‘ప్రజలకు ఉపయుక్తమయ్యే నిర్మాణాలతోపాటు, వాటి నిర్వహణ వ్యవస్థనీ ప్రభువులు పట్టించుకోవాలి కదా ప్రభూ’ అన్నాడు.
అడివప్పకీ, దక్షణ్ణకీ ఇబ్బందిగా ఉంది. అయినా చంద్రహాసుడి తెలివికి అబ్బురపడ్డారు. కుళిందకుని వైపు చూశారు. ఆయన పిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
‘నీ ప్రశ్నలు చాలా బాగున్నై. చంద్రహాసా, తగిన సదుపాయాలు కల్పిద్దాం’ అన్నాడు ప్రభువు.
సంభాషణను ప్రయాణం మీదకి మరల్చాడు అడివప్ప. ‘ఈ వేగంతో ప్రయాణాన్ని సాగిస్తే మనం రేపు సాయంత్రానికి చందనావతిలో ఉంటాము ప్రభూ’ అన్నాడు.
‘్భజనం, కొద్దిసేపు విశ్రాంతి తరువాత బయలుదేరవచ్చు’ నంటూ దక్షణ్ణ లేచి ఏర్పాట్ల పర్యవేక్షణకు వెళ్లాడు. ‘సరి’ అన్నాడు ప్రభువు.
జరిగిన గిరిజన సంఘర్షణ గురించే మాటలు సాగాయి. ‘ఈ పరిష్కారంలో చంద్రహాసుని సాహసమూ బాగా రాటుతేలింది’ అన్నాడు అడివప్ప.
దక్షణ్ణ వచ్చాడు. అందరూ భోజనాలకు లేచారు.
ఆ ప్రాంగణమంతా శుభ్రపరచబడి ఉంది. ముఖద్వారం ముంజూరు కింది వేదిక మీద ప్రభువుకూ, చంద్రహాసునికీ భోజనం ఏర్పాటు జరిగింది.
సంకటి, అంబలి, చిత్రాన్నాలతో ఊరుబిండి, తొక్కు - వడ్డనలు జరిగాయి.
భోజనం తర్వాత - కుళిందకుడు భవనం లోపల విశ్రమించాడు.
భటులిద్దరు అంపకోలలతో రక్షణ విధిలో ఉన్నారు.
పాంథశాల చుట్టూ ఒకసారి చూసి వద్దామనిపించింది చంద్రహాసునికి.
భవనం వెనుక భాగం ఒక గుట్టపైన నిర్మితమై ఉంది. ముందు భాగాన్ని చూసినప్పుడు సమతలంలో వున్నట్లు కనిపించినా వెనుకనున్న గుట్ట అంతా ఎగుడుదిగుడు రాళ్లతో, అస్తవ్యస్తంగా వ్యాపించిన వృక్షాలతో, పొదలతో నిండి అడవిలా ఉంది. పక్షుల, జంతువుల కూతలూ వినవస్తున్నై. తూర్పు నుంచీ బయలుదేరి దక్షిణ పశ్చిమాలలోని ఈ వివరాల నన్నింటినీ చూసి ఉత్తరంగా తిరిగి, అక్కడ సాలవృక్షాల తోపును చూసి, భవన ముఖద్వారం ముందుకు వచ్చి నిలిచాడు చంద్రహాసుడు.
ద్వారపాలకుడు ప్రభువుల అంగరక్షకుడే. పక్కకు చూశాడు. పరివారం భోజనాల కార్యక్రమం ముగియనుంది.
లోపలకు వెళ్లాడు కుళిందకుడు. శయన తల్పం పక్కన ఒక మూలగా నిలిపివున్న బరిగోలని చేతిలోకి తీసుకుని కొద్దిదూరం జరిగి, దానితో సాము చేస్తున్నట్టు ఆటగా తిప్పుతున్నాడు.
సరిగ్గా అప్పుడు జరిగింది - ఆ సంఘటన!
పడమర పంచాదిలో తచ్చట్లాడుతున్నది - గుడ్డేలుగు!
చూశాడు చంద్రహాసుడు.
అటువైపు తలుపు దగ్గరగా వేసి ఉంది. చంద్రహాసునికి ఒక్క క్షణం గుండె దడదడలాడింది. నిశే్చష్టుడై నిలిచాడు. ఎలుగు ప్రవర్తన, స్వభావం గురించి అతనికి బాగా తెలుసు. శబ్దం చేయకూడదు. తన దాది వకుళతో కలిసి అడవిదారిని ప్రయాణం చేస్తుంటే - ఒకరోజు ఎలుగు శక్తియుక్తులన్నీ తెలిసినాయి. తమకు పక్కగా నాలుగు విల్లుల దూరంలో - అది మనిషి వాసనను, ఉనికిని వెంటనే పసిగట్టిందట. మోరా, ముంగాళ్లూ ఎత్తి ఒక్కటే దూకు. పంజా విసరి మనిషి పుచ్చెను తీసింది. మెదడును జుర్రుకుని తృప్తిగా అడవిలోకి పోయింది! దాన్నీ, దాని చర్యనీ చూస్తూ తానూ, దాదీ - చెట్టు చాటున, తుప్ప వెనుక నక్కినక్కి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నిలబడిపోయారు.
ఒక్క క్షణం ఆనాటి సంఘటన కళ్ల ముందు మెదిలింది.
ఇంతలో ప్రభువు కలత నిద్రలో కళ్లు తెరిచాడు. చేతిలో బరిగోలతో నిలిచిన చంద్రహాసుని చూశాడు. ఆశ్చర్యంతో లేవబోయాడు. కనుసైగతో, చేయూపుతో ఆయన్ని వారించాడు చంద్రహాసుడు.
పక్కమీదే ఓరగా లేచి పరికించాడు కుళిందకుడు.
కిటికీ నుంచి ఎలుగు కనిపిస్తోంది. ఆపద అర్థమైంది. పక్కనున్న ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నిదానంగా లేచాడు. తలుపు నెట్టిందంటే ఎలుగు చంద్రహాసుని మీదికి దూకుతుంది అనుకున్నాడు.
ఈలోగా ఒక్క ఉదుటున ఎలుగు తలుపు రెక్కల్ని బలంగా నెట్టనే నెట్టింది! గుర్రుగుర్రున నోరు తెరిచి రొప్పుతోంది.
అంతే.. అది ఇటు లోపలికి దూకటం, అటు చంద్రహాసుడు బరిగోలతో దాని డొక్కలో పొడవటం తృటిలో జరిగిపోయినై. ఎలుగు కుప్పకూలింది!
అప్పుడే లోపలికి దూకిన అంగరక్షకుడూ దిగ్భ్రమ చెందాడు.
కుళిందకుడు నివ్వెరపోయాడు. ఎంత ధైర్యం, ఏమి వేగం? ఏకాగ్రతతో అమిత లాఘవంగా ఎలుగును కొట్టాడు? ఆశ్చర్యంతో చంద్రహాసుని దగ్గరకు తీసుకున్నాడు. భావానికి అందని అనుభూతితో అతని భుజాన్ని నిమురుతూ ఉండిపోయాడు. తలెత్తి చూసిన చంద్రహాసుడు ఆయన చూపుల్లోని అభినందనని వినయంగా స్వీకరించి - తల వంచి తన ప్రతిస్పందనని తెలిపాడు.
ఈ శబ్దాలకి అందరూ ఆత్రుతగా అక్కడికి చేరారు. ఎదురుగా ఒకవైపు నేలమీద బడి విలవిలలాడుతున్న ఎలుగు, రెండో పక్క చంద్రహాసుడూ, ప్రభువూ!
‘ప్రభువుకి అంగరక్షణ అంటే ఏమిటో చంద్రహాసుడు నిదర్శన పూర్వకంగా చూపాడీ రోజు. లేచిన వేళ మంచిది. నేనూ, అతడూ కూడా ఆపద నుంచీ బయటపడ్డాము’ అన్నాడు కుళిందకుడు.
జరిగిందేమిటో అందరికీ అర్థమయింది.
‘చంద్రహాసుడు సాహసి’ అన్నాడు దక్షణ్ణ. ‘సాహసం కంటే మిన్నగా కౌశలం కావాలి ఇటువంటి సమయాల్లో. అది ఈ చంద్రహాసుని వద్ద పుష్కలంగా వున్నదని తెలిసింది’ అన్నాడు అడివప్ప. అవునని ఇతరులు తలలు పంకించారు.
కొద్దిసేపు ఎలుగు ఊసులే సాగినై. స్థిమితపడిన కొంత తడవుకు ప్రయాణానికి ఆజ్ఞ ఇచ్చాడు ప్రభువు.
సన్నాహాలు పూర్తయినాయి. బయలుదేరారు.
వచ్చేటప్పుడు భటులకి చెప్పాడు కుళిందకుడు. ‘వెనుకనున్న తలుపుని అలాగే తీసి రండి. ఇక్కడున్నది ఆడ ఎలుగు. కొద్దిసేపటిలో మగ ఎలుగు దీనిని వెతుక్కుంటూ వస్తుంది. వాటి జాగ్రత్త వాటికుంది. దీన్ని ఎలా బ్రతికించుకోవాలో కూడా దానికి తెలుసు. పదండి’ అని.
రథం సాగుతూంటే, ఎలుగుతో తన గత అనుభవం చెప్పాడు చంద్రహాసుడు.
‘అవును. గుర్రం కంటే వేగంగా పరిగెత్తుతుంది. ఎలుగు చెట్లనూ ఎక్కగలదు. రాళ్లగుట్టలను కూడా అవలీలగా ఎక్కి దూకగలదు’ కుళిందకుడు అన్నాడు.
‘అంతకంటే విశేషం ఉంది. అది పండ్లు, దుంపల వాసనలను బట్టి భూమిని గోళ్లతో గీరుతూ, తలెత్తి నోరు తెరిచీ, మూసీ, పుట్టగడ్డల్ని మూతితో కెలుకుతూ నిర్భయంగా తిరుగుతుందిట. మా వకుళమ్మ చెప్పింది’
కళ్లు తిప్పుతూ, చేతులు గాలిలో ఆడిస్తూ, విచిత్ర విన్యాసాలతో మాట్లాడుతున్న చంద్రహాసుని చూస్తుంటే ఎంతో ముచ్చట వేసింది కుళిందకునికి. అప్రయత్నంగా మేధావినీ దేవి గుర్తుకొచ్చింది. ‘ఆమెకు ఎంత అపూర్వమైన సంఘటనను చెప్పనున్నాడు తాను. ఆమె ఇతనిని చూసి భర్త ప్రాణదాతగా కూడా గుర్తించి సంతోషిస్తుంది’ అనుకున్నాడు.
రథం సాగుతోంది. అడవి దారి రథానికి ఇరుపక్కలా అడివప్ప, దక్షణ్ణ వస్తున్నారు. ముందు వెనుకలుగా పరివారం వస్తోంది.
ప్రొద్దు వాటారుతోంది. సూర్యుడు తన పశ్చిమ నివాసానికి చేరటానికి తొందర పడుతున్నాడు.
7
గరిడీశాలలో వ్యాయామం ముగించుకుని వస్తున్నారు మిత్రబృందం.
పద్మినీ, దుర్గీ పరిగెత్తుకుంటూ వచ్చారు.
ముందు నడుస్తున్న అక్షయ చంద్రహాసుల్ని కేకేస్తూ, వారిని సమీపించారు.
ఇద్దరూ రొప్పుతున్నారు. బెరుకు బెరుగ్గా ఉత్తర దిక్కు వైపు చూస్తున్నది పద్మిని.
పద్మిని కళ్లల్లో అలజడిని గమనించాడు చంద్రహాసుడు. ‘ఏమైంది చెప్పు?’ అడిగాడు. అక్షయుడు కూడా ఉత్కంఠతో చూస్తున్నాడు.
పద్మిని ఆయాసపడుతోంది. మాటలు పెగల్చుకుంది. ‘చూడు. ఆ సంపెంగ చెట్టు వెనుక మద్దిచెట్టు వుంది కదా, ఆ వెనగ్గా పొదలు కనిపిస్తున్నాయి. ఆ పొదల వెనుక నుంచీ మీ మీదకి బాణాలు గురిపెట్టి ఉన్నారు. ఎవరో మనుషులు. సరిగా కనిపించలేదు. మా అలికిడికి పారిపోయారు. వెంటనే వెనక్కు తిరిగి చూశాను. మీరిద్దరూ కనిపించారు. అంటే వాళ్లు బాణాల్ని మీవైపే గురిపెట్టి చూస్తున్నారు’
దుర్గి తాను మాట్లాడుతూనే నడుస్తుండటం వలన వాళ్లని అంతగా గమనించలేదంది. బహుశ తమ మాటల శబ్దానికే వాళ్లు వెళ్లిపోయి ఉంటారని కూడా అన్నది.
అక్షయ చంద్రహాసులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతే. బాణవేగంతో పద్మిని చూపిన వైపునకు దూసుకుపోయారిద్దరూ!
ఎతె్తైన కొండలూ, గుట్టలూ, చుట్టూ కీకారణ్యం. చెట్లతో గాలి ఈలలు వేస్తూ దోబూచులాడుతోంది. చెట్ల మధ్యగా ఎండ చెరపట్టీలాట ఆడుతోంది. దూరంగా నక్కల ఊళలు వినిపిస్తున్నై. అడవి శునకాలు మొరుగుతున్నై.
పరిగెత్తుకుంటూ వచ్చిన చంద్రహాసుడూ, అక్షయుడూ క్షణం ఆగారు.
కనుచూపు మేర నిశితంగా పరికించాడు చంద్రహాసుడు. చెవులు రిక్కించి శబ్దాల్ని విన్నాడు. అంతే - తృటిలో చిరుత వేగంతో ముందుకు దూకాడు. సవ్వడిని నియంత్రించుకున్నాడు.
నాలుగు బారల దూరంలో గచ్చపొద... దాని వెనకగా నక్కి మోకాళ్ల మీద కూర్చుని ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. ఆవలి వైపునకు చూస్తున్నారు. నెమ్మదిగా ఆ ఇద్దరి వెనుకా చేరి, ప్రచండమైన ధాటితో, అతి తీవ్రమైన బలంతో వారి భుజాల మీద చరిచాడు. అప్పటికప్పుడే అతని వెనగ్గా అక్షయుడు వారిద్దరి పెడరెక్కలూ విరిచి ఒడిసి పట్టుకున్నాడు.
ఆ ఇద్దరు ఆగంతకులూ ఈ ధాటికి దిగ్భ్రమ చెందారు. మరుక్షణం చంద్రహాసుడు తన పట్టుదట్టీకి పైన నడుం చుట్టూ కట్టుకున్న అతి సన్నని ఇనుప గొలుసుని లాగాడు. దానితో ఒక వ్యక్తి చేతుల్ని మడిచి కట్టేశాడు. ఆ గొలుసుకి చుట్ట చుట్టుకునే సౌలభ్యం, సాగే గుణం రెండూ వున్నై. దాన్ని కాలలోహవల్లి అంటారని చెప్తారు పురుషోత్తములు. ఇటువంటి సందర్భాల్లో అది పొడవైన తాడులా ఉపయోగపడుతుంది. చంద్రహాసుని చూసి అక్షయుడు తాను కూడా తన వల్లిని లాగి వారిలో రెండవవాడి చేతుల్ని కట్టేశాడు.
చంద్రహాసుడు వారి గురించి ప్రశ్నించాడు. వారి నుంచీ సమాధానం లేదు. వౌనమే ప్రతిచర్యగా నిలబడ్డారు.
కింద పడి వున్న విల్లమ్ములూ, పిడిబాకులూ చేతిలోకి తీసుకొని, వారిద్దరినీ పట్టుకుని నడిపించుకుంటూ నగరం వైపునకు సాగారు అక్షయుడూ, చంద్రహాసుడూ.
నగరం చాలా దూరంలో ఉంది.
8
రాచనగరుకు వెనుక అరక్రోసు దూరంలో - పంగల గుట్ట.
పంగలగుట్ట అంటేనే మండు వేసవిలో రాళ్లు పగులుతాయనే దానికి నిదర్శనం. ఆ గుట్ట మీది రాళ్లన్నీ చెట్ల కొమ్మల్లా వివిధ ఆకారాల్లో విస్తరించి ఉంటాయి. నెత్తి మీద సూర్యుడి ప్రతాపం. నేల మీద ఈ రాళ్లు కక్కుతున్న సెగలు!
అయినా, కరకరలాడుతున్న ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా, ఉత్సుకతతో చేరిపోయారు జనం.
గుట్ట మీద ఓ పక్కగా - చెట్ల గుబురు ఉంది. అక్కడ కొంచెం నీడపట్టు ఉంది. ఆ నీడ పట్టున సింగన్న తన భటులతో నిలిచి ఉన్నాడు.
సింగన్న పక్కగా - అక్షయ చంద్రహాసులూ, దుర్గీ, పద్మినీ వున్నారు.
చందనావతిలోకి ఎవరో ఇతర రాజ్య గూఢచారులు ప్రవేశించారనీ, వారిద్దరినీ చంద్రహాసుడూ, అక్షయుడూ పట్టి తెచ్చారనీ, అక్కడ వున్న జనం అందరిలోనూ కలకలం సాగుతోంది. అందరూ ఆ విషయాన్ని గురించే చర్చిస్తున్నారు.
‘అసలు వాళ్లను చూసింది నేను - చెప్పింది నేను. మీరంతానేమో వాళ్లని మెచ్చుకుంటున్నారు’ గునుస్తూ అంది పద్మిని. సన్నగా నవ్వుకున్నాడు చంద్రహాసుడు.

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600