పశ్చిమగోదావరి

శాస్ర్తియ దృక్పథంతోనే అద్భుతాల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ సభలో డిఇఒ మధుసూదనరావు:విద్యార్థులను బాల మేధావులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపు
భీమవరం, డిసెంబర్ 18: విద్యార్థులు ప్రతీ అంశాన్ని శాస్ర్తియ దృక్పథంతో పరిశీలించి ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకున్నప్పుడే అద్భుతాలు పుట్టుకొస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి మధుసూదనరావు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే బాలమేధావులు రాణిస్తారన్నారు. జివిఐటి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతాంజలి ఇంగ్లీషు మీడియం స్కూల్లో జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనను డిఇఒ మధుసూదనరావు, నరసాపురం సబ్ కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఒ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సైనే్స జీవితంగా బతికినప్పుడు గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఆవిర్భవిస్తాయని, ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు బిడియం, సిగ్గు పక్కనపెట్టి సైన్స్‌లోని సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
సబ్-కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ భిన్నంగా, తార్కికంగా ఆలోచించినప్పుడే వినూత్న ఆలోచనలు ఆవిష్కరిస్తాయన్నారు. దేశానికి అవసరమైన ప్రగతి విద్యార్థుల చేతుల్లో ఉందని తెలిపారు. మానవ మేథస్సుతోనే ఇంతటి ప్రగతి సాధించామన్నారు. విద్యార్థుల ఆలోచనలకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదిక నిలుస్తాయన్నారు. గొప్ప గొప్ప శాస్తవ్రేత్తలను స్ఫూర్తిగా తీసుకుని బాల మేధావులు రాణించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాణించాలంటే టెక్నాలజీని దుర్వినియోగం చేయవద్దని హితవుపలికారు. జివిఐటి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి వెంకట్రావు, గ్రంధి సురేష్‌లు మాట్లాడారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులను డిఇఒ, సబ్ కలెక్టర్లు పరిశీలించి, వివరాలు అడిగితెలుసుకున్నారు. జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ కన్వీనర్‌గా భీమవరం డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి మద్దూరి సూర్యనారాయణమూర్తి వ్యవహరిస్తున్నారు. సర్వశిక్షాభియాన్ సిఎంఒ కృష్ణారావు, జడ్పీటీసీ బర్రె విజయ, గ్రంది స్వప్న, డాక్టర్ కెఎస్‌ఎన్ ప్రసాద్, త్సవటపల్లి సాయి వెంకన్నబాబు, డిసిఇబి సెక్రటరీ టిఎస్‌ఎన్ మూర్తి, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎన్ సాయి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, ఎంఐ విజయ్‌కుమార్, చిన్నయ్య, శ్రీనివాస్, కుమార్, శ్రీమన్నారాయణ, జొన్నగడ్డ శామ్యూల్, రేపాక వెంకన్నబాబు, గంగాధరరావు, సుందరకుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు.

పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలి
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, డిసెంబర్ 18: జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్మోహమాటంగా వ్యవహరించి నూరుశాతం ప్రగతి సాధించే దిశగా పనిచేయాలని సంబంధితాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవో (పిఆర్ అండ్ ఆర్‌డి)లతో నిర్వహించిన సమావేశంలో పన్ను వసూళ్లు, ఇ-పంచాయితీ, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గ్రామ పంచాయితీల్లో పన్ను వసూళ్ల తీరు అసంతృప్తికరంగా వుందన్నారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి బకాయిలను రానున్న నాలుగు వారాల్లో వసూలు చేయాలన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి పన్ను అంచనాల కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లను వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతీ ఇవో (పి ఆర్ అండ్ ఆర్‌డి) తమకు నిర్ధేశించిన ప్రధాన కార్యస్థానంలోనే కచ్చితంగా నివాసముండాలని కలెక్టర్ ఆదేశించారు.
పనితీరు ఆధారంగానే బదిలీలు
ఇకపై ఆస్తిపన్ను వసూళ్లు, ఇ-పంచాయితీ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలలో పనితీరు ప్రాతిపదికగా ఇవో (పి ఆర్ అండ్ ఆర్‌డి)ల బదిలీలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇ-పంచాయితీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఇకపై జనన, మరణ ధ్రువపత్రాలు రాతపూర్వకంగా ఇవ్వడానికి వీల్లేదన్నారు. పాత రిజిష్టర్లను సంబంధిత తహశీల్దారు నుండి పొంది, జనన, మరణ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన పిమ్మట వాటిని తిరిగి అప్పగించాలన్నారు. ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డులు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి తదుపరి సమావేశానికి అందజేయాలన్నారు. శాస్ర్తియ పద్దతిలో చెత్తను వర్గీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్లజర్ల మండలంలో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇవో (పి ఆర్ అండ్ ఆర్‌డి)లు పరిశీలించాలన్నారు.
పల్లెలకు ఎల్‌ఇడి వెలుగులు
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రస్తుత వీధి దీపాల స్థానే ఎల్ ఇడి బల్బులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో ఉన్న వీధి దీపాలు, వాటి ఓల్టేజీ వివరాలను వెంటనే తెలియజేస్తే జిల్లాలోని అన్ని గ్రామాల్లోని వివరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు.
అదే విధంగా ప్రతీ పంచాయితీలో వాటి ఆధ్వర్యంలో వినియోగిస్తున్న విద్యుత్తు సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఎపి ఇపిడిసి ఎల్ సమ్మతించిందని, ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఎన్ని సర్వీసులున్నదీ, ఎన్ని మీటర్లు అవసరం అనే విషయంపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. మీటర్ల ఏర్పాటు, ఎల్ ఇడి బల్బుల వినియోగం మూలంగా ప్రస్తుతం గ్రామ పంచాయితీలకు వస్తున్న విద్యుత్తు బిల్లుల్లో 30 నుండి 40 శాతం వరకూ ఆదా అవుతుందని చెప్పారు. గ్రామ పంచాయితీల్లో కొనుగోలు చేసే వివిధ సామాగ్రికి సంబంధించి జాయింట్ కలెక్టరు సమక్షంలో జిల్లా కొనుగోలు కమిటీలో ధరలు నిర్ధారించాలన్నారు. ఇకపై ప్రతీ వారం పంచాయితీల్లో ఆస్థిపన్ను వసూళ్లు, ఇ-పంచాయితీ అమలు, పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయితీ స్థలాల్లో ఆక్రమనలు, అనుమతుల్లేని లే అవుట్లు తదితర అంశాలపై సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సమగ్ర సమాచారంతో డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవో (పి ఆర్ అండ్ ఆర్‌డి)లు హాజరుకావాలన్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ జిల్లా పంచాయితీ అధికారి జి రాజ్యలక్ష్మి, డ్వామా పిడి రమణారెడ్డి, డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవో(పి ఆర్ అండ్ ఆర్‌డి)లు తదితరులు పాల్గొన్నారు.

ఏడు రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక
ఎన్టీఆర్ గృహ నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష:నియోజకవర్గానికి 1250 ఇళ్లు
ఏలూరు, డిసెంబర్ 18 : జిల్లాలో గ్రామ పంచాయితీల వారీగా అర్హులైన పేదలకు ఎన్‌టిఆర్ గృహ పథకం కింద ఇళ్లు నిర్మించడానికి జాబితాలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఎంపిడివోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపిడివోలు, తహశీల్దార్లు, ఆర్‌డివోలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1250 మంది పేదలకు తొలిదశగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ మేరకు జాబితాలను సిద్ధంచేస్తే వాటిని జన్మభూమి కమిటీలు పరిశీలించి ఏడు రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. గ్రామ జన్మభూమి కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆయా మండల అభివృద్ధి అధికారులు జాబితాలను రూపొందించుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రజలకు క్రిస్మస్ కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకూ జిల్లాలోని క్రైస్తవులు చౌకడిపోల్లో క్రిస్మస్ కానుక నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. జిల్లాలో చంద్రన్న సంక్రాంతి కానుక కింద ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకూ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తామన్నారు. మీ-సేవ ద్వారా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమంలో ఫిర్యాదుదారులకు జవాబుపత్రాన్ని అందజేసే విధంగా రాబోయే జన్మభూమి కార్యక్రమంలో కూడా ప్రతీ అర్జీదారునికి జవాబుదారీ పత్రాన్ని అందజేయవలసిన బాధ్యత సంబంధితాధికారులపై ఉన్నదని చెప్పారు. జన్మభూమిలో జిల్లాలో 3992 అర్జీలు పెండింగ్‌లో ఉండగా గడువు దాటిన అర్జీలు నిడదవోలు మండలంలో 764, కుకునూరు మండలంలో 724, వేలేరుపాడులో 660 ఫిర్యాదులు అధికంగా పరిష్కరించాల్సి వుందని, వెంటనే ఫిర్యాదుదారుల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. జిల్లాలో 12 మండలాల్లో మీ-కోసం దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయని, వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. జనవరి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న జన్మభూమి కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, జన్మభూమి కార్యక్రమంలో కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీదారులిచ్చిన దరఖాస్తులకు రశీదులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు 65:35 లేదా 50 :50 నిష్పత్తిలో ఏది అనువుగా ఉంటే దాన్ని ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గానికి ఇచ్చిన టార్గెట్ మించి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు మంజూరు చేసేది లేదని చెప్పారు. ఈ దిశగా తప్పనిసరిగా ఎంపిడివోలు ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో జిల్లాలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతున్నాయని, కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనిదినాలు పెంచాలని గ్రామాల్లో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి రమణారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డి ఆర్‌వో కె ప్రభాకరరావు, జడ్పీ సిఇవో డి సత్యనారాయణ, సిపివో కె సత్యనారాయణ, డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

22న మెగా ఆక్వాఫుడ్ పార్కుపై సమరభేరి
భీమవరం, డిసెంబర్ 18: గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 22వ తేదీన తుందుర్రు గ్రామంలో సమరభేరి పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆక్వాఫుడ్ పార్కు వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ ఆరేటి వాసు చెప్పారు. ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేస్తామన్నారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, కెవిపిఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ బహిరంగ సభకు ఆహ్వానించినట్లు తెలిపారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు యాజమాన్యం దళితుల మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. శుక్రవారం భీమవరం సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పోరాట సమితి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. ఫ్యాక్టరీని తరలించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో కమిటీలను ఏర్పాటుచేసి, జల దీక్షలు చేస్తామన్నారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో పర్యటించి 10వేల మందితో సంతకాల సేకరణ చేస్తామని తెలిపారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని, హైదరాబాద్‌లోని మంత్రులకు, అధికారులకు నివేదికను సమర్పిస్తామన్నారు. అలాగే పోస్టుకార్డుల ఉద్యమం చేస్తామన్నారు. రోజుకో గ్రామం చొప్పున 5 మండలాల్లోని 30 గ్రామాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు జీపులలో తిరిగి ప్రజాచైతన్య యాత్రను చేసి, కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఆర్‌టిఐ ప్రకారం ఫ్యాక్టరి యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించిందని ఆరోపించారు. సమావేశంలో సముద్రాల వెంకటేశ్వరరావు, జవ్వాది సత్యనారాయణ, సిపిఎం జిల్లాపార్టీ సభ్యులు జెఎన్‌వి గోపాలన్, కోరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ కోటాలో కాదు... మా వాటా అడుగుతున్నాం
బీసీ సంఘాలకు కాపునాడు నేతల స్పష్టీకరణ
భీమవరం, డిసెంబర్ 18: కాపులను బీసీల్లో చేరిస్తే అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు విమర్శించడం సరికాదని, వారి కోటాలో తమకొద్దని, తమ వాటా తమకివ్వమని అడుగుతున్నామని జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకర సూర్యనారాయణ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాపులను మోసం చేశారని దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కాపులను మోసం చేశారన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల కోసం ప్రస్తావించిన అంశాల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరంలో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో కాపునాడు నాయకులు మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన సుమారు 30 వేల మంది కాపులతో భీమవరంలోని లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో మల్లినీడి సత్యనారాయణమూర్తి వేదికపై పశ్చిమ గోదావరి జిల్లా కాపు సదస్సును ఏర్పాటు చేశామన్నారు. కాపు, తెలగా, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం, ఐక్యత కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు వెంకట్రాయుడు తెలిపారు. కాపుల రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతోపాటు పలు ముఖ్య సమస్యలను చర్చిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
కాపునాడు పట్టణ కమిటీ అధ్యక్షుడు బేతు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మాగాపు ప్రసాద్, యువ కాపునాడు జిల్లా అధ్యక్షుడు ఉండపల్లి రమేష్‌నాయుడు మాట్లాడుతూ పట్టణ కమిటీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కాపు సదస్సుకు యువతీ, యువకులు, మహిళలు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. విలేఖర్ల సమావేశంలో పసుపులేటి వాసు, నల్లం చిట్టిబాబు, దూళ్ళ శ్రీనివాస్, మాగాపు భగత్‌సింగ్, జక్కంపూడి భాస్కరరావు, ఫైర్ శివ, ఎస్‌ఎస్ రావు, యాతం జగన్నాథం, సిహెచ్ సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అభయారణ్య భూములను సంరక్షించాలి
-ఆటవీ శాఖాధికార్లతో సమీక్షలో కలెక్టర్ భాస్కర్
ఏలూరు, డిసెంబర్ 18: జిల్లాలోని కొల్లేరు అభయారణ్య భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు 2006 సంవత్సరంలో అప్పగించిన సర్వే నెంబరు భూములను సంరక్షించవలసిన బాధ్యత అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ అధికారులదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణి సంరక్షణ, సామాజిక వన సంరక్షణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు 2006వ సంవత్సరంలో కొల్లేరు అభయారణ్యంకు సంబంధించి అప్పగించిన సర్వే నెంబర్ల భూములను అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వ్యక్తులపై పోలీసు కేసులు నమోదు చేసి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆక్రమిత భూములను అధికారులు స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసు రక్షణతో వెళ్లాలని ఎవరైనా ఆటంకపరిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రహరీగోడలు లేని ప్రభుత్వ పాఠశాలను గుర్తించి, ఆవరణలోకి ఆవులు, గేదెలు, ఇతర జంతువులు ప్రవేశించకుండా వివిధ రకాల మొక్కలతో బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. మొదటి విడతగా 226 పాఠశాలల్లో ప్రారంభించాలని ఏ ఏ పాఠశాలల్లో ఎన్ని మొక్కలు నాటాలి, ఎన్ని నాటారు, ఇంకా నాటాల్సిన మొక్కలు ఎన్ని, నాటిన మొక్కల్లో ఎన్ని మొక్కలు బతికాయో వివరాలు అందించాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో అటవీ శాఖాధికార్లు శ్రీనివాస శాస్ర్తీ, సుభద్రాదేవి, వై ఎస్ నాయుడు, డ్వామా పిడి రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఇ ఎం వెంకటరమణ, డిప్యూటీ డిఇవో ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.