ఈ వారం కథ

ఛాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పదండి - పదండి.. టైమవుతోంది! కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది.. మరలా ఒక గంటవరకూ కదలడానికి వీలుకాదు!’’ అంటూ అందరినీ తొందర పెడుతోంది వనజమ్మ.
భార్య చేసే హడావుడి చూస్తూ ‘‘ఎందుకే.. అంత హైరానా పడతావు? అన్నీ చూసుకోవడానికి పెద్దాడున్నాడుగా! నీకు వయసు పెరిగేకొద్దీ చాదస్తం మరీ ఎక్కువవుతోందే! పరిహాసం చేశాడు వెంకట్రావు.
భర్త తన వయసుని గుర్తుచేయగానే చుర్రుమంది వనజమ్మ- ‘‘హబ్బో! వయసు పెరిగేకొద్దీ తమరేమైనా కుర్రాళ్ళైపోతున్నారేమిటీ? మీరూ ముసలాడవుతున్నారుగా?!’’ అంటూ చురకంటించింది వనజమ్మ.
ఎలాగైతేనేం.. వనజమ్మ పెట్టే హడావుడివల్లో, పెళ్లికొడుకు వంశీ పడుతున్న కంగారువల్లో.. పది నిముషాల్లో అందరూ ‘సుమో’లో బయలుదేరారు.
***
పెద్ద కాంపౌండులో ఒక మోస్తరు ఇల్లు!
చుట్టూ రకరకాల పూలచెట్లతో పాటు వేప, జామ, మామిడి, పనస, బాదంచెట్లతో చల్లనిగాలి వీస్తూ.. అక్కడ అడుగుపెట్టగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది అందరికీ.
అమ్మాయి తల్లీ, తండ్రీ ఎదురొచ్చి అందరినీ లోపలికి తీసుకెళ్లారు.
ఇంట్లో అడుగుపెట్టగానే విశాలమైన హాలు, పాతకాలపు టేకు కుర్చీలు, మడత కుర్చీలు, పెండ్యులమ్ గడియారం, పాత ఒనిడా టీవీ ప్రక్కనే కొత్త ఎల్‌ఈడీ టీవీ, టేప్ రికార్డర్, క్యాసెట్లు, పాత రేడియోలో పాటలేవో వింటున్న అమ్మాయి బామ్మ, తాతయ్య- ఏదో యాంటిక్ మ్యూజియంలోకొచ్చినట్లనిపించింది వంశీకి.
అందరినీ సాదరంగా పలకరిస్తూ కూర్చోబెట్టి మంచినీరందించి, కుశల ప్రశ్నలూ, వగైరాలు పూర్తయ్యాక అమ్మాయిని పిలిపించారు.
లోపలి గదిలోనుండి పెళ్లికూతురు కంగారుపడుతూ నెమ్మదిగా ఫలహారాలు తీసుకొచ్చింది. అందరికీ ఫలహారాలందించడం పూర్తయ్యాక- అమ్మాయిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది వనజమ్మ.
‘‘అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది!’’ అంటూ తన మనసులోని భావాన్ని చెప్తూనే- అమ్మాయిని ఉద్దేశించి ‘‘నీ పేరంటమ్మాయ్!’’ అనడిగింది ఆప్యాయంగా.
బిగించిపెట్టిన వీణ తీగను మీటినట్లుగా ‘కీర్తన’! అని బదులిచ్చిందా అమ్మాయి.
‘‘ఏం చదువుకున్నావమ్మా?’’ అంటూ చేత్తో వీపుమీద లాలనగా నిమురుతూ మళ్లీ అడిగింది.
ఆ ఆత్మీయతాపూర్వక స్పర్శకు మనసులోని కంగారు కొద్దిగా తగ్గినట్లయి- ‘‘బియస్సీ, బి.ఎడ్, చదివానండీ! డి.ఎస్సీ రాశాను, రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నానండీ!’’ అంది కీర్తన.
ఇంతలో.. వాళ్ళమ్మ అందుకుంటూ ‘‘సంగీతం, నాట్యం నేర్చుకుందండీ.. వంట కూడా బాగా చేస్తుంది!’’ అని చెప్పింది.
‘‘అబ్బాయేమైనా అమ్మాయితో మాట్లాడాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదండీ!’’ అని కీర్తన తండ్రి అనగానే- ‘సరే..’నంటూ వంశీ లేచి నిలబడ్డాడు.
వంశీ లేవగానే ఇక తప్పనిసరై కీర్తన కూడా లేచి ప్రక్క గదిలోకి నడిచింది.
ఆమె అలా నడచివెళ్తూంటే- ‘లంకెబిందెలకి కాపలా కాస్తున్న తాచుపాములా’ కనిపిస్తున్న ఆమె పొడవాటి వాలుజడ లయ విన్యాసాన్ని చూస్తూ ముగ్ధుడైపోతూ.. కీర్తన వెంటే అడుగులు వేశాడు వంశీ.
***
గదిలోకి వెళ్ళాక-
అక్కడున్న పట్టె మంచంమీద వంశీని కూర్చోమన్నట్లుగా చేతితో సూచించి, అతడికి ఎదురుగా గోడకి వీపునాన్చి నిలబడి, ‘ఇక మాట్లాడండి!’ అన్నట్లుగా చూసింది కీర్తన.
నిజానికి ఏమడగాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వంశీకి. కీర్తనని చూడగానే ఆమెలో కనిపించిన ఏదో తెలియని ఆకర్షణకి లోబడిపోయాడు. ఆ మైమరపులోనే ఇంకా మునిగి వున్నాడతడు.
‘‘మాట్లాడండి..’’ లోగొంతుకతో చిన్నగా వినిపించిన కీర్తన మాటలకి తడబడుతూ-
‘‘మీరు తీరిక వేళల్లో ఏం చేస్తుంటారో తెలుసుకోవచ్చా?’’ అన్నాడు.
‘తప్పకుండా!’ అంటూ- ‘సంగీతం, నాట్యం, వంట, తోటపని, తాతయ్య-బామ్మలతో కబుర్లాడటం, కుట్టూ, అల్లికలూ, పిల్లలకి పాఠాలు, వాళ్ళతో ఆటలూ.. ఇవన్నీ అయ్యాక ఇక తీరికెక్కడ దొరుకుతుందండీ?’’ అంటూ గలగలా చెప్పేసింది కీర్తన.
‘‘పెళ్ళాయ్యాక మా అమ్మా, నాన్న, బామ్మ, తాతయ్యా నాతోనే ఉంటారు.. అందుకు అభ్యంతరం లేదుగా!’’ అనడిగాడు వంశీ.
‘ఇంకేమడుగుతాడో...’ అనుకుంటూ ఎదురుచూస్తున్న కీర్తన- అతడలా అనగానే ‘‘వాళ్ళందరూ మీతో ఉంటేనే పెళ్లికి ఓ.కె. అంటాను’’ అంది. ఆ తర్వాత తమ ఇష్టాయిష్టాలూ, అభిమాన నటీనటులూ వగైరా విషయాల గురించి మాట్లాడుకున్నాక వంశీ లేచి నిలబడ్డాడు.
అతడు గదిలోంచి బయటకి అడుగుపెడ్తూనే- హాల్లో వున్న వాళ్ళందరూ ఒకేసారి ఆత్రంగా అతడి ముఖంలోకి చూశారు.
‘‘ఏ విషయం ఇంటికెళ్లిన తర్వాత తెలియజేస్తాం!’’’ అని సీరియస్‌గా అనేసి వచ్చేశాడు వంశీ.
‘ఇంతసేపూ ఎంతో సరదాగా మాట్లాడిన మనిషి- పెళ్లికి కూడా ‘సరే’ అంటాడులే! అని కీర్తనతో సహా అక్కడున్నవాళ్ళంతా అనుకుంటున్న తరుణంలో..అతడి మాటలూ, ఆ మాటల్లోని ముక్తసరి, ముఖంలోని సీరియస్‌నెస్ చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
***
‘‘అదేంట్రా అలాగంటావ్?’’
‘‘అవును నాన్నమ్మా.. మీరన్నట్లుగా ఈ సంబంధం బాగానే ఉంది. కానీ, నాకు వద్దే! అమ్మా నాన్నలకి నువ్వే చెప్పు!’’ అంటూ గారాలుపోయాడు వంశీ.
అతడి కోరిక మేరకు వనజమ్మ కుటుంబ సభ్యులందర్నీ సమావేశపరచి, ఈ విషయం చెప్పగానే అందరూ ఒక్కసారిగా గయ్యిమన్నారు.. ‘‘మన బంధువులందరికీ తెలిసిన మంచి కుటుంబం, వినయ విదేయతలున్న పిల్ల, చదువుతోపాటు వంటావార్పూ కూడా తెలిసున్న పిల్ల, మాకందరికీ నచ్చినమ్మాయి.. చక్కగా ఉందంటూనే వద్దంటావేవిట్రా? ఇంకేం కావాల్రా నీకు? రంభా, ఊర్వశీ, మేనకలా??’’ అంటూ అందరూ మూకుమ్మడిగా వంశీపై ధ్వజమెత్తారు.
‘‘ఉండండర్రా- నేను వంశీతో తర్వాత మాట్లాడతానె్లండి!’’ అని అందరికీ నచ్చచెప్పాడు వెంకట్రావు.
ఆ రాత్రి- ‘‘వనజా.. నేనూ వంశీ డాబాపైన పడుకుంటాం. మా పక్కలు అక్కడ ఏర్పాటు చెయ్యి!’’ అంటూ పురమాయించాడు. అతడు చెప్పినట్లుగానే వాళ్ళిద్దరికీ మేడపైన పక్కలు సర్ది, తాంబూలం పళ్లెం తీసుకొని వనజమ్మ పైకి వచ్చింది.
వంశీని పక్కన కూర్చోబెట్టుకొని ‘‘ఏరా మనవడా.. ఆ కీర్తన అంత ముచ్చటగా వుంటే నచ్చలేదంటావేమిట్రా? మాకందరికీ నచ్చిన పిల్ల- నీకెందుకు నచ్చలేదురా?’’ అంటూ అనునయంగా అడిగాడు వెంకట్రావు.
వంశీ వౌనం వీడకపోయేసరికి మళ్లీ అడిగాడు- ‘‘ఒరేయ్ వంశీ! చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉంది, చక్కగా చదువుకుంది. రేపో, మాపో టీచరుద్యోగం కూడా వస్తుంది. సంగీతం, నృత్యం, వంటావార్పూ అన్నీ తెలిసిన పిల్ల- ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? అసలు నీకెందుకు నచ్చలేదురా?’’
వంశీ కాసేపాగి, ఆ తర్వాత చెప్పాడు- ‘‘నిజమే తాతయ్యా.. మీరందరూ అన్నట్లుగా అన్నీ బాగున్నాయి.. కానీ అమ్మాయి రంగే నాకు నచ్చలేదు. తను చామఛాయలో ఉంది. కాస్త తెల్లగా ఉండివుంటే మీరు వద్దన్నా పెళ్లి చేసుకునేవాడిని!’’ అన్నాడు.
అది వింటూనే- ‘‘ఓరి నీ చోద్యం సంతకెళ్లా.. ఇదా నీ మనసులోని అసలు కారణం?’’ అంటూ భళ్ళున నవ్వేసిన వెంకట్రావు- ‘‘ఓరేయ్ మనవడా.. నీకో విషయం చెప్పనా- మీ నాన్నమ్మ నేను చూసిన తొమ్మిదవ పెళ్లికూతురు.. తెలుసా?’’ అన్నాడు.
అది వింటూనే వనజమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాడు వంశీ- ‘‘అవునా తాతయ్యా? ఇన్నాళ్ళూ మీ అన్యోనత చూసి మీరిద్దరూ బావామరదళ్ళేమో అనుకున్నాను సుమా!’’ అన్నాడు.
‘‘అవన్నీ ఇప్పుడెందుకండీ?!’’ అంటూ మాట మార్చబోయింది వనజమ్మ.
‘‘కాదులేవే..’’ అంటూ భార్యని వారించి, ‘‘ఒరేయ్ మనవడా.. మా సంగతి చెప్తా విను..’’ అంటూ మొదలెట్టడు వెంకట్రావు.
‘‘నా పెళ్లిచూపుల కోసమని నేనూ, మా అన్నయ్యా బస్సులో వెళ్తున్నామా.. సగం దారిలోకి వెళ్లాక మా అన్నయ్య చెప్పాడు- ‘పెళ్లికూతురు కాస్తరంగు తక్కువగా ఉంటుందంటరా!’ అని.
అంతే- ‘నాకు తెల్లటి అమ్మాయే కావాలి. నేను బస్సు దిగేస్తున్నా! కావాలంటే నువ్వెళ్లి అమ్మాయిని చూసిరా!’ అని బస్సు డోర్ దగ్గరకి వెళ్లిపోయాను- దిగిపోవడానికి.
‘అయ్యో.. పెళ్లికొడుకు కూడా వస్తున్నాడని చెప్పానురా వెంకట్రావ్! ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమోరా!’’ అంటూ మా అన్నయ్య నన్ను బతిమాలాడు.
తన పరిస్థితి చూడలేక- ‘‘సరే అన్నయ్యా.. నేను వస్తాను కానీ, అమ్మాయి మాత్రం నాకు నచ్చలేదనే చెబుతాను. ముందే చెబుతున్నాను.. మళ్లీ నన్ను తిట్టకూడదు!’’ అని చెప్పేశాను.
తీరా అయిష్టంగానే అక్కడికెళ్ళాక, ‘రాహుకాలం, వర్జ్యం’ అంటూ రెండు గంటలు ఆలస్యం చేసిన తర్వాతగానీ మీ నాన్నమ్మని చూపించలేదురా! అప్పటికీ అయిష్టంతోపాటు అసహనంతో రగిలిపోతున్న నాకు- మీ నాన్నమ్మని చూడగానే ఎంత అందంగా కనిపించిందో తెలుసా? తనని చూస్తూనే మా అమ్మలాంటి ప్రేమమూర్తిలాగా అనిపించింది. ‘తెల్లగా లేదని అప్పుడే నేను బస్సు దిగిపోయివుంటే ఎంత నష్టపోయేవాడినో కదా!’ అనుకున్నాను. వెంటనే తనని మా ఇంటికి తెచ్చేసుకుందామా.. అనిపించినా, అలా కుదరదు కనుక తనకి తాళి కట్టి, రెండు నెలల్లోపల మా ఇంటికి తెచ్చేకున్నాను. అదిగో- అప్పటినుంచి తను లేకుండా నేను ఉండలేనురా! ఒరేయ్ వంశీ- అమ్మాయి రంగు తక్కువన్నదే నీ అయిష్టానికి కారణమైతే.. అసలు అది కారణమే కాదురా! ఆడపిల్లలో చూడాల్సింది రంగు కాదురా.. ముఖంలో కళ, బుద్ధి, గుణం, చదువూ, సంస్కారం.. ఇలాంటివి చూడాలి!’’ అంటూ మనవడికి మెత్తగా నచ్చచెప్పాడు వెంకట్రావు.
తాతయ్య చెప్పిన స్వీయానుభవాన్ని విన్న వంశీ ఆలోచనలో పడ్డాడు.
‘‘ఒరేయ్ వంశీ..’’ అంటూ మళ్లీ ఏదో చెప్పబోయిన భర్తని సైగ చేసి ప్రక్కకి తీసుకెళ్లింది వనజమ్మ- ‘‘కాసేపు వాడిని ఒంటరిగా వదిలేయండి- రేపుదయంలోగా తన నిర్ణయం చెబుతాడులెండి!’’ అంటూ.
***
వంశీ మనసులో ఓ పాత సంఘటన మెదిలింది.
అమ్మా నాన్న తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టిన కొత్తలో ‘పడమటవారింటి అమ్మాయి, బాగా చదువుకుంది, తెల్లగా అందంగా ఉంటుంది!’ అంటూ మధ్యవర్తి ఓ సంబంధం తెచ్చాడు. ఇంట్లోని వాళ్ళంతా ఆ సంబంధం కుదిరిపోతుందనుకుంటూనే పెళ్లిచూపులకి బయలుదేరి వెళ్లారు.
ఆ అమ్మాయి ఇంట్లో అణువణువునా ‘లక్ష్మీదేవి’ తాండవిస్తోంది. ఫలహారాలూ, గట్రా పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు. మధ్యవర్తి చెప్పినట్లు నిజంగానే అమ్మాయి చాలా తెల్లగా, అందంగా ఉంది.
నాన్నమ్మ ఆ అమ్మాయిని ప్రక్కన కూర్చోబెట్టుకుని, ‘నీ పేరంటమ్మా?’ అంటూ ఆమె చేతిని అందుకొని ఆప్యాయంగా పలకరించింది. అంతే- నాన్నమ్మ తాకగానే ఆ అమ్మాయి ముఖం చిట్లించి, తన చేతిని వెనక్కి లాక్కుంటూ ‘సరళ!’ అంటూ చెప్పింది పుల్ల విరిచినట్లుగా! ఆ అమ్మాయి ప్రవర్తనకి నాన్నమ్మ చిన్నబుచ్చుకుంది.
ఆ తర్వాత ఇద్దరినీ ఒంటరిగా మాట్లాడుకునేందుకు మేడపైకి పంపించారు.
డాబా పైకెళ్లగానే ‘‘్భ.. భౌ..’మంటూ తనపైకి దూకబోయే పమేరిన్ కుక్కపిల్లని ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుని ముద్దులాడింది. అది చూడగానే ముఖం చిట్లిస్తూ నాన్నమ్మ చేతిలోకి తన చేతిని వెనక్కి లాక్కుంటున్న దృశ్యం కళ్లముందు కదలాడి, మనసు బాధగా మూలిగింది.
అప్పటివరకూ అందరికీ పొడిపొడిగా, ముక్తసరిగా బదులిస్తున్న ఆ అమ్మాయి డాబాపైకి చేరుకోగానే గలగలా మాట్లాడ్డం మొదలెట్టింది. ‘‘మీ జీతం ఎంత? దాంతో ఇప్పటిదాకా ఏమేం కొన్నారు? ప్రతినెలా జీతం ఎవరి చేతికిస్తారు? మీరుండేది పెద్ద బంగళానా? లేక చిన్న మేడా? పెళ్ళాయ్యాక కాపురం ఎక్కడ పెట్టాలీ?’’ వగైరా ప్రశ్నలతో పాటు తన మనుసులోని సంశయాలన్నింటినీ అడిగేసింది.
ఎందుకో ఆ అమ్మాయి అడిగిన ఒక్క ప్రశ్నకీ సమాధానమివ్వాలనిపించలేదు. వౌనంగా- తను పిలుస్తున్నా పట్టించుకోకుండా గబగబా మేడ మెట్లు దిగి కిందకి వచ్చేశాడు.
తన ముఖంలోని భావాలు చూసిన తన కుటుంబ సభ్యులు ‘మా నిర్ణయం తర్వాత తెలియజేస్తామండీ!’ అంటూ వాళ్ళకి చెప్పి వెనుదిరిగాను.
ఇంటికి చేరుకోగానే- ‘‘అమ్మాయి నాకు నచ్చలేదు!’’ అని చెప్పేశాడు. అది వింటూనే అందరూ తనపైకి దండయాత్ర చేస్తారని ఆశించిన తనకి- అందరూ మరుమాట్లడకుండా తన నిర్ణయాన్ని ఆమోదించగానే ఆశ్చర్యపోయాడు. తన కుటుంబ సభ్యులెవరికీ ఆ అమ్మాయి నచ్చలేదని అర్థమైంది.
ఆ తర్వాత చూసిన సంబంధాలలో అందరికీ మూకుమ్మడిగా నచ్చింది. కీర్తనే!
సరళకీ, కీర్తనకీ ఎంత వైరుధ్యం?
పెళ్లికి ముందే ‘వేరు కాపురం’ పెట్టాలని కోరుకుంది సరళ. వేరుకాపురం పెడతానంటే పెళ్ళే చేసుకోనంది కీర్తన! కీర్తన నాన్నమ్మ దగ్గర ఆప్యాయంగా ఒదిగిపోయి కూర్చుంటే.. కుక్కపిల్లని ప్రేమగా ఎత్తుకోగలిగిన సరళ నాన్నమ్మ స్పర్శకి విసుక్కుంది. సరళ వాళ్ళింట్లో ఉన్నంతసేపు ఏ.సిలో ఉన్నా ఊపిరాడనట్లు ఉక్కపోతగా అనిపిస్తే.. కీర్తన ఇంట్లో తనువూ, మనసూ ఎంతో ఆహ్లాదాన్ని పొందాయి. ఆస్తిలో, అందంలో, తెలుపు రంగు మేనిఛాయలో సరళని గెలవలేకపోయినా... ఆప్యాయత, అనురాగం, సుగుణం, సౌశీల్యాలలో కీర్తనకే మొదటి ఓటు పడుతుంది.
‘ఇన్ని మంచి గుణాలున్న కీర్తనని ‘్ఛయ’ తక్కువని వదులుకుంటే- తనను మించిన దురదృష్టవంతుడెవరూ ఉండరు!’’ అనిపించింది వంశీకి. ‘అసలు విషయం’ అవగతమయ్యాక- ఉదయానే లేవగానే తన నిర్ణయాన్ని తెలపాలనుకుంటూ.. తేటపడిన హృదయంతో మనస్ఫూర్తిగా నిద్రాదేవిని ఆహ్వానించాడు వంశీ.

-మానస , సెల్ నెం:9959253016