గుంటూరు

జాతీయ జనగణన ఆశించిన స్థాయిలో జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జాతీయ జనగణన రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం
చేబ్రోలు, డిసెంబర్ 18: జాతీయ జనగణన కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగలేదని జాతీయ జనగణన రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. చేబ్రోలు తహశీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం జనగణనకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో 2010 సంవత్సరంలో జాతీయ జనగణన సర్వే చేశామని, ఇందులో భాగంగా ప్రస్తుతం ఆ వివరాలను అప్‌డేట్ చేస్తున్నామన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించడంతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. ఆధార్‌కార్డును జనగణనకు అనుసంధానం చేస్తున్నామని, ఆధార్‌కార్డులో పేర్లు ఎలా ఉంటే అలాగే రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు. ఆధార్‌కార్డుల్లో తప్పులుంటే మాత్రం తమకు సంబంధం లేదన్నారు. గుంటూరు కార్పొరేషన్, లాలుపురం, తెనాలి, చేబ్రోలు, పొన్నూరులలో జరుగుతున్న సర్వేను పరిశీలించడం జరిగిందన్నారు. ఈయన వెంట జనగణన అధికారులు ఎన్‌ఎస్ శర్మ, ప్రసన్నకుమార్, చేబ్రోలు డిప్యూటీ తహశీల్దార్ కృష్ణకాంత్ ఉన్నారు.

బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠుడు
తెనాలి, డిసెంబర్ 18: తెనాలి వైకుంఠపురంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం శ్రీబలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ససతీసమేతుడైన స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల పూజలు అందుకున్నారు. అర్చకులు స్వామివారి స్తోత్రాలతో, సుప్రభాతం అనంతరం బలరామావతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామిని దర్శించుకొనేందు కు భక్తులు ఆలయానికి వందలాదిగా చేరుకున్నారు. అర్చకస్వాములు భక్తులకు స్వామివారి తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ఇఓ, దేవాదాయ ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ డి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్వవేక్షించారు.

వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం
మేడికొండూరు, డిసెంబర్ 18: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన మండలంలోని విశదల గ్రామ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... విశదల గ్రామానికి చెందిన నామా బాలస్వామి, నామా ప్రతాప్‌కుమార్ మిరపపంటకు నీరుపెట్టి పైపులు సర్దుతుండగా గుంటూరు నుండి సత్తెనపల్లి వెళ్తున్న వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి వీరిని ఢీకొనగా నామా బాలస్వామి (40) అక్కడికక్కడే మృతిచెందగా, క్షతగాత్రుడైన నామా ప్రతాప్‌కుమార్ (25) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి మేడికొండూరు ఎఎస్‌ఐ లింగమూర్తి, హెడ్‌కానిస్టేబుల్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మేడికొండూరు, డిసెంబర్ 18: మండలంలోని పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు గ్రామాల పరిధిలో ద్విచక్రవాహనాలు దొంగతనం చేసిన వ్యక్తిని శుక్రవారం భీమినేనివారిపాలెం వద్ద పోలీసులు అరెస్ట్‌చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మేడికొండూరు గ్రామానికి చెందిన గుడిపాటి కరిముల్లా మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాలు చోరీచేయడానికి అలవాటుపడ్డాడు. మేడికొండూరు పంచాయతీ కార్యాలయంలో, పలు హోటళ్ల వద్ద పార్కింగ్‌చేసివున్న ఆరు వాహనాలను ఇతను అపహరించాడు. భీమినేనివారిపాలెం వద్ద కరిముల్లాను శుక్రవారం మేడికొండూరు పోలీసులు అరెస్ట్‌చేసి, గుంటూరు మొబైల్ కోర్టుకు హాజరుపర్చారు.

అమరేశ్వరుని కార్తీక ఆదాయం 91.94 లక్షలు
అమరావతి, డిసెంబర్ 18: అమరేశ్వర దేవస్థానానికి కార్తీకమాసం సందర్భంగా హుండీలు, టిక్కెట్ల అమ్మకం, కానుకల ద్వారా 91,94,399 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఐ ధనలక్ష్మి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. హుండీల ద్వారా 30,43,943 రూపాయలు, టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ. 61,48,456 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఆదాయం పెరిగిందని శ్రీనివాసరెడ్డి వివరించారు.

రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
పెదనందిపాడు, డిసెంబర్ 18: రైతాంగ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేయడమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యమని జెడిఎ పి రామాంజనేయులు అన్నారు. పెదనందిపాడు వ్యవసాయ మార్కెట్ ఉపయార్డులో సిసిఐ కేంద్రం ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రైతు సమస్యలపై దృష్టిసారిస్తూ మార్కెటింగ్ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సిసిఐ ప్రారంభించిన 29 కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు 1,91,543 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో గల 11 కేంద్రాల్లో 1,41,200, ప్రకాశం జిల్లా 8 కేంద్రాల్లో 6,456 క్వింటాళ్లు, కృష్ణాజిల్లా 7 కేంద్రాల్లో 37,144 క్వింటాళ్లు, పశ్చిమ గోదావరి 3 కేంద్రాల్లో 6,333 క్వింటాళ్ల పత్తిని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా పత్తి కొనుగోలు చేయడం రైతులకు లాభసాటిగా ఉందన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టడానికి ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ధ్రవపత్రాలు సక్రమంగా ఉంటే నగదును వెనువెంటనే రైతు ఖాతాలో బ్యాంకులో జమచేయడం జరుగుతుందన్నారు. పత్తి పాసింగ్ అయిన వెంటనే బోరాలను కాటా వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులను ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు. కాగా పాసింగ్ అయిన వెం టనే కాటా వేయకపోవడంతో ఆరు బయట బోరాలపై రైతులు నిద్రిస్తూ పడిగాపులు పడుతున్నారు. యార్డు డైరెక్టర్ కనె్నగంటి చలమయ్య, గ్రేడ్-1 కార్యదర్శి సువర్చల తదితరులున్నారు.

వెంకటరమణపై దాడిచేసిన దుండగుడ్ని కఠినంగా శిక్షించాలి
గుంటూరు , డిసెంబర్ 18: గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వెంకటరమణపై దాడిచేసిన దుండగుడ్ని కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. తెలుగు యువత విద్యార్థి సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య సేవాసంఘం నాయకులు వేర్వేరుగా శుక్రవారం గుంటూరు అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వందలాదిగా విద్యార్థినులు చదివే ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం, ఆవరణలలో ఉదయం, సాయంత్రం పోలీసు సిబ్బందిని రక్షణ నిమిత్తం ఏర్పాటు చేయాలన్నారు. సుదీర్ఘ చరిత్ర కల్గిన ప్రభుత్వ మహిళా కళాశాలలలో వందలాది మంది విద్యార్థినులు చదువుతున్నప్పటికీ వాటి రక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్బన్ ఎస్‌పిని కలిసిన వారిలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు సాకిరి వెంకట చైతన్య, కనకమేడల వీర, కట్టా అశోక్, కొర్రపాటి హనుమంతరావు, బిక్కునాయక్, ఏకలవ్య నాయకులు కె వెంకటేశ్వర్లు, కుంభా రవి, ఉల్లిగడ్డ శివయ్య, పుల్లయ్య తదితరులున్నారు.