ఈ వారం కథ

కథ చెదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుపమ బస్టాండులో నిల్చుంది. ఎక్కాల్సిన బస్ ఇంకా రాలేదు. చిరాకుగా టైం చూసుకుంది. అప్పటికే రావాల్సిన బస్ ఆవేళ ఎందుకనో ఆలస్యం అయినది. ఇంతలో కాస్త దూరంలో ముగ్గురు వ్యక్తులు కనిపించారు ఆమెకు. ఇద్దరు యువకులు, ఒక యువతి ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యం ఎందుకో అసహజంగా అనిపించి, మరింత పరిశీలనగా చూసింది. ఆ యువకులలో ఒకరు తన చేతిలోని సెల్‌ఫోన్‌ను ఆ యువతికి చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. ఆ యువతి తల అడ్డంగా ఊపుతూ ఆ సెల్‌ఫోన్ వైపు చూస్తోంది.

విషయం ఆసక్తిగా అనిపించి అటువైపు నడిచింది అనుపమ. దగ్గరగా వస్తున్న ఆమెను చూసి ఆ యువకులు తత్తరపడటం గమనించింది. అంతలో ఆ యువకులలో ఒకడిని గుర్తుపట్టి ‘‘హాయ్! పవన్ బాగున్నావా?’’ అని పలకరించింది.
ఆ యువకుడు ఆమె వైపు చూసి ‘‘హలో.. అనుపమా.. ఏంటీ సర్‌ప్రైజ్ విజిట్’’ అని ఆనందంగా అడిగాడు.
పవన్ తన డిగ్రీ క్లాస్‌మేట్, పెద్ద కాంట్రాక్టర్ కొడుకు. ఆ రోజుల్లోనే కాలేజీలో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. డబ్బు అంటే లెక్కలేనట్లే ఉండేవాడు. ఎప్పుడూ నలుగురు, ఐదుగురు స్నేహితులని తన వెంట తిప్పుకునేవాడు. విద్యార్థుల మధ్య జరిగే ఘర్షణలలో ఒకటి, రెండుసార్లు పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లివచ్చాడు.
ఆ జ్ఞాపకాలు అన్ని మెదులుతుండగా దగ్గరకు వెళ్లి, ‘‘ఏంటి విషయం..! ఈ అమ్మాయి ఎవరు?’’ అని ప్రశ్నించింది. ఒక్క క్షణం తటపటాయించి ‘‘ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి పావని. వరుసకు నాకు మేనకోడలు అవుతుంది. ప్రక్కనే ‘కోకాపేట’ వీళ్ల ఊరు. రెండు రోజుల క్రితం ఈమెకు పెళ్లిచూపులు అయ్యాయి. ఇష్టం లేని పెళ్లిని చేస్తున్నారని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదిగో ఇక్కడ కనిపించింది. రమ్మంటే రానంటోంది’’ అంటూ ఆమె వైపు చూశాడు.
ఆమె కళ్ళల్లో నీరు నింపుకుంటూ అతని చేతిలోని సెల్ వైపే చూస్తోంది. అది అనుపమకు చిత్రంగా అనిపించింది. ఆమెలో ఏవేవో అనుమానాలు రేకెత్తాయి.
ఇంతలో పవన్ స్నేహితుడు ‘‘పోనీ మీరైనా ఆమెకు తోడుగా వచ్చి పవన్ వాళ్ళ ఇంటిలో దిగబెట్టవచ్చుగా! అందులోనూ పవన్ మీకు బాగా తెలిసిన వ్యక్తేగా, ఆ అమ్మాయి బాగా భయపడిపోతోంది’’ అన్నాడు, అనుపమను ఆబగా చూస్తూ.
‘‘అన్నట్టు వీడిని నీకు పరిచయమే చేయలేదు కదూ. దిస్ ఈజ్ రోహిత్, నా బెస్ట్ ఫ్రెండ్. కూకట్‌పల్లి ఎ.ఎస్.ఐ. కొడుకు!’’ అంటూ తన స్నేహితుడిని పరిచయం చేశాడు పవన్.
‘‘రావచ్చు.. కానీ నా ఆఫీసుకు లేటవుతుంది, సరే, మా మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్పేసి వస్తా, ఉండండి’’ అని తన ఫోన్ తీసి కాస్త దూరంగా వెళ్లి ఏదో మాట్లాడి వచ్చింది. తను వచ్చేలోగా స్నేహితులు ఇద్దరూ గుసగుసలు ఆడుకోవడం ఆమె కళ్ళపడింది. ఆ విషయం గమనించినా, గమనించనట్లే వచ్చి ఆ అమ్మాయికి ధైర్యం చెబుతూ, ‘‘నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా మీ వాళ్ళు పెళ్ళి సంబంధం చూడటం తప్పే, అంతమాత్రాన ఇల్లు వదిలేసి వచ్చేస్తారా! ఎవరైనా?’’ అంటూ సుతిమెత్తగా మందలించింది. ఆ అమ్మాయి ఏదో చెప్పబోయింది.
‘‘పవన్ కాస్త కోపంగా ఆమెవైపు చూస్తూ ‘‘ఈ వాదనలు అన్నీ అనవసరం, వస్తున్నావా? లేదా?’’ అన్నాడు తన చేతిలోని సెల్‌ను క్యాజువల్‌గా ఆమె వైపు చూపించి ఊపుతూ. దాంతో ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. వెంటనే రోహిత్ కాస్త దూరంగా నిలిపి వున్న తన ఇన్నోవాను తీసుకువచ్చాడు. పవన్ డోర్ తీసి పట్టుకొని కూర్చోమన్నాడు. ఆ అమ్మాయికి రావడం ఇష్టం లేదు అన్నట్లు అలాగే నిలబడిపోయింది. అనుపమ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ఎక్కించింది.
పవన్ ముందు సీటులో కూర్చున్నాడు. పవన్‌కి లోలోన ఎంతో ఆనందంగా ఉంది, తన పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు. పైగా అనుపమ రూపంలో అదనపు లాభం! పావని తన రెండు కాళ్లమధ్య తల పెట్టుకుని వౌనంగా రోదిస్తోంది. అనుపమ తన స్మార్ట్ ఫోన్‌ను తీసి గేమ్స్ ఆడుకోసాగింది. పవన్ అద్దంలోనుండి ఆమెని చూస్తూ ‘‘అయితే అనుపమా.. అప్పటినుండి నీ ధైర్యం, తెగింపు ఏ మాత్రం తగ్గలేదన్నమాట, ఏ ఆఫీసులో పనిచేస్తున్నావ్?’’ అన్నాడు. గేమ్ ఆపి, ‘‘ఏదోలే ఓ చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ‘టెక్ సొల్యూషన్స్’ అనీ.. అదిసరే, మరి నువ్వేం చేస్తున్నావ్ పవన్, నీ డిగ్రీ కూడా పూర్తికాలేదు కదా అప్పట్లో’’ అంది. అది విని అదోరకంగా నవ్వాడు పవన్.
‘‘ఏదో.. ఫైనాన్షియల్ బిజినెస్, అంతే.. పెళ్ళైందా?’’ అడిగాడు మళ్లీ.
‘‘వచ్చే నెలలో.. మా కాబోయే శ్రీవారు కూడా మా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు’’ అని ఇక మాటలు పొడిగించకుండా సెల్ ఫోన్ గేమ్‌లో ఆడటంలో మునిగిపోయింది. ఇన్నోవా సడన్‌గా ఆగిపోయేసరికి తల ఎత్తి చూసిన అనుపమ, తాము నగర శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక గెస్ట్‌హౌస్‌లాంటి భవనం ముందు ఉన్నట్లు గమనించి ఆశ్చర్యంతో పవన్‌ని చూసింది.
అప్పటికే క్రిందికి దిగి పవన్ పెద్దగా నవ్వుతూ ‘‘స్వాగతం, నా అలనాటి కలల రాణి సుస్వాగతం! రేగిపండు కోసం వెళితే దబ్బపండు దొరికినట్లు, కుందేలు కోసం వెళితే కస్తూరి జింక దొరికినట్లు, ఏదో కాలక్షేపం చేద్దామని దీనికోసం వస్తే, సాక్షాత్తూ నువ్వే కనపడి నా వెంట వస్తావని అనుకోలేదు. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు’’ అంటూ పట్టరాని సంతోషంతో డోర్‌మీద చేయి వేశాడు. అప్పటికే బండి దిగిన రోహిత్ గెస్ట్‌హౌస్ లోపల మరో నలుగురు వ్యక్తులతో తమవైపు రావడం గమనించిన అనుపమకు విషయం క్రమంగా అర్థమవసాగింది.
అయినా ఏమి అర్థం కానట్లు చూస్తూ, ‘‘ఈ అమ్మాయి మీ బంధువుల అమ్మాయి కదా, మరి ఇదేంటి?’’ అంది. దానికి రోహిత్ పవన్‌తో ‘‘అన్నా, నీ చిలక మరీ ఇంత అమాయకమా? పోనీలే, ఫిగర్ మాత్రం అదిరింది. ఈరోజు అంతా మనకు పండగే!’’ అంటూ అటువైపు డోర్ తీసి పావని చేయి పట్టుకుని క్రిందకు లాగాడు.
పవన్ మొరటుగా అనుపమను క్రిందకు గుంజుతూ, ‘‘బంధువుల అమ్మాయా తొక్కా? వీళ్ళ నాన్న నా దగ్గర తీసుకున్న అప్పుకి ఇది వడ్డీ కడుతుంది, తన అందంతో, వయసుతో. ఇదిగో ఇప్పటిలాగే కావాల్సినపుడు రానంటుందేమోనని ఇంతకుముందు లాక్కొచ్చి వచ్చినపుడు వీడియో తీసాంలే. రాక ఇంకెక్కడికి పోతుంది. పాపం నీకే విషయం తెలియక సమాజ సేవ చేసేద్దాం అని వచ్చి నా వలలో చిక్కిపోయావ్. అప్పట్లో నీకోసం ఎంతగా తపించిపోయానో తెలుసా? నువ్వు ఆ గిరిగాడిని అందరిముందూ చెప్పుతో ఎడాపెడా వాయించడం చూసి జంకాను కానీ.. లేకపోతే అప్పట్లోనే నీ అందం నాకు విందైపోయేది. ఇపుడు మాత్రం ఏమైందిలే, అప్పటికంటే ఇప్పుడే ఇంకా అందంగా ఉన్నావు. ఇంకా పెళ్లికూడా కాలేదు కాబట్టి ఫ్రెష్షే! ఇక నా సంగతంటావా? ఇదిగో మేమంతా ఒక ఫైనాన్షియల్ కంపెనీ పెట్టాం. మా దగ్గరికి అప్పుకోసం వచ్చేవారికి ఉండాల్సిన అర్హత ఒక్కటే, వాడికి అందమైన పెళ్ళామో, చెల్లెలో, కూతురో ఉంటే చాలు! ఎలాగూ వాడి తలకిమించిన వడ్డీ చక్రవడ్డీలు కట్టలేడు. అలాంటప్పుడు ఇదిగో వాడి పెళ్ళామో, కూతురో ఇలా వచ్చి మాకు వయసు వడ్డించి వెళ్లిపోతారు. రాకపోతే మేమే వాళ్ల ఇంటికి వెళ్లిపోతాం. అపుడు చుట్టుప్రక్కల వాడికి ఉన్న కాస్త పరువు పోతుంది. మాలో పోలీసులు, పొలిటికల్ లీడర్స్, పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి కేసుల భయం కూడా లేదు. మళ్లీ దీనివంతు మరో రెండు, మూడు నెలల తరువాత వస్తుంది. అంతవరకు సరిపోయేటంత అప్పుల వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మేము దీనికి ముద్దుగా పెట్టుకున్న పేరు ‘బంగారం - సింగారం’. అంటే ‘పుచ్చుకో బంగారం - ఇచ్చుకో శృంగారం’ అన్నమాట! ఈరోజు అనుకోకుండా నీ యవ్వనభాగ్యం దొరికింది’’ అంటూ వికటంగా నవ్వసాగాడు.
డబ్బు, అధికార మదంతో వారు చేస్తున్న అరాచకాలను పవన్ నోటి వెంట వింటుంటే అనుపమకు ఒళ్ళు జలదరించింది. ఒక్క క్షణంలో తేరుకుని, సెల్‌ఫోన్‌లో ఏవో మీటలు నొక్కింది. అది చూసి పవన్ హేళనగా నవ్వుతూ ‘‘నీకు కాబోయే మొగుడిని పిలుస్తున్నావేమో, వస్తే వాడు ఇక్కడే శవం అయిపోతాడు. నీకు జరగాల్సిన పెళ్లి కూడా జరగదు. నువ్వు ఏ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసినా లాభం లేదు. పద..!’’ అంటూ ఆమె చేయిని పట్టుకున్నాడు.
అంతే మెరుపులా కదిలి ఆమె కొట్టిన కరాటే దెబ్బకి కళ్లు బైర్లు కమ్మాయి పవన్‌కి. ఆపుకోలేక తూలిపడ్డాడు నేలమీద. ఆమెలోని బలానికి ఆశ్చర్యపోతూ, తన స్నేహితుల వైపు చూసి అరిచాడు పవన్, ‘‘పట్టుకోండిరా.. దాన్ని. కాలో, చెయ్యో విరిచేయండి! జాగ్రత్తరోయ్, ప్రాణం పోకూడదు. మొదటి పంట నాదే’’ అంటూ లేవబోతూ కన్పించిన దృశ్యాన్ని చూసి మ్రాన్పడిపోయాడు.
కొద్ది దూరంలో ఆగిన పోలీసు వ్యాన్‌ను, అందులోనుండి బిలబిలమంటూ దిగి, పరిగెత్తుకు వస్తున్న పోలీసులను, వారి వెనుకే ఆపుతున్న మీడియా ప్రతినిధుల వాహనాలను, అక్కడినుండే ప్రతీ దృశ్యాన్ని కవర్ చేస్తున్న కెమెరామెన్‌లను చూసి షాక్‌తో నిలబడిపోయాడు. కనీసం పారిపోవడానికి కూడా అవకాశం లేక ‘‘పట్టులో వున్న కోళ్ళ’’లాగా అందరూ దొరికిపోయారు. వీళ్ళ అందరికీ ఎలా తెలిసిందో, తమకు తమ వారికి తెలియకుండా పోలీసులు ఎలా వచ్చారో అని పిచ్చెత్తిపోయాడు పవన్.
ఇంతలో అతని ముందుకు వచ్చి నిలబడింది అనుపమ. ‘‘నేటితో నీ పని సరి! రాస్కెల్, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి నీచుల జాడ తెలుసుకోడానికేరా, నేను రెండు నెలలుగా జీపు వదిలి బస్‌లో తిరుగుతున్నాను. ఐ యామ్ అనుపమ, ఐ.పి.ఎస్., ఈ సిటీలో కొత్తగా జాయిన్ అయిన ‘షీ‘టీమ్ డి.సి.పిని. ఈ సిటీలో జాయిన్ అయినపుడు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది నీలాంటి ప్రబుద్ధుల ఏరివేత కోసమే. ఈ రోజు నా నిరీక్షణ ఫలించింది. మిమ్మల్ని చూసి ఈ అమ్మాయి భయపడుతున్నపుడే నాకు అనుమానం వచ్చింది. అంత దుఃఖంలో కూడా నిన్ను, నీ సెల్‌ఫోన్‌ను చూసి, భయపడుతూ తను నువ్వు చెప్పింది వింటున్నపుడే నాకు విషయం పూర్తిగా అర్థమైందిరా! నేను నీ వెంట వస్తూ సెల్ గేమ్స్ ఆడుకుంటున్నాను అనుకున్నావా? అందులో మా వాళ్ళకు నేను రూట్ గురించి, కావలసిన బలగం గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నానురా బేవకూఫ్! ఇంతవరకూ నువ్వు నాతో మాట్లాడినదంతా వీడియో రికార్డింగ్ అయి, మొదట నా మెయిల్‌కు, తరువాత అన్ని ఛానెల్స్‌వాళ్ళకి చేరిపోయిందిబే, ఛల్ రాస్కెల్..’’ అంటూ పవన్ చేతులకు బేడీలను వేసి ముందుకు నెట్టింది అనుపమ. జీపులో కూర్చొని రమ్మని సైగ చేస్తున్న అనుపమ వైపు చూస్తూ చేతులు జోడించి ముందుకు నడిచింది పావని.

*

-చంద్రశేఖర్ సాహుకారి, సెల్ నెం: 9492593400