రచ్చ బండ

అవును, వాళ్ళు ఇష్టపడటం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అవును, వారిద్దరు ఇష్టపడ్డారు’ సినిమా పేరు మీరు వినే ఉంటారు, లేదా చూసే ఉంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షాలైన తెలుగు దేశం, బిజెపిలు అప్పుడు (అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు) ఇష్టపడ్డారు...ఇప్పుడు ఇష్టపడడం లేదు. విడిపోవాలనుకుంటున్నారు. మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మిత్రులు పరస్పరం మరింత ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై 13న లోక్‌సభలో చర్చకు రాకుండా ముందుగానే సభను వాయిదా వేయించడంపై ఎపి టిడిపి నాయకులు చిటపటలాడుతున్నారు. 13న రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రత్యేక హోదా ఇవ్వడం ఇప్పట్లో కుదరదని, రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఎపికి లక్షా 45 వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చామని, పోలవరాన్ని కేంద్రమే చేపడుతుందని, ఎపిని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తుందని బిజెపి అగ్రనాయకులు పలువురు వెల్లడించారు. దీనిపై టిడిపి నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు కేంద్ర మంత్రులు ఇటీవల చేసిన ప్రకటనలపై ఎపి టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారు.
బిజెపి కూడా టిడిపి వైఖరిని తప్పుడు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్రం ఇచ్చే నిధులు వాడుకుంటూ విమర్శలు చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎక్కడా వాడడం లేదని, మంత్రులు ఛాంబర్లలో ప్రధాని మోదీ ఫొటోలు పెట్టుకోవడం లేదని బిజెపి నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానికా? అని వారు మండిపడుతున్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పడం, గత యుపిఎ ప్రభుత్వం విభజన చట్టంలో హోదా గురించి పేర్కొనలేదంటూ కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న తదితర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా స్పందించకుండా బుచ్చయ్య చౌదరితో విమర్శలు చేయిస్తున్నారని బిజెపి నాయకులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా కోసం బిజెపి అగ్ర నాయకులంతా హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని పట్టుబట్టారు. ఆ నాయకులే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని టిడిపి నాయకులు ప్రశ్నించడంలో తప్పులేదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకపోవడం కాంగ్రెస్ తప్పు చేసి ఉండవచ్చు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని గంపెడు హామీలిచ్చిన బిజెపి నేతలు నోరు మెదపాల్సి ఉంది. నాడు రాజ్యసభలో విభజన చట్టంపై ఉత్కంఠతో, ఉద్విగ్నంగా చర్చ జరుగుతున్నప్పుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పటి యుపిఎ ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి చూపిస్తామంటూ ఇచ్చిన హామీని టిడిపి గుర్తు చేయడంలో తప్పేమి లేదు.
ఇలాఉండగా బిజెపి ఎపి శాఖ ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఇతర నాయకులు కపిలేశ్వరరావు, కె. కోటేశ్వర రావు ప్రభృతులు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి బిజెపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టిడిపిపై, ఎపి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడారు. టిడిపి నాయకుల అదిరింపులకు, బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటున్నదని, మంచి జరగకపోతే కేంద్రంపై నెపం నెట్టివేస్తున్నదని వారు దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకోరాదని పలు పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని వారు గుర్తు చేశారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత ఎపికి 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయిస్తున్నదని, ఎల్‌ఇడి ప్రాజెక్టుకు 10 వేల కోట్లు, ఆర్థిక సమ్మిట్ ద్వారా 4 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ప్లైవోవర్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయించినా, రాజధాని అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా ప్రధాని మోదీ సహకరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని దుమ్మెత్తిపోయడం భావ్యమా? అనేది వారి ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లిస్తున్నదని బిజెపి నేతలు మంటగా ఉన్నారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం 20 వేల కోట్లు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోడ్లను తామే వేయిస్తున్నట్లు ప్రకటించుకుంటోందని, ‘చంద్రన్న బాట’ ఏమిటని నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకున్నప్పుడు, ప్రధాని మోదీ పేరు కూడా పెట్టాలని బిజెపి డిమాండు. లోగడ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపి కెవిపి రామచందర్‌రావు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేయకపోవడానికి కారణాలు ఏమిటీ? ప్రభుత్వానికి, కెవిపికి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటీ? అనేది వారి అనుమానం. పట్టిసీమ ప్రాజెక్టు పనులను కెవిపి ముఖ్య అనుచరునికే కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటోనని బిజెపి అనుమానం. ఇన్ని అనుమానాలు, ఆరోపణలు చేస్తున్న బిజెపి చంద్రబాబు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నదని టిడిపి వేలెత్తి చూపుతుంటే, మీరు మాత్రం మా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని బిజెపి ఎదురు దాడికి దిగుతోంది. టిడిపితో తెగతెంపులు చేసుకుంటేనే ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ బలపడుతందన్న వాదన, అంచనా బిజెపి ఎపి నేతల్లో ఉంది.
తెలంగాణలోనూ మిత్రపక్షాల మధ్య సఖ్యత కొరవడింది. టిడిపిని వదులుకుంటేనే తెలంగాణలో బలపడతామని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి ఆంధ్ర పార్టీగా ముద్ర పడిందని, ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదన్నది బిజెపి వాదన. జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. తాజాగా సిద్ధిపేట మున్సిపాలిటికీ జరిగిన ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా బిజెపికి రెండు స్థానాలు దక్కించుకున్నది. రెండు రాష్ట్రాల్లోనూ రెండు పార్టీలకూ ఇది రాజకీయ పోరాటం, మనుగడ కోసం ఆరాటం. కాబట్టి పరస్పరం విమర్శలు గుప్పించుకోవాల్సిందేనా?

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి