ఈ వారం కథ

రంగుల ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృజనాత్మకత అన్నది, ఇరవై నాలుగు క్యారట్ల బంగారం లాంటిది. దాని విలువ దానికుంది. కాని సరియైన కమ్యూనికేషన్ ఉండాలి లేకపోతే ఉపయోగం లేదు.. ఓ కళ గురించి ఎప్పుడు తెలుస్తుంది. ఆ కళాకారుడు చేసిన సృష్టి గురించి విమర్శించినప్పుడు, నలుగురూ పొగిడినప్పుడు, మీడియా మధ్యలోకి వచ్చినపుడు. ఇప్పుడు జరిగింది అదే. పేపర్లో చూసాకనే అతడి గురించి తెలిసింది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, అతను మేమున్న ఇంటికి ఓ ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నాడన్న సంగతి. ఆ గొప్ప చిత్రకారుడిని పరిచయం చేసుకుందామన్న ఉద్దేశ్యంతో వెళ్ళాను.
విశాలంగా ఉన్న బాల్కనీలో ఓ పెద్ద సోఫాలో కూచుని ఉన్నాడు. నన్ను చూడగానే పక్కనున్న కుర్చీలో కూచోమని సంజ్ఞ చేసి, తన చేతిలో ఉన్న పుస్తకాన్ని చూస్తూ, ‘‘ఇది నందలాల్ బోసు వేసినది, ఆర్ట్ అంటే ఇది. ఆ మంట చుట్టూ ముడుచుకుని కూచున్న గ్రామస్థులు, మంట వెలుగునీడల్లో ఆ గ్రామస్థుల మొహాలు ఎంత సహజంగా వేసాడో. ఇది ఓ చలికాలం రాత్రి ఓ గ్రామంలోని దృశ్యం. వారి నాగరికతని ప్రతిబింబించే చిత్రం. కళ ఎప్పుడూ చరిత్రని, సంస్కృతిని చెప్పాలి’’ అంటూ నన్ను చూసాడు. ఆ నందలాల్ ఎవరో నాకు తెలీదు. ఎవరని అడగలేదు.
అసలు ‘ఈ నందలాల్ బోసెవరో తెలుసా’.
‘తెలీదన్నాను’.
‘‘అవనీంద్రనాథ్ శిష్యుడు. నీకు నందలాల్‌దే మరోటి చూపిస్తాను, డ్రమ్మర్.. అసలు ఎంత సహజంగా ఒంగిపోయి డప్పు వాయిస్తున్నాడో..’’ పక్కన ఓ నాలుగు పుస్తకాలున్నాయి. తెలుగువాళ్ళైన బాలయ్య, వైకుంఠం, రామారావు, దామెర్ల, రెడ్డి ఎవరెవరివో చిత్రాలు చూపించి వాటి గొప్పదనం వాళ్ళ గొప్పదనం, ఇంకా యూరోపియన్ చిత్రాలు, జాపనీస్, తైల వర్ణ చిత్రాలని చూపించి అందులో నాకు కనిపించని, అతనికి మాత్రమే అర్థమైన కనిపించిన భాషకందని కవిత్వం చెప్పి.. పుస్తకాలని మూస్తూ, అప్పుడు ప్రశ్నార్థకంగా, నేనెవరన్నట్లు నావైపు చూశాడు.
ఇవాళ పేపర్లో మీ గురించి చదివాను. ఓ పెద్ద పేరున్న పెయింట్ల కంపెనీ, వాళ్ళ కాలెండర్ల కోసం మీకు మూడేళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిందని చదివాను. అది చదివాక మిమ్మల్ని ఓసారి చూడాలనుకున్నాను.
నేనేమీ గొప్పవాడిని కాదు. కానీ దేనికీ లోటు లేదు.. మామూలు అలవాట్లున్న వాడిని. రోజూ పేపరు చదవడానికి మా గేటెడ్ కమ్యూనిటీలోనే ఉన్న రిక్రియేషన్ గదికి వెళ్లి నాలుగు రకాల పేపర్లు చదివి, ఎవరుంటే వాళ్ళతో చదరంగం ఆడి ఇంటికి వస్తాను..
ఎప్పటిలాగే ఆ రోజూ వెళ్ళాను. కానీ ఆ రోజు చదరంగం ఆడేందుకు ఎవరూ లేరు. సరే ఇంక ఏం చెయ్యాలో తెలీక తోచక ఆ పక్కన పెయింటింగ్ వేస్తున్న పిల్లల దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఓ ముగ్గురు చిన్న పిల్లలు కింద కూచుని డ్రాయింగ్ వేస్తున్నారు. వెనక్కి వచ్చి, ఓ రెండు నిమిషాలు అక్కడ అన్ని దిక్కులు చూసి, మళ్లీ రీడింగ్ రూంకే వెళ్ళబోతూంటే, వెనకాల నుంచి ఎవరో పిలిచినట్లనిపించింది. అనుమానంగానే వెనక్కి తిరిగి చూసాను. ఓ పదేళ్ళమ్మాయి ఓ షీటు పట్టుకుని నుంచుంది.
‘‘తాతగారూ.. ఒకసారి చూస్తారా.. రంగు సరిగా వేసానా..’’
‘‘ననే్న అడిగావా.. నాకు బ్రష్ పట్టుకోవడమే తెలీదు..’’
‘‘కాని, రంగు సరిగ్గా కుదిరిందో లేదో తెలుస్తుంది కదా..’’
దిక్కులు చూసాను. ఈ క్లాసులు తీసుకుంటున్న అబ్బాయి కోసం.
‘‘సంకర్ష్ అన్న ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు. చాలా సేపయింది ఇంకా రాలేదు. నేను ఇంటికి వెళ్లిపోవాలి..’’
ఆ సంకర్ష్ అనే కుర్రాడు ఈ కాంప్లెక్స్‌లో వాడే.. వాళ్ళు సి బ్లాకులో ఉంటారు. ఆ పిల్లాడి తండ్రి నాకు తెలుసు. అప్పుడప్పుడు ఈ రీడింగ్ రూంలో కనిపిస్తూంటాడు. ఈ నేర్పించే పిల్లాడు వాళ్ళ పెద్దకొడుకు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పిల్లలకి ఎండాకాలం సెలవల్లో డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పిస్తుంటాడు.
‘‘సంకర్ష్ వస్తాడు కదా చూస్తాడు’’ అన్నా ఆ అమ్మాయి కదల్లేదు. పైగా తను వేసిన ఆర్ట్‌ని నా కళ్ళముందుకి పెట్టింది.
‘‘మీరొక్కసారి చూడండి, ప్లీజ్’’
‘‘సరే, ‘చూస్తే ఏం పోయింది’ అనుకుంటూనే ఆమె వేసినది చూసాను. నీలాకాశం, నల్ల రంగుతో పక్షులు, ఓ నల్ల చెట్టు, అందులో లోపం కనిపించలేదు. అందుకే ‘‘బావుంది’’ అని అన్నాను. అది కూడా మనస్ఫూర్తిగానే.
‘‘నిజంగానా.. సరిగ్గా చూడండి’’.
మరోసారి చూసాను, అంతలోనే ఆ అమ్మాయి నరేంద్ర చేతికి ఇచ్చింది. బ్రష్ కూడా ఇచ్చింది.
‘‘మీరు వెయ్యండి..’’. అయోమయంగా చూస్తూ ఆ సాయంత్రం నాలుగ్గంటల సమయంలో జీవితంలో మొదటిసారిగా డెబ్భై తొమ్మిదేళ్ళ వయసులో బ్రష్ పట్టుకున్నాను.
‘‘అయ్యో! ప్చ్.. ఇక్కడ గడ్డిలేదు, మర్చిపోయాను. మీరు వెయ్యండి’’. తెల్లమొహం వేశాను, ఎలా వేస్తారో తెలీక ఆ అమ్మాయిని చూసాను.
బ్రష్‌ని ఆకుపచ్చరంగులో ముంచి, అటూ ఇటూ రాసి నా చేతికిచ్చింది. చేతిలో ఉంచుకుని, ఏం చెయ్యాలన్నట్టు ఆ అమ్మాయిని చూసాను.
‘‘కిందినుంచి పైకి ఒక్కసారిగా బ్రష్‌ని లాగండి..’’ ఓ మొగ గొంతు వినిపించింది.
వెంటనే వెనక్కి తిరిగి చూసాడు. వెనక సంకర్ష్ నుంచుని ఉన్నాడు. కానివ్వండి అన్నట్టుగా, తలని ఊపాడు.
సందేహిస్తూనే వణుకుతున్న చేత్తో బ్రష్‌ని పైకి లాగాడు.
అంతే బావుంది. బాగా వచ్చింది. మరోసారి ప్రయత్నించండి. అంతలో పాప వచ్చింది. తన చేతిలో ఉన్న షీటుని ఆమెకి ఇవ్వబోయాను.
మీరే పూర్తిగా వేసేయండి, మేము బయటికి వెళ్తున్నాము. నేను ఇంటికివెళ్లిపోవాలి. అనేసి తుర్రుమంది.
నేను సంకర్ష్‌వైపు చూసాను. ఆ పెయింటింగ్‌లో ఉన్న తప్పుల్ని చూపించాడు. ఎలా వేయాలో చెప్పి వాటిని దిద్దాడు. టైము ఎలా గడిచిందో తెలీలేదు. ఇదేదో బాగానే ఉన్నట్టనిపించింది. ఆ తర్వాత రోజూ వెళ్లడం మొదలుపెట్టాను. క్లాసు వారానికి మూడు రోజులే కానీ మిగిలిన ఆ మూడు రోజులు లైబ్రరీలో నెట్‌లో మనవల సాయంతో, ఇతర దేశాల చిత్రకారుల గురించి, వాళ్ళ చిత్రాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను.
బోర్ అనే పదం మనిషిని ఎంత కిందకు తీసుకెళ్లాలో అంత కిందకి తీసుకెళ్తుంది. కానీ ఓ యాక్టివిటీ అనేది మరోసారి జీవం, ప్రాణం పోస్తుంది.. అది నా విషయంలో నిజం అయింది. మరోసారి పుట్టాను. మరో జన్మనెత్తాను.
అప్పుడే మొదటిసారిగా హరివిల్లులో ఎగ్జిబిషన్‌కెళ్ళాను.. మామూలుగా అనిపించింది. అసలు ఏం అర్థం అవలేదు. మరోసారి వెళ్ళాను. ఈసారి పరీక్షగా ఒక్కొక్క చిత్రం దగ్గర చాలా సేపు నుంచున్నాను.
నేనూ ఇలాగే ఓ ప్రదర్శన పెట్టాలంటే, నాకున్న జ్ఞానం సరిపోదు. ఇంకా మెళకువలు నేర్చుకోవాలి. అందుకని నాలుగు చోట్ల నేర్చుకోవడానికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించారు. ఈ వయసులో ఏంటీ, అంతంత దూరాలు, మధ్యలో ఏదైనా జరిగితే.. కానీ వినలేదు. మొండివాళ్ళకి ఏం చెప్తాం అంటూ వదిలేశారు.
నేర్చుకుంటున్న ప్రతిచోటా అందరూ అన్నది ఒకటే.
‘మీ చిత్రాల్లో అమాయకత్వం ఉంది, పాత తరం దృష్టి ఉంది. ఓ తరంలోది మరో తరానికి అందించడం’ అని అన్నారు.
అందులో విమర్శ ఉంది. ప్రేమ ఉంది. కాని నేను ఎవరికోసమో వేయడంలేదు. నేను ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అది ఉటోపియా కాదు. నిజం, నేను వేసినది ఓ మాస్టర్ పీస్ కావాలని, ఇలా వేయగానే అలా గేలరీలోకో, మ్యూజియంలోకో వెళ్లాలని అనుకోను. ఆ తరవాత ఎన్నో వాటర్ కలర్స్, ఆయిల్, యాక్రిలిక్ చిత్రాలు వేశాను. అన్నీ చిత్రాలు కథలని చెప్తాయి. అయితే వేసిన వాటిల్లో చాలామటుకు నా పాత జీవితంలోనివే.
నిన్నా, మొన్నా ఏం తిన్నావని అడిగితే, నేను చెప్పలేను, ఎందుకంటే గుర్తుండదు. కానీ నాకు ఆరేడు సంవత్సరాల వయసులో జరిగినవాటిని గుర్తుకుతెచ్చుకోగలను. చిన్నప్పటి జ్ఞాపకాలను, నమ్మకాలను, ఊరేగింపులు, సంతలో దృశ్యాలు, వీరభద్రుడి ప్రభలు, భేతాళ తీర్థం, సంబరాలు, పామందాల మీద కూచున్న అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటూ, బిందెలు తోముకుంటూ, గిలక బావులు, గాడిపొయ్యి వంటలు, శూలం, నృత్యాలు, పానకం తయారీలు.. ఇలాంటివి. ఇందులో చాలామటుక్కు ప్రపంచానికి తెలియని మా ఊరి హెరిటేజ్, సంస్కృతి, నాగరికత ఉంది. బహుశా ఇదే కావచ్చు, కాలెండర్ల కోసం నన్ను తీసుకున్నది. ఆ తరంది ముందు తరానికి తెలవాలన్న ఉద్దేశం కావచ్చు. అందుకని నేను వేసినదానికి అదేంటో చాలామంది తెలవాలని, ఓ కాయితంమీద రాసిపెడ్తాను. అందులో చాలామటుక్కు దేవుడు, పురాణాల్లోంచి వచ్చినవే. ఎందుకంటే మా ఊళ్ళో గ్రామ దేవతలు మా జీవితాలతో ముడివేసుకున్నవాళ్ళే.
‘దేవుడిని బాగా నమ్ముతావనుకుంటా’ అని అందరూ అడుగుతుంటారు.
నమ్మకం లేకపోతే ఎలా.. అదే లేకపోతే నామీద నాకు నమ్మకం ఎలా వస్తుంది. ఎవరిమీదో లేకపోతే పోనీ, కనీసం నామీదైనా నాకు నమ్మకం ఉండాలి కదా. నన్ను నేను నమ్మలేదనుకో, నేను ఇలా ఓ చిత్రకారుడిని అయ్యేవాడినే కాదు. నేను మొదలుపెట్టేనాటికి నా వయసు డెబ్భై ఎనిమిది. అప్పుడు నాకు ఏమీ తెలీదు. బ్రష్ పట్టుకోవడం కూడా తెలీదు. ఏమీ తెలీకుండా అంత వయసొచ్చాక మొదలుపెట్టడం, అంటే.. నామీద నాకు నమ్మకం ఉండడంవల్లనే కదా.. నమ్మకం ఉంటే అద్భుతాలని సృష్టించవచ్చు. అది ఇంకెవరివల్లా కాదు. కేవలం నమ్మకం ఒక్కటే మిరకిల్స్ చేయగలదు.
మొదట్లో ఉత్సాహంతో పనె్నండు గంటలు వేసేవాడిని. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే.. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెండు గంటల కన్నా ఎక్కువ లేదు. కాని ముందుకన్నా ఇప్పుడే ఉత్సాహంగా ఉంటున్నాను. ఇది నాకు నేను కల్పించుకున్నది. ఓ రెండు గంటలు వేసాకా పడుకోవడానికి వెళ్లిపోతాను. ఎందుకంటే మిగిలినది రేపు వేయాలి. ఆ రేపు అనేది ఓ ఆశని ఇస్తుంది. ఆ ఆశ ఓ ఉత్సాహాన్నిస్తుంది. అంతవరకూ ఉన్న శూన్యాన్ని మాయం చేసింది. ఆ శూన్యం అనేది లేనప్పుడు జీవితం రంగులమయమే కదా. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కాబట్టి, ఇంత పేరు వచ్చిందనుకుంటాను.
నేను ఎన్ని రోజులుంటానో నాకేం తెలీదు. ఏదో ఓ రోజున పోతాను. దానికి ఆందోళన ఎందుకనుకుంటాను. నేను నన్ను చావకుండా చూసుకోగలనా? అలా చేసుకోగలనా? అది అసంభం. అలాంటప్పుడు అసంభవం గురించి ఆలోచించడం ఎందుకు...?
నేను తొంభై ఏళ్ళు దాటిపోయినవాడినని అనుకోను. ‘తొంభై ఏళ్ళ అనుభవం ఉన్నవాడి’నని అనుకుంటా.
అయినా అరవై డెబ్భై, ఎనభైలు ఏవిటీ.. ఏవిటో పెద్దవాళ్ళమై పోయామనుకుంటారు. అది మనసులోకి రానీయకూడదు. థింక్ ఓన్లీ వాట యూ కుడ్ ఎకంప్లిష్డ్. దిస్ అలోన్ ఈజ్ ది లివింగ్.
ఇది ఓ వ్యాయామం, మనసుకి వ్యాయామం. మనిషిలో దాగి వున్న ఓ రకంగా మానవత్వాన్ని బయటికి తెస్తుంది’’.
నేను లేచాను. అతను లేవలేదు. లోపల్నుంచి, కొడుకు, మనవడు వచ్చి అతడిని లేవదీసి చక్రాల కుర్చీలో కూచోపెట్టారు. ఇప్పుడు అమేజింగ్ ఇండియన్స్ అవార్డు కోసం ఢిల్లీ వెళ్లాలి. సాయంత్రం ఫ్లైట్లు’’ అని నా వైపు చూసారు..
‘‘లోకానికి నా రంగుల ప్రపంచంలో ఉంటున్న నా గురించి చెప్పాలి’’ అంటూ నవ్వాడు.
అక్కడ అతన ఏం చెప్తాడో కానీ, నాకు కూడా నేను ఏం చెయ్యాలో చెప్పకనే చెప్పాడు. నన్ను ఇన్‌స్ఫైర్ చేశాడు. *

-గంటి భానుమతి, ఫోన్ నెం:8897643009