సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు..12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మా ఊళ్లో పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో సుజాతనగర్‌లోని స్థలం కొని ఇల్లు కట్టాను. అప్పట్లో ఆ ప్రాంతంలో పగలే దొంగతనాలు జరుగుతూ ఉండేవి. అందుచేత ఆ ఇంట్లో ఉండటానికి ధైర్యం సరిపోలేదు. మా పిల్లలిద్దరికీ సిటీలోని స్కూళ్లలో సీట్లు వచ్చాయి. ఇల్లు అమ్మకానికి పెడితే, ఒరిస్సా నుంచి వచ్చిన ఓ జంట మూడున్నర లక్షలకి కొనుక్కుంది. నేను నా కుటుంబంతో సిటీకి వచ్చేశాను’ వివరంగా చెప్పాడు.
‘మీ దగ్గర ఇల్లుకొన్న వ్యక్తి బలరామ్ సాహు. అతనికి బంధువులు ఎవరన్నా ఉన్నారా? బేరం కుదుర్చుకున్నప్పుడు కాని రిజిస్ట్రేషన్ సమయంలో కాని అతని వెంట ఎవరైనా వచ్చారా?’
తల అడ్డంగా ఊపాడు పరంధామయ్య.
‘బలరామ్ సాహు ఒక్కడే వచ్చి బేరం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అతని భార్య వచ్చింది. దబ్బపండు రంగులో ఎత్తుగా, అందంగా ఉందామె. డబ్బు మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర చెల్లించారు. తాళాలు తీసుకుని అదే రోజు సాయంకాలం వాళ్లిద్దరూ ఆ ఇంట్లో దిగిపోయారు.’
అతని నుండి తెలుసుకోడానికి మరేం లేకపోవడంతో కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాడు యుగంధర్.
ఆ కేసుకి సంబంధించిన రిపోర్టు మూడు కాపీలు తయారుచేయించి ఒకటి పోలీసు కమిషనర్‌కి, మరోటి జిల్లా కలెక్టర్‌కి పంపించాడు. నగలు, డాక్యుమెంట్లు ఓ ఐరన్ బాక్స్‌లో ఉంచి, సేలువేసి ప్రాపర్టీ రూముకి అప్పగించాడు. అదంతా పూర్తయ్యాక ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ కేసు అంతటితో ముగియలేదని యుగంధర్‌కి తెలియదు.
* * *
‘వివేక్‌గాడు తోక జాడిస్తున్నాడు’
‘ఏమైంది?’ అడిగేడు గంగోత్రి.
‘సాధారణంగా కస్టమర్లు నెలకి ఒకటి రెండుసార్లు మనని కాంటాక్ట్ చేస్తారు. నగరంలోని మన కస్టమర్లలో మూడు నెలల నుంచి ఇద్దరి నుండి ఎలాంటి బిజినెస్ లేదు. వాళ్లకి ఫోన్ చేస్తే మరెప్పుడూ చెయ్యొద్దని, తమకి అలాంటి అవసరం లేదని చెప్పారు. రికార్డు ప్రకారం ఆ ఇద్దరి కస్టమర్ల దగ్గరికి చివరిగా వెళ్లినవాడు వివేక్..
గంగోత్రి నొసలు ముడిపడింది.
‘అతనొక్కడేనా? ఇంకెవరైనా ఉన్నారా?’
‘లేదు. వీడొక్కడే అతి తెలివి చూపిస్తున్నాడని నా అనుమానం’
‘అనుమానం తీర్చుకుంటే పోతుందిగా’ నవ్వేడు గంగోత్రి.
‘ఎలా?’
‘ఏం చెయ్యాలో చెప్పాడు.
8
‘అతగాడెవరు?’ అడిగింది రమణిమాల.
రాసమణి ప్రశ్నార్థకంగా చూసింది.
‘నాలుగు రోజుల క్రితం నీకు ఫోన్ చేసిన వ్యక్తి’
‘అపరిచితుడు’ నవ్వి చెప్పింది రాసమణి.
‘నీ నెంబరు ఎలా సంపాదించాడు? అతని మాటల్నిబట్టి కొంత అమాయకత్వం ఉన్నట్టు అనిపించింది’
‘నిజమే... గతంలో ఎప్పుడో నా దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి అతనికి స్నేహితుడట. నా సెల్ నెంబరు ఇచ్చి సాయం చెయ్యమన్నాడట. అప్పుడు కుదరక సంవత్సరం తర్వాత ఇప్పుడు కాంటాక్ట్ చేశాడు. ఆలోచిస్తే అప్పుడు నేను చిక్కుకున్న దుర్భర పరిస్థితిలో ఎవరైనా సాయపడితే నా జీవితం మరోలా ఉండేది. అదంతా గతం’ చెప్పింది రాసమణి.
ఆ గది మధ్యలో ఉయ్యాల ఒకటి ఊగుతోంది. అందులో ఓ చంటిబిడ్డ ఆదమరచి నిద్రపోతోంది. బుగ్గ మీద చుక్కతో ఆ బిడ్డ ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. పూజ గది నుండి వెలువడుతున్న అగరొత్తుల వాసన మొత్తం అపార్ట్‌మెంట్‌ని చుట్టుముట్టింది. పనులన్నీ ముగించుకుని తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్లిద్దరూ.
‘ఇంతకీ అతనేమంటాడు?’ అడిగింది రమణిమాల.
‘ఏమీ అనలేదు. జరిగింది చెప్పాడంతే..’
‘నీ మీద కోరిక ఉన్నట్టు కనిపించాడా?’
‘లేదు’
‘అతన్ని అంత తేలిగ్గా తీసి పారేయకూడదు..’ సాలోచనగా అందామె.
రాసమణి నవ్వింది.
‘యుద్ధం ముగిసాక ఆయుధాలతో పనిలేదు. చినిగిన విస్తరాకు వంటివి మన జీవితాలు. బయట లోకం ఇంత అన్యాయంగా ఉంటుందని తెలియక జీవితంలో రెండు తప్పులు చేశాను. వాటి ఫలితంగా నేను, నా కూతురు ఈ భూమీద ఒంటరిగా మిగిలిపోయాం. శరీరంలో ఆకర్షణ ఉన్నంతకాలం జీవితం సాగుతుంది. ఆ తర్వాత ఏమిటనే ప్రశ్నకు జవాబు లేదు. కూలివాడి భార్యకు కూడా కొంత కుదురుంటుంది. తెగిన గాలిపటం ఎటుపోతుందో ఎవరికీ తెలియనట్టే మన జీవితాలు ఏ తీరం చేరతాయో తెలియదు. కావాలని పనిగట్టుకుని నా జీవితాన్ని ఎవరో నాశనం చెయ్యలేదు. అమాయకత్వంతో నేనే పాడు చేసుకున్నాను’ ఆమె గొంతు గద్గదమైంది.
రమణిమాల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చెప్పింది తనకీ వర్తించడంతో. తెలిసీ తెలియని వయసులో తనొక్కదానికే ప్రేమనే అద్భుతం చిక్కినట్టు భ్రమపడింది. అది ప్రేమ కాదని గ్రహించేసరికి నడిసముద్రంలో ఒంటరిగా మిగిలిపోయింది.
తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అయినా సరే తమ ఒక్క కూతుర్ని చదివించి గొప్పదాన్ని చెయ్యాలని, మంచి జీవితం అందించాలని తాపత్రయపడ్డారు. స్కూలు పాఠాల కంటే ప్రేమ పాఠాలు ఆకర్షించాయి. తల్లిదండ్రులు, భవిష్యత్తు వంటివి గుర్తు రాలేదు. అసలు తప్పుదారి పట్టినట్టే తెలియదు. ఇప్పుడవన్నీ గుర్తుచేసుకుంటే తన అజ్ఞానానికి నవ్వొస్తుంది. ఆకాశంలోని చందమామని పట్టుకొస్తానని, నువ్వు పక్కనుంటే ఈ ప్రపంచాన్ని జయిస్తానని చెప్పిన మాటలు నిజాలని తను ఎలా నమ్మిందో ఎంత ఆలోచించినా ఇప్పుడు అర్థం కావటంలేదు.
రమణిమాల ఆలోచనల నుంచి తేరుకుని ఎదురుగా ఉన్న రాసమణి ముఖంలోకి చూసింది. అప్పటికే ఆమె మామూలు స్థితికి వచ్చిందని గ్రహించింది.
‘అతన్ని ఓసారి కలుద్దామా?’ అడిగింది.
‘ఎందుకు?’ రాసమణి ముఖం చిట్లించింది.
‘మంచికో చెడ్డకో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అదీ అతను వెతుక్కుంటూ వచ్చాడు. నిజానికి మన బతుకుల్లో స్నేహం కోసం పాకులాడే మనుషులు కనిపించరు. అలాగే మన నుండి ఏం పిండుకుందామా అని తప్ప సాటి మనిషితో మాట్లాడినట్లు మాట్లాడరు. చాలా కాలానికి మన గోడు చెప్పుకోవడానికి ఓ మనిషి దొరికాడు. అతన్ని కలిసి మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. మనుషుల్లో మహాత్ములు ఉంటారట. చూద్దాం...’
తల అడ్డంగా ఊపింది రాసమణి.
‘్భపతి మనుషులకు తెలిసిందంటే అంతే సంగతులు. ఓ అమాయకుడ్ని ప్రమాదంలోకి ఎందుకు లాగడం? అతను మనకు చేసిన అన్యాయం ఏమీ లేదు. నన్ను కలిసి సాయం చెయ్యమని చెప్పిన మనిషి కూడా జీవించిలేడు. నా గురించి కొంత తెలుసుకున్నాడు. కాబట్టి మరోసారి ఫోన్ చేస్తాడని నేను అనుకోవడం లేదు.’
రమణిమాల మాట్లాడలేదు.
సరిగ్గా అప్పుడు మోగింది రాసమణి సెల్. ఆమె కాల్ రిసీవ్ చేసుకుంది.
‘నేను రాజేష్‌ని..’ అటు నుంచి వినిపించింది.
రాసమణి గొంతు మూగబోయింది.
* * *
ఉదయం ఎనిమిదికి పోలీసుస్టేషన్ చేరుకున్నాడు యుగంధర్. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప రోజూ ఆ సమయానికి వస్తానని ముందే చెప్పడంవల్ల స్టేషన్ చైతన్యవంతంగా ఉంది. అప్పటికే పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి.
స్టేషన్ రైటర్ సెల్యూట్ చేసి చెప్పాడు.
‘రాత్రి నైట్ పెట్రోలింగ్‌కి ఎస్సైగారు వెళ్లారు సార్! విశేషాలు ఏమీ లేవు’
తలూపి అడిగేడు యుగంధర్.
‘మన సర్కిల్లో ఎన్ని కేసులు పెండింగ్‌లో వున్నాయి?’
‘దొంగతనం, దోపిడీలకు సంబంధించి పధ్నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి సార్! దర్యాప్తులో ఎలాంటి సమాచారం చిక్కలేదు. పాత నేరస్థుల్ని స్టేషన్‌కి పిలిచి విచారించినా ప్రయోజనం లేకపోయింది. మన స్టేషన్ ఏరియా మనిషి ఒకతను మిస్సింగ్ అని రిపోర్టు వచ్చింది. రెండు రోజుల తర్వాత అతని శవం కోటపాడు ప్రాంతంలోని సర్వే తోటలో కనిపించింది. అతని శరీరం మీదున్న బంగారం, డబ్బుతోపాటు సెల్‌ఫోన్ కూడా దొంగిలించారు. ఇది మీరు రావడానికి నెల రోజుల ముందు జరిగింది’ తడుముకోకుండా చెప్పాడు రైటర్.
ప్రతీ స్టేషన్‌లో రైటర్ పోస్టు కీలకమైంది. సమర్థుడ్ని చూసి రైటర్‌గా నియమిస్తాడు స్టేషన్ అధికారి. మొత్తం స్టేషన్ మెయిన్‌టెనెన్స్ అతనే చూసుకుంటాడు. సిబ్బందిని డ్యూటీలకు పంపడం దగ్గర నుంచి రికార్డు జాగ్రత్త చెయ్యడం వరకూ అతనిదే బాధ్యత.
‘తర్వాత ఏమయింది?’
‘కోటపాడు ఎస్సైగారిని కాంటాక్ట్ చేసి మిస్సింగ్ రిపోర్టు కాపీ పంపించాం. అలాగే వాళ్ల దర్యాప్తు సమాచారం తీసుకుని ఫైల్ చేశాం. ఇంతవరకూ హత్య చేసిందెవరో తెలియలేదు’
‘ఆ ఫైల్ తీసుకురా...’ చెప్పాడు యుగంధర్.
పది నిమిషాల్లో ఫైల్ అందుకుని చదవసాగేడు.
కుమార్ అనే వ్యక్తి అయిదేళ్ల నుంచి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. అతను రెండు నెలలు సెలవులో ఇంటికొచ్చి పక్క గ్రామంలోని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన ఇరవై రోజులకి హత్య చెయ్యబడ్డాడు. అతనికి శత్రువులు ఎవరూ లేరు. అలాగే గ్రామ రాజకీయాల జోలికి వెళ్లే మనిషి కాదు. అక్రమ సంబంధాలు కాని ఆస్తులకు సంబంధించిన తగవులు గాని లేవు. మనిషి ఎవరి జోలికి పోని సాత్వికుడు.
హత్య సాయంకాలం ఆరు నుంచి ఏడు మధ్య జరిగింది. ఆ రోజు ఉదయం అత్తవారు పెట్టిన కొత్త బైక్ డెలివరీ తీసుకున్నాడు. దాన్ని అత్తవారి ఇంటి వద్ద వదిలి రాత్రికి ఆలస్యంగా వస్తానని చెప్పి సాయంకాలం నాలుగు గంటలకి బయలుదేరాడు. ఆ రోజు, మరునాడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చారు. ఆ తర్వాత రోజు కోటపాడు ప్రాంతంలో కుమార్ శవం దొరికింది. మెడ చుట్టూ తాడు బిగించి ఊపిరి ఆడకుండా చెయ్యడంతో మరణించాడు. అతని ఒంటి మీదున్న బంగారం కోసం హత్య జరిగినట్టుగా అభిప్రాయపడి ఆ కోణంలో దర్యాప్తు చేసాడు అధికారి. ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
కుమార్ హత్య జరిగిన ప్రదేశానికి అత్తవారింటికి మధ్య పాతిక కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం అతను ఎందుకెళ్లాడు? ఎవరితో వెళ్లాడు? పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం చనిపోవడానికి ముందు కుమార్ మద్యం తాగినట్టు, పచ్చి మిరపకాయ బజ్జీలు తిన్నట్టు బయటపడింది. అంటే అతనితో మందు తాగించి చంపారా? దాని కోసమే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారా? ఒంటి మీదున్న బంగారం, డబ్బు గురించి హత్య జరిగితే సెల్‌ఫోన్ ఎందుకు తీసుకెళ్లినట్టు? హత్యకి సంబంధించిన సమాచారం ఏదైనా అందులో ఉందా?
ఆ ఫైలు చదవడం పూర్తయ్యేసరికి యుగంధర్ బుర్ర ప్రశ్నలతో నిండిపోయింది.
పెళ్లైన ఇరవై రోజులకి జరిగిన దారుణం ఇది. దీంతో రెండు కుటుంబాలు తల్లడిల్లి ఉంటాయి. ముఖ్యంగా అతన్ని చేసుకున్న అమ్మాయి గుండెకోత అంతా ఇంతా కాదు. ఈ కేసులో కుమార్‌ని చంపిన వాడిని పట్టుకుని ఆ రెండు కుటుంబాల వారికి మనశ్శాంతి కలిగించాలి.
కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు యుగంధర్. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్‌ని పిలిచి ఏం చెయ్యాలో చెప్పి పంపించాడు.
ఒక స్టేషన్ ఏరియా మనిషి మరో స్టేషన్ ఏరియాలో హత్యకి గురైతే దర్యాప్తు పరంగా కొన్ని చిక్కులు వస్తాయి. అలాంటి సందర్భంలో రెండు స్టేషన్ల అధికారులు కూడబలుక్కుని ఒక్కరే కేసు డీల్ చెయ్యాలి. సాధారణంగా శవం దొరికిన ఏరియా పోలీసులే హత్య కేసు శోధిస్తారు. ఆ ఉద్దేశంతోనే గతంలో పని చేసిన ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యం చేసి ఉంటాడు.
ఆ తర్వాత తన రొటీన్ వర్క్‌లో మునిగిపోయాడు యుగంధర్. హతుని గ్రామానికి వెళ్లిన కానిస్టేబుల్ రెండు గంటలు గడిచాక ఓ సెల్ నెంబర్ తెచ్చి ఇచ్చాడు. అది బి.ఎస్.ఎన్.ఎల్. నెట్‌వర్క్ నెంబర్. దానికి కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని జవాబు వచ్చింది. తన పర్సనల్ డైరీలోని ఓ నెంబర్‌కి కాల్ చేశాడు. అవతల కాల్ రిసీవ్ చేసుకున్నాక చెప్పాడు.
‘గుడ్‌మార్నింగ్ సార్! నేను యుగంధర్ని’
‘మార్నింగ్ సార్! ఏమిటి హఠాత్తుగా గుర్తొచ్చాను మీకు’
‘ కేసు దర్యాప్తులో మీ సాయం కావాలి’
‘అంతకంటేనా.. నేను మీకు రుణపడి ఉన్నాను. చెప్పండి’
ఆ సెల్ నెంబర్ చెప్పి, ‘జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకూ కాల్స్ లిస్టు కావాలి. అలాగే ఆ సెల్ స్విచ్ ఏ సమయంలో ఆఫ్ అయిందో కూడా కావాలి’ అన్నాడు యుగంధర్.
‘ఓ గంటలో ఇస్తాను’
‘్థంక్యూ..’ చెప్పి కాల్ కట్ చేశాడు.
ఆ అధికారి ఫోన్ నెంబర్ ఓ కాగితం మీద రాసి కానిస్టేబుల్ చేతికిచ్చి చెప్పాడు.
‘సిటీలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుకి వెళ్లి ఈ నెంబర్‌కి కాల్ చేసి నేను పంపానని చెప్పు. అతను ఇచ్చిన కవరు తీసుకురా...’
అతను వెళ్లిన అరగంటకి కుమార్ అత్తవారి ఊరు వెళ్లిన కానిస్టేబుల్ వచ్చాడు. అతను చెప్పిన సమాచారం జాగ్రత్తగా విన్నాడు యుగంధర్. అతన్ని పంపేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. కుమార్ కేసులో ముఖ్యమైన మెలిక ఏదో ఉంది. తెలిసిన వాళ్లే అతన్ని హతమార్చారు. దానికి బలమైన కారణమే ఉంటుంది. అది తెలిస్తే కేసు మబ్బులా విడిపోతుంది.
లంచ్ స్టేషన్‌కి తెప్పించుకున్నాడు యుగంధర్.
సరిగ్గా మధ్యాహ్నం మడుకి కాల్స్ లిస్టు చేతికొచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకూ కాల్స్ చాలా వున్నాయి. జూన్ ఇరవై ఒకటి అంటే హత్య జరిగిన రోజు. మధ్యాహ్నం మూడున్నరకి ఓ కాల్ ఉంది. దాన్ని అండర్‌లైన్ చేశాడు. ఇరవై రోజుల్లో ఆ నెంబరు చాలాసార్లు రిపీట్ అయ్యింది. అలా ఎక్కువగా చేసిన నెంబర్ మరొకటి లేదు.
తల పంకించాడు యుగంధర్.
*

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994