ఈ వారం కథ

సౌందర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరుకి తగ్గట్టు సౌందర్య అందంగా ఉంటుంది. అందంగా తయారౌతుంది. అందంగా మాట్లాడుతుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది.
సౌందర్యని చూసినవాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు. విన్నవాళ్ళు కళ్ళు అటుపక్క తిప్పకుండా ఉండలేరు.
అన్నీ ఉన్నా సౌందర్య అణకువగానే ఉంటుంది. ఒద్దికగానే మాట్లాడుతుంది. అందుకనే తెలుగు టీవీ వీక్షకులకు సౌందర్య అంటే విపరీతమైన అభిమానం.
సౌందర్య చేసే ప్రోగ్రాముల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అది ఎలాంటి ప్రోగ్రామైనా సౌందర్య యాంకరింగ్ అంటే చాలు- ప్రోగ్రాముకి టీఆర్పీలు పెరిగిపోతాయి.
రెండు సంవత్సరాలుగా సౌందర్య చేస్తున్న ప్రోగ్రాము బాగా జనాదరణ పొందింది.
ఆదిదంపతులతో సౌందర్య చేసే సంభాషణ. కొత్తగా పెళ్ళైన దంపతుల దగ్గర్నుండి వివాహ షష్ఠిపూర్తులు చేసుకుంటున్న వాళ్లదాకా ఒక జంటతో గంటసేపు సాగే ముచ్చట.
సిగ్గుపడే నవ వధువుని లాలించినట్లు ప్రశ్నలు అడిగి ముద్దు ముద్దు సమాధానాలు రాబట్టుకుంటుంది సౌందర్య.
అలాగే యాభై అరవై ఏళ్ళ వివాహ జీవితం గడిపిన పెద్దావిడ మనస్సు పొరల్లో ఎక్కడో ఉండిపోయిన పాత జ్ఞాపకాల్ని నెమ్మదిగా బైటికి తెప్పిస్తుంది.
అలా మాట్లాడించటం ఒక కళ. ఆ కళని సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంది సౌందర్య.
ఒక్కోసారి కొన్ని పండగలకి సినిమా వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసింది సౌందర్య. కార్యక్రమం చివర ఎంతవాళ్ళైనా సౌందర్యని పొగడకుండా ఉండలేరు.
ఆ రోజు అలాంటి కార్యక్రమం షూటింగ్‌కు బయల్దేరింది సౌందర్య. తనతోపాటే బాబు కూడా కారెక్కాడు. బాబుకి మూడేళ్ళు. వాణ్ణి తన అమ్మ దగ్గర వదిలి షూటింగ్‌కి వెళ్తుంది సౌందర్య.
కారు బయల్దేరుతుంటే ఇంటివైపు చూసింది సౌందర్య- తన కోసం కాకపోయినా బాబుకోసమైనా సుధాకర్ గుమ్మం దగ్గరికి వస్తాడేమో అని అనుకుని. రాలేదు, ఇంకా లేచి ఉండకపోవచ్చు.
కొన్నినెల్లక్రితం వరకూ బాబు నాన్న దగ్గరే ఉంటాలే అని అనేవాడు. బలవంతంగా తీసుకెళ్తోంటే మారాం చేసేవాడు. వాడికి ఏం అనిపిస్తోందో- ఈ మధ్య అలా అనడంలేదు.
బాబు సౌందర్య అమ్మగారింటి దగ్గర దిగాక, కారు స్టూడియో వైపు బయల్దేరింది.
స్టూడియో దగ్గర సౌందర్య కారు దిగుతోంటే- అక్కడ ఉన్న అందరి కళ్ళు సౌందర్యమీదే. అందరి కళ్ళలోనూ అభిమానమే.
ఆ రోజు ఇద్దరు దంపతులతో సంభాషణ. దంపతులిద్దరూ ఆరేళ్ళ క్రితం పెళ్ళైన జంటలే. సౌందర్యకి పెళ్ళై కూడా ఆరేళ్ళే అయింది. అప్పుడప్పుడే యాంకరింగ్ మొదలెడుతున్న తన్ని చూసి ముచ్చటపడి ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు సుధాకర్.
మీరు ఎప్పుడు ఎలా కలిశారు లాంటి ప్రశ్నలు అడుగుతోంది సౌందర్య. తన జీవితంలోని అనుభవంలాంటివే చెప్తున్నారు అమ్మాయిలిద్దరూ- భర్తలు తమని చూసి కావాలని పెళ్లిచేసుకున్నారని.
ఎంత అందమైన ఆనందకరమైన అనుభవాలు అవి. ఎవరి జీవితంలోనైనా- మళ్లీ మళ్లీ తలచుకుని పులకరించుకుపోయే జ్ఞాపకాలు. ఒక్కోసారి అవి అలా తియ్యగా ఉండిపోవు. చేదుగా అవుతాయి. తన జీవితంలోలాగా. ఏదో వెలితిగా అనిపించింది సౌందర్యకి.
కొన్నాళ్లుగా అలానే అవుతోంది. కార్యక్రమంలో దంపతులతో మాట్లాడుతోంటే అప్పుడప్పుడు మధ్యలో మనస్సులో కలుక్కుమంటోంది.
ఐతే యాంకరింగ్ ఉద్యోగం అన్ని ఉద్యోగాల్లాంటిదీ కాదు. మనస్సులో ఎలా ఉన్నా- సరదాగా సంతోషంగా సంభాషణ సాగించాలి. అదేపని చేసింది సౌందర్య.
షూటింగైపోయి ఇంటికి బయల్దేరింది. కారు అమ్మగారింటి దగ్గర ఆగింది. బాబుతో అమ్మ గుమ్మం దగ్గర లేదు. ఏమైందా అని అనుకుంటూ సౌందర్య ఇంట్లోకి నడిచింది.
అమ్మ ఒళ్ళో నిద్రపోతున్నాడు బాబు. అమ్మ పక్కనే కూచుని అమ్మ భుజంమీద తల వాల్చింది సౌందర్య.
అమ్మ సౌందర్యని పొదివి పట్టుకుని- ‘‘ఎందుకే ఇలా అయింది నీ జీవితం’’ అంది. అలా అంటున్న అమ్మ కంఠంలో ఎక్కడా నిష్ఠూరం లేదు. నిస్సహాయత ఉంది. బాధ ఉంది.
‘‘డైవోర్సేగా?’’ అని అడిగింది సౌందర్య.
‘అవును’ అంటూ కళ్ళు ఒత్తుకుంది అమ్మ.
‘‘నేనేం చెయ్యలేదమ్మా. నేను బాగానే ఉంటున్నా. సుధాకర్ని బాగా చూసుకుంటున్నా. ఐనా ఎందుకో ఇలా అవుతోంది’’ అంది సౌందర్య. అని మళ్లీ తనే ‘‘నేనింత అందంగా ఉండడం, ఇంత బాగా మాట్లాడ్డం నేను చేసిన తప్పులా?’’ అంది.
అమ్మ కొంచెం సేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా ‘‘పోనీ మానేస్తావా?’’ అని అడగలేక అడగలేక అడిగినట్లు అడిగింది.
‘‘ఏంటి- యాంకరింగా? నేను యాంకరింగ్ చేస్తున్నాననే కదా నన్ను మెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు సుధాకర్. ఈ రోజు చాలా బాగా చేస్తున్నానని వదిలేస్తున్నాడు’’ అంది సౌందర్య.
అమ్మ మాట్లాడలేదు. సౌందర్యే మళ్లీ- ‘‘ననె్నందుకమ్మా ఇంత అందంగా కన్నావు. అందంతోపాటు బాగా మాట్లాడగలిగే కళని కూడా ఎందుకు ఇచ్చావమ్మా? ఈ రెండుతోపాటు గట్టిగా ఉండే మనస్సుని ఎందుకమ్మా ఇవ్వలేదు?’’ అని అంది సౌందర్య.
‘‘ఇన్ని గుణాలున్న పిల్ల పుట్టిందని మురిసిపోయాను. ఇన్ని ఉన్నా ఎంతో అణకువగా ఉంటున్నావని ఆనందించాను. నిన్ను యాంకర్‌గా జనం అభిమానిస్తోంటే సంతోషపడుతున్నాను. నీతో మాట్లాడే జంటలందరూ నిన్ను మెచ్చుకుంటోంటే దేవుడికి దండం పెట్టుకుంటున్నా- అందరి దీవెనలూ నీ దాంపత్యాన్ని సజావుగా సాగించాలని’’ అంది అమ్మ ఇంకేం అనాలో తెలియక.
‘‘మానేస్తాను. డైవోర్స్ తీసుకుంటున్న నేను దంపతులతోపాటు సంభాషణ ప్రోగ్రాము చెయ్యకూడదు. చెయ్యలేను. మానేస్తాను’’ అంది తనలో తను అనుకుంటున్నట్లు సౌందర్య.
‘‘నిజంగా మానేస్తావా- యాంకరింగా? ఆ ప్రోగ్రామా?’’ అని అడిగింది అమ్మ.
నిద్రపోతున్న బాబుని భుజాన వేసుకుని కారెక్కుతున్న సౌందర్యకి ఆ ప్రశ్న వినిపించిందో లేదో- విని సమాధానం చెప్పలేదో- తెలియలేదు సౌందర్య అమ్మకి. సౌందర్య యాంకరింగ్ మానేస్తానని అందో, దంపతుల ప్రోగ్రామ్ మానేస్తానని అందో అర్థం కాలేదు ఆవిడకి.
అలానే కారెక్కిన సౌందర్య మనస్సులోనూ ఆలోచన తెగడంలేదు.
తనకు అయాచితంగా ఇచ్చిన వాటికి భగవంతుణ్ణి కరుణామయుడు అనుకోవాలా? ఇవ్వని వాటికి కర్కోటకుడు అనుకోవాలా? *

-అనామకుడు, రచయిత ఫోన్ నెం:040-23294900/01