పశ్చిమగోదావరి

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 9: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్‌తో కలిసి పత్రికా విలేఖరుల సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ నమోదైందని, ఈ విడత 90 శాతానికి పైగా పోలింగ్ శాతం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో మొత్తం 32,18,407 మంది ఓటర్లున్నారని, వీరిలో పురుషులు 15,81,496 మంది, మహిళలు 16,36,610 మంది, ఇతరులు 301 మంది ఉన్నారన్నారు. అదేవిధంగా ఇందులో 44 వేల మంది విభిన్న ప్రతిభావంతులు ఓటర్లున్నారన్నారు. జిల్లాలో 3,417 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. 1000 మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో మరొక అదనపు సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 23 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారని, వారిలో 3,941 మంది ప్రివైడింగ్ అధికారులను, 3,949 మంది ఏపివోలను, 13,289 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 231 మంది మైక్రో అబ్జర్వర్లను, 334 మంది సెక్ట్రాల్ అధికారులను నియమించామన్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశామని, ఆచంట నియోజకవర్గంలోని మూడు ప్రాంతాలకు లాంచీల ద్వారా తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 11,074 బ్యాలెట్ యూనిట్లు, 8,310 కంట్రోల్ యూనిట్లు, 8,842 వీవీ ప్యాట్లు వినియోగిస్తున్నామన్నారు. జిల్లాలో 175 ప్రాంతాల్లో మొత్తం 530 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, వీటిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,651 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ద్వారా వెబ్‌కాస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 1185 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం నుండి నియోజకవర్గ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులు నూరుశాతం ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకున్నామన్నారు. వీరికోసం 2 వీల్ ఛైర్లు, 560 వాహనాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో ఎంతమంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు, వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి నివేదిక రూపొందించామని, ఆ గ్రామ పరిధిలోని విభిన్న ప్రతిభావంతులు ఓటుహక్కు వినియోగించుకునేలా చేసే బాధ్యత సంబంధిత నోడల్ అధికారిపై ఉందన్నారు. జిల్లాలో ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరికీ ఫోటో ఓటు గుర్తింపు కార్డును జారీ చేశామని, ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఫొటో ఓటరు గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి 12 ఫోటో గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ తెలియజేసిందని, వాటిలో ఏదైనా గుర్తింపు కార్డును చూపించి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 70 శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ జరిగిందని, మిగిలిన 30 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పోస్టు ద్వారా పంపామన్నారు. పోలింగ్ సందర్భంగా 9వ తేదీ సాయంత్రం నుండి మద్యం అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. అభ్యర్థుల ఇంటింటి, బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలపై కూడా నిషేధం ఉందన్నారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో స్థానిక సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ప్రైవేటు సంస్థల, దుకాణాలలో పనిచేసే వారికి ఈ నెల 11వ తేదీన ఓటుహక్కు వినియోగించుకునేందుకు గాను వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఎన్నికల్లో పోటీ అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.28 లక్షలు, పార్లమెంటు నియోజకవర్గానికి రూ.70 లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 119 కేసులు నమోదు చేశామని, 4.64 కోట్ల నగదును, 31.533 కేజీల బంగారం, 10,800 గ్రాముల వెండి, 21,600 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 258 బెల్టు షాపులను మూసివేశామన్నారు. మై ఓట్ క్యూ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రంలో ఓటు నిమిత్తం ఎంతమంది క్యూలో ఉన్నారు, ఏ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుందనే విషయం తెలుస్తుందన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 2,900 మంది సివిల్ పోలీసులు, వెయ్యి మంది హోమ్‌గార్డులు, 12 కంపెనీల పారా మిలిట్రీ దళాలు, 4 కంపెనీల స్పెషల్ పోలీస్ దళాలు, 29 గ్రేహౌండ్స్ తదితర దళాలను, 1300 మంది మాజీ సైనికులు, రిటైర్డు పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. 350 మొబైల్ పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బందిని నియమించామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారా మిలిట్రీ దళాలతో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 6,750 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు.