రచ్చ బండ

వివాదానికి ‘తెర’ పడినట్లేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్ట సభలకు - న్యాయ స్థానాలకు మధ్య అనాదిగా వివిధ అంశాలపై వివాదం తలెత్తుతున్నది. ఎవరు గొప్ప, ఎవరిది పైచేయి అనే పట్టుదల వచ్చిన సందర్భాల్లో రాష్టప్రతి జోక్యం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అంశం వివాదాస్పదమైంది. ఈ అంశంలో పాలకపక్షమైన టిడిపి, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా పంతాలు, పట్టింపులకు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో రోజాను అసెంబ్లీకి అనుమతించాలని ఈ నెల 17న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుతో పాలకపక్షంలో మరింత పట్టుదల పెరిగింది. రోజాను అసెంబ్లీలో అనుమతించకపోగా, అసెంబ్లీలో ఈ అంశంపై ఈ నెల 21న చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాలకపక్షం భావించింది. ఈ లోగా అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో మధ్యంతర ఉత్తర్వుపై అప్పీలకు వెళ్లారు. 21వ తేదీన డివిజన్ బెంచ్ ఈ మధ్యంతర ఉత్తర్వును పరిశీలించి, ఇరువైపుల వాదనలు విని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయడంతో ప్రభుత్వానికి ఊరట కలిగింది. అయితే అప్పీలు చేసుకోవడానికి కోర్టు పిటీషనర్ రోజాకు అవకాశం కల్పించింది. కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడానికి ముందు ఏమి జరగనున్నదోనన్న ఉత్కంఠకు దారి తీసింది. హైకోర్టు ఆదేశాన్ని అసెంబ్లీ శిరసావహించకపోతే అసెంబ్లీకి, హైకోర్టు మధ్య ఎటువంటి వివాదానికి దారి తీస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలను పాలకపక్షం సీరియస్‌గా తీసుకుని ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని రోజా కోర్టులో సవాల్ చేశారు. రోజా సస్పెన్షన్‌ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందున, తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వుపై కూడా అసెంబ్లీలో చర్చించే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
రోజాను సభలోకి అనుమతించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ రూల్స్‌లోకి, సభ తీసుకున్న నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకోవడంపై వివిధ రకాల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కోర్టు తీర్పును అమలు చేసినట్లయితే వైకాపా పైచేయి అవుతుందని టిడిపి భావించింది. అమలు చేయకపోతే ‘కోర్టు ధిక్కారమవుతుంది..’ అని వైకాపా హెచ్చరించింది. కోర్టు తీర్పును అమలు చేయకపోతే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన వారందరినీ ‘్ధక్కారం’ కింద అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందా? అని పాలకపక్షం సభ్యులు వాదించారు. లోగడ న్యాయ వ్యవస్థకు, చట్ట సభకు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు సర్వోన్నత న్యాయ స్థానం, రాష్టప్రతి ఏ విధంగా స్పందించారు? ఏయే రాష్ట్రాల్లో ఎటువంటి కేసుల్లో ఇటువంటి ఘర్షణ తలెత్తింది? అని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ ఇన్‌ఛార్జీ కార్యదర్శి కె. సత్యనారాయణ రావు ఇతర అధికారులు బాలకృష్ణమా చార్యులు, శకుంతల లోతుగా అధ్యయనం చేశారు.
కోర్టు తీర్పుపై సభలో చర్చించవచ్చా? అనే ధర్మసందేహం కూడా వచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పులపై చర్చించేందుకు అసెంబ్లీ రూల్స్ ఏమీ లేవు. కాగా అసెంబ్లీలో ప్రతిపాదించే తీర్మానాల రూల్ కింద ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసేందుకు అవకాశం ఉన్నందున, సభలో ఈ నెల 21వ తేదీన చర్చించి చివరకు రోజాకు ప్రివిలేజస్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రోజా ప్రివిలేజస్ కమిటీ ముందు హాజరై జరిగిన దానికి విచారం వ్యక్తం చేసినట్లయితే సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. అలా చేయకుండా పట్టుదలగా డివిజన్ బెంచ్ తీర్పును ‘సుప్రీం’లో సవాల్ చేస్తే ఇంకా కొనసాగుతుంది, ముదురుతుంది. ఇటువంటి ఘటనలు ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎందుకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే జరిగిన ఉదంతం ఉన్నది. 1997 సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల అక్రమాలపై అప్పటి అసెంబ్లీ సభాసంఘాన్ని నియమించగా, దాఖలైన పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు సభాసంఘాన్ని నియమించడం పట్ల అభ్యంతరం చెప్పింది. సభా సంఘాన్ని నియమించే విషయంలో అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదని సభ తీవ్రంగా ప్రతిస్పందించింది. 1985 సంవత్సరంలో జి. నారాయణ స్పీకర్‌గా ఉన్నప్పుడు సుధీర్ కుమార్ అరెస్టు విషయంలో సభ తీసుకున్న నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకున్నప్పుడు స్పీకర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఒక పత్రికాధిపతి అరెస్టు విషయంలో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై ఆ పత్రికాధిపతి కోర్టు నుంచి ‘స్టే’ తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కెఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం స్పీకర్‌నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే రెండు అసెంబ్లీ సమావేశాలకు మధ్య అరు నెలల మధ్య విరామం ఉండడం, అప్పటికే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చివరి స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్ ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ డ్రైవర్ మీడియా పాయింట్ వద్ద అప్పటి లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్‌పై చేయి చేసుకోవడంతో ఆ డ్రైవర్‌ను స్పీకర్ అరెస్టు చేయించి జైలుకు పంపించారు. దీంతో స్పీకర్‌కు ఉండే జ్యూడిషీయర్ అధికారాలు ఏమిటో నిరూపితమైంది.
1960లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కేశవ్‌సింగ్‌ను సస్పెండ్ చేసినప్పుడు కోర్టు ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించడంతో, ఆ రాష్ట్ర అసెంబ్లీ శిరసావహించింది. తాజాగా 2013వ సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీలో విసి చంద్రకుమార్ కేసులోనూ కోర్టు తీర్పును ఆ రాష్ట్ర అసెంబ్లీ శిరసావహించింది. ఇలా అనేకానేక కేసులు ఉన్నాయి. కోర్టు తీర్పులనూ చట్ట సభలు గౌరవించిన, వ్యతిరేకించిన దాఖలాలూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా పంతాలకు-పట్టింపులకు పోకుండా సభలో లేదా స్పీకర్ ఛాంబర్‌లో పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఏదైనా చట్ట సభలకు, న్యాయ స్థానాలకు మధ్య వివాదాలు తలెత్తకుండా సాఫీగా సాగాలని ఆశిద్ధాం.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి