ఈ వారం కథ

దసరా(ఆ)కాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-------------------------------------------------------
‘‘దీప్ లేవరా! తాత, బామ్మ వచ్చే టైం అయింది. స్కూల్‌కి సెలవులిచ్చేరు కదా అని పొద్దెక్కేదాకా పడకేయక్కరలేదు’’ అంటూ తన కొడుకును నిద్ర లేపాడు శ్రవణ్. దిగ్గున లేచి కూచున్నాడు దీపక్. వేయివాట్ల బల్లులా వెలిగిపోయింది మొహం.
---------------------------------------------------------

‘‘ఏవండీ, కాంతమ్మకి జీతం ఈ పది రోజులకి కాస్త ఎక్కువేసి ఇవ్వాలి ఈనెల, మర్చిపోకండి’’ అని గుర్తుచేసింది సువర్ణ.
‘‘సర్లేవోయ్! ముందు అమ్మా వాళ్లని వచ్చెళ్లనీ, అపుడు జీతం సంగతి చూద్దాం’’ అన్నాడు. శ్రవణ్ వాళ్ళు అమెరికానించి పదేళ్ల తరువాత, ఈ ఏడాదే ఇండియా తిరిగొచ్చేరు. ఈ వయసులో తన కొడుకును అమెరికాలోకంటే ఇండియాలో చదివిస్తే, ఉద్యోగస్తుడయేవరకు తన కళ్ళముందే ఉంటాడు, క్రమశిక్షణ కూడా అలవడుతుందనే ఉద్దేశ్యంతో తిరిగొచ్చేసారు. సువర్ణ కూడా ఇక్కడే ఉద్యోగంలో జాయినయింది. తమ స్నేహితుల ద్వారా వాకబు చేసి అన్ని వసతులతో వున్న పెద్ద త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకున్నారు.
మనవడికి దసరా సెలవులు ఇవ్వడంతో సరదాగా గడపడానికి రామ్మూర్తి, సీతమ్మ దంపతులు అత్యుత్సాహంతో వచ్చేరు. వారిని గుమ్మంలో చూస్తూనే దీపక్ పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ‘‘ఏరా దీపూ! ఈ బామ్మా, తాతయ్య నీకు గుర్తున్నారా, చిరునవ్వుతో అడిగింది సీతమ్మ’’.
‘‘అసలు మర్చిపోతే కదా బామ్మా!’’ మెరుస్తున్న కళ్ళతో సమాధానమిచ్చాడు దీపక్.
‘‘నా బంగారు తండ్రి’’ అంటూ దీపక్ చేతిని తన చేతిలోకి తీసుకుని లోపలికి నడిచాడు రామ్మూర్తి. అమెరికా వెళ్ళేటప్పుడే శ్రవణ్‌కి చెప్పాడు రామ్మూర్తి- ‘‘మనవడితో మాత్రం వారానికోసారి ఫోన్లో అయినా మాట్లాడించాలి, మా ఫొటోలు వాడికి చూపిస్తుండాలి, ఎంత దూరంగా వున్నా మేము వాడికి దగ్గరగా ఉన్నట్టే. వాడు ఫీలయ్యేలా చేయడం నీ బాధ్యత, గుర్తుపెట్టుకో’’ అని మరీ మరీ చెప్పేడు.
‘‘అత్తయ్యగారూ, మామయ్యగారూ రండి, బావున్నారా? అదిగో ఆ మూడో రూంలో మీ బ్యాగులు పెట్టుకోవచ్చు. ఇదిగో వీడి చదువుకోసమో లేక నాకు ఎక్కువ ఆఫీసు పని వున్నపుడో మాత్రమే ఆ రూం ఉపయోగిస్తాం’’ అని అడక్కుండానే కాస్త గొప్పగా చెప్పింది సువర్ణ.
వస్తూనే వంట గదిలోకి వెళ్లింది సీతమ్మ, మనవడికి పిండి వంటలు చేసి పెట్టేయాలన్న ఆత్రుత. మనవడిని దగ్గర కూచోపెట్టుకుని ‘‘ఏరా దీపూ! ఎలా సాగుతోంది నీ చదువు, స్కూల్ ఫ్రెండ్స్’’ అంటూ కబుర్లు మొదలెట్టేడు రామ్మూర్తి. ఇంతలో వంట పని, ఇంటి పని చూసుకునే కాంతమ్మ వచ్చింది. పండగల టైంలో అడపాదడపా సీతమ్మ దంపతులను చూడటంవలన బాగా పరిచయమున్నట్టే పలకరించింది. ‘‘ఏమ్మా, బావున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది. పండగెళ్లేవరకూ ఉంటారు కదా’’ అడిగింది. ఔనన్నట్లు తలూపి ఊరుకుంది సీతమ్మ. ‘‘అత్తయ్యా! నేను ఆఫీసుకెళ్లొస్తాను, ఇప్పటికే ఆలస్యమయింది. ఈయన పొద్దునే్న వెళ్ళారు, మీరొస్తారని నేనున్నాను’’ చెప్పి హడావిడిగా బయలుదేరింది కోడలు పిల్ల. మధ్యాహ్న భోజనం టైంకే నాలుగు రకాల పిండి వంటలు చేసింది సీతమ్మ, పండగ వెళ్ళేక ఓ నెల రోజులవరకు తినేలా. దీపక్‌కి తాతయ్యా, బామ్మతో కబుర్లు, ఆటలు, పాటలతో సెలవులెలా గడుస్తున్నాయో తెలియడంలేదు. వారాంతాల్లోనే ఇంట్లో ఉండాలంటే బోరు కొడుతుందని గొడవ పెట్టేవాడు దీపక్, అలాంటిది ఇపుడు రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఆడుకుంటున్నాడు. మనవడితో రోజులు క్షణాల్లా పరిగెడుతున్నాయి పెద్దవాళ్లిద్దరికీ.
ఓ రోజు పనంతా ముగిశాక కాంతమ్మ సువర్ణతో అంది- ‘‘అమ్మా! రెండు రోజులు నేను పన్లోకి రాలేనమ్మా’’.
‘‘ఏం కాంతమ్మా, ఒంట్లో బాలేదా?’’ అడిగింది అక్కడే వున్న సీతమ్మ. ‘‘అదేం లేదమ్మా! ఎల్లుండి పండగ కదా! మా అబ్బాయి పన్లోకి పోవద్దంటున్నాడు. ప్రతిరోజూ ఇంట్లో అందరం పనికి బైటికెళ్లిపోతాం, పండగ పూట మాత్రమే నలుగురం కూచుని కాసేపు గడపడానికవుతుంది, అందుకేనమ్మా’’ అంది.
‘‘సరే కాంతమ్మా, ఎక్కువ రోజులు మానేయకు, ఇంట్లో ఇబ్బందవుంతుంది’’ అని చెప్పి పంపింది సువర్ణ.
ఆ రాత్రి సువర్ణ భర్తతో ‘‘ఏవండీ కాంతమ్మ రెండు రోజులు పనిలోకి రానంది.. వాళ్ళబ్బాయి..’’ అంటూ జరిగిందంతా చెప్పి, ‘‘కాంతమ్మ వెళ్లిన దగ్గరనించీ అత్తయ్య చాలా నిశ్శబ్దంగా ఉన్నారండి. కాంతమ్మ మాటలు వింటున్నపుడే నేను తన ముఖంలో మార్పు గమనించేను. ఎందుకయుంటుంది, ఓసారి మాట్లాడి చూస్తారా’’ తన సందేశం వ్యక్తపరిచింది.
‘‘ఎక్కువ ఆలోచించకోయి, ఇందాకే మన దీపుగాడితో అమ్మ సంతోషంగా కబుర్లు చెప్తూండటం నే చూసాను’’ అన్నాడు శ్రవణ్. అమ్మా నాన్నల దగ్గర పడుకోడానికి వచ్చిన దీపక్ చాలా ఆనందంగా కనిపించాడు వాళ్ల నాన్నకి. ‘‘ఏరా దీపూ! ఏంటంత హేపీగా ఉన్నావ్’’ అడిగాడు.
‘‘ఔను నాన్నా! తాతయ్యా వాళ్ళున్నారుకదా, అందుకే. తాతయ్య, బామ్మ నాకెన్నో మంచి కథలు చెప్తున్నారు తెలుసా. చాలా విషయాలు నేర్చుకుంటున్నా నాన్నా. బామ్మ నాకిష్టమైన పిండి వంటలన్నీ చేసి పెట్టింది. ఈ సెలవులు ఇంకా చాలా రోజులుంటే బావుంటుంది కదా నాన్నా’’ అన్నాడు.‘‘ఔను దీపూ! పడుకో ఇంక’’ అని కొడుకు తల నిమురుతూ శూన్యంలోకి చూస్తూండిపోయాడు శ్రవణ్.
నవరాత్రులు ప్రారంభమయాయి. సీతమ్మ దగ్గరుండి దీపక్ చేత శ్రద్ధగా పూజలు చేయించింది. రామూర్తి పండగ విశిష్టత, భగవంతుడి శ్లోకాలు అర్థంతో సహా మనవడికి వివరించాడు. తీరిక దొరికినపుడు శ్రవణ్ తన తల్లిదండ్రులతో కాసేపు కబుర్లు చెప్తుండేవాడు. ఓ రోజు దీపక్ ‘‘‘తాతయ్యా! నువ్వు, బామ్మా ఎక్కడుంటారు?’’ అనడిగాడు. ఓ క్షణం సీతమ్మ, రామూర్తి ఒకర్నొకరు చూసుకుని నవ్వుకున్నారు. ‘‘చెప్పు తాతయ్యా! ఎందుకు నవ్వుతున్నావ్’’ అనడిగాడు. ‘‘మేము మా స్నేహితులతో ఒకే ఇంట్లో ఉంటాం. అందరూ మా వయసు వాళ్ళే. కబుర్లు చెప్పుకుంటుంటాం, కలిసి తింటాం, కలిసే పడుకుంటాం. ఒంట్లో బాగోలేనపుడు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాం’’ అన్నాడు. ‘‘ఓహ్! చాలా బావుంటుందన్నమాట! మరీ తాతయ్యా! ‘‘నాన్న, అమ్మ కూడా నీ అంత పెద్దయ్యాక అలాగే ఫ్రెండ్స్‌తో కలిసుంటారా’’ అడిగాడు. ఆ చిన్నపిల్లాడు అమాయకంగా అడిగిన ప్రశ్నకు నలుగురూ ఆశ్చర్యపోయారు. ఇంతలో సీతమ్మ సర్దుకుని ‘‘లేదు నాన్నా! అమ్మా, నాన్న నీతోనే ఉంటారు. నువ్వు పెద్దయి మంచి ఉద్యోగం తెచ్చుకుని వాళ్లిద్దరినీ నీ దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడికీ పంపకూడదు. సరేనా. ఇక వెళ్లి ఆడుకో నాయనా’’ అని మనవడిని అక్కడినుంచి పంపింది.
ఒక్కసారిగా శ్రవణ్‌కి ఊపిరాగినంత పనయింది. అక్కడి వాతావరణం ఇబ్బందిగా అనిపించి సువర్ణ ఆఫీసు పనుదంటూ వేరే గదిలోకి వెళ్లిపోయింది. రెండేళ్ళ క్రితం తనకు, మధ్య జరిగిన సంభాషణ కళ్లముందు కదిలింది శ్రవణ్‌కి.
‘‘ఏరా శ్రవణ్ ఎప్పుడొస్తున్నారు ఇండియా’’
‘‘వచ్చే ఏడాది వచ్చేస్తాం నాన్నా’’
‘‘ఓహ్, మంచి వార్త చెప్పేవురా, నేను, మీ అమ్మ ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నాం. నీకు తెలుసు కదా నేను రిటైరయ్యాను, మీ అమ్మకి కూడా మోకాళ్ల నొప్పులు అవీ మొదలయ్యాయి. నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే మేము నీ దగ్గరే ఉండి, మా మనవడితో ఆడుకుంటూ ఈ ముసలికాలాన్ని గడిపేస్తాం నాన్నా’’ అన్నాడు కొడుకుతో రామ్మూర్తి.
అటునుంచి సమాధానం లేదు.
‘‘అరేయ్ నాన్నా ఉన్నావా, ఇక్కడ మీ నాన్న ఇంత పెద్ద విషయం చెప్తూంటే, ఏం మాట్లాడవేంరా’’ అంది తల్లి సీతమ్మ.
‘‘నువ్వే అంటున్నావ్ కదమ్మా పెద్ద విషయమని, జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా’’-
‘‘జీర్ణించుకోవడమేమిటిరా! వింతగా మాట్లాడుతున్నావ్’’-
‘‘అమ్మా, నాన్నా! నేను ఇపుడు మాట్లాడబోయేది కాస్త ఓపికగా, ఆవేశపడకుండా పూర్తిగా వినండి. నేను అమెరికా వచ్చి చాలా ఏళ్లవుతోంది. ఇక్కడ సంస్కృతి, పద్ధతులు గమనిస్తూనే ఉన్నాను. ఇక్కడ పిల్లలు యుక్తవయస్సుకొచ్చేసరికి తమ కాళ్లమీద తాము నిలబడాలని, బాధ్యత తెలుసుకోవాలని బయటికెళ్లి ఉద్యోగాలు సంపాదించుకుని, తల్లిదండ్రులనుంచి దూరంగా ఉంటారు. ఇక అక్కడనించి వైవాహిక జీవితం, తమ పిల్లలు అంతా ఇలా వేరేనే. వయసు మీదపడినా సరే తల్లిదండ్రులు కొడుకుల దగ్గరకు వచ్చి ఉండరు. వారికి భారంకారు. కొడుకు వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకోరు. ఈ పద్ధతిని అనుసరించడం వలన పెద్దలు, పిల్లలు కూడా సుఖంగా బతుకుతున్నారు. ఇండియాలో కూడా ఇలానే ఉంటే అందరూ సంతోషంగా ఉంటారని నేను, సువర్ణ ఎన్నోసార్లు అనుకున్నాం’’ అని ముగించాడు.
పెద్దవాళ్లిద్దరికీ పిడుగు పడ్డట్టయింది. ఇక తమ జీవితం అయిపోయినట్టే అన్నంత బెంగా, బెదురు వారి మొహాల్లో కనపడ్డాయి.
‘‘ఏమంటారు నాన్నా! నేను చెప్పింది సబబుగానే ఉంది కదా! మీకెలాగూ పెన్షన్ వస్తుంది, అవసరమయితే నేను ఇంకా డబ్బు పంపుతాను అనుకోండి’’-
‘‘ఏం మాట్లాడుతున్నావ్‌రా, ఒంటిమీద తెలివికాని పోయిందా ఏం’’ గొంతు పెద్దది చేసి ఇంకేదో అనబోయింది సీతమ్మ. రామ్మూర్తి తనను వారించి ‘‘సరే శ్రవణ్! నీకెలా మంచిదనిపిస్తే అలాగే, మేము నీకు అడ్డురాము, అడ్డుకాము కూడా ఎప్పటికీ. ఇక ఉంటా నాన్నా, ఆరోగ్యం జాగ్రత్త, మనవడిని కోడిలిని అడిగినట్లు చెప్పు’’ అని ఫోన్ పెట్టేశాడు.
ఈ సంభాషణ జరిగిన వారానికే అద్దెకుంటున్న ఇల్లు ఖాళీ చేసి వృద్ధాశ్రమంలో జాయినయ్యారు. కొడుకు ఇండియా వచ్చేక పండుగలకి, పబ్బాలకి వచ్చి వెళుతున్నారు.
ఆ రాత్రంతా శ్రవణ్‌కి నిద్రపట్టలేదు. ఏదో తెలియని బాధ, భగవంతుడు మొట్టికాయ పెట్టేడా అన్నట్టు తల వేయి ముక్కలుగా బద్ధలైపోతుందేమో అన్నంత నొప్పి. సువర్ణ కూడా పక్కనే కూచుంది కానీ నోట మాట రావడంలేదు. అర్థరాత్రి దాటింది. ‘‘ఏమండీ, సాయంత్రం దీపు అన్న మాట చెవిలోనే మోగుతోందండీ’’ అంది.
‘‘చాలా పెద్ద తప్పు చేశాను సువర్ణ. శ్రవణ్ అని పేరు పెట్టినందుకు ఆ శ్రవణ కుమారుడిలా కన్నవారిని చూసుకోవాల్సిందిపోయి, ఆ పేరుకు సార్థకత కాదు కదా, పేరు పోగొట్టేను. దైవ సమానులైన తల్లిదండ్రులను ఈ వయసులో మానసిక క్షోభ పెట్టేను. ఎంతో ఉత్సాహంగా వాళ్ళ మనసులో మాట బయటపెడితే, అంతకు రెట్టింపు నిరాశని వారికి మిగిల్చేను. ఒక్కగానొక్క కొడుకునని నాన్న తన గుండెలమీద ఎక్కించుకుని ఆడించేరు. ఆ కఠినమైన మాటలు ఆ గుండెకి తూటాల్లా తగిలుంటాయి పాపం. నా కొడుకు రూపంలో ఆ భగవంతుడే నాకు బుద్ధొచ్చేలా చేసేడు సువర్ణ. రేపే అమ్మా, నాన్నల కాళ్లమీద పడి క్షమాపణ అడుగుదాం. మన అవసరం వారికి కాదు, అటువంటి పెద్దల పర్యవేక్షణలో ఉన్నపుడే మనం, మనతోపాటు దీపక్ కూడా సుఖంగా జీవితాన్ని గడపగలుగుతాడు’’ కళ్ళల్లో నీళ్లు దిగమింగుకుంటూ తన బాధను వెళ్లగక్కేడు శ్రవణ్.
‘‘అవునండీ! మీరన్నది అక్షరాలా నిజం. ఇవాళ దీపూ అలా అడగ్గానే నా తల్లి మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది, మీరు ఆ రోజున అలా చెప్పినపుడు అత్తయ్య ఎలా ఫీలయ్యుంటారో నాకిప్పుడే అర్థమయింది. వాళ్లిక మనకి దూరమవకూడదు.
మర్నాడు పొద్దునే్న అంతా లేచి, తయారయి రామ్మూర్తి పర్యవేక్షణలో దసరా పూజను శ్రద్ధగా చేసుకున్నారు. సాయంత్రం సీతమ్మ, రామ్మూర్తి తమ బాగ్‌లు సర్దుకుని ‘‘శ్రవణ్! ఇక మేము బయలుదేరుతాం నాన్నా.. ఆరోగ్యం జాగ్రత్త! సువర్ణా ఉంటామమ్మా, మళ్లీ కలుద్దాం. దీపూ! బాగా చదువుకోవాలి తెలిసిందా, అమ్మా, నాన్నలు చెప్పిన మాట వినాలి. వాళ్లని అల్లరి పెట్టకూడదు, అర్థమయ్యిందా’’ అని లేవబోయారు. అంతే శ్రవణ్ చిన్నపిల్లాడిలా వాళ్ళ కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించేడు. ‘‘నన్ను క్షమించండి, నాకిన్నాళ్లు తెలియలేదు. విదేశీ సంస్కృతి, పద్ధతులు అని ఏదేదో పిచ్చి వాగుడు వాగి మిమ్మల్ని బాధపెట్టేను. అనేక కష్టనష్టాలకోర్చి, రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను పెంచేరు. ఈ వయసులో మీ యోగక్షేమాలు దగ్గరుండి చూసుకోవడమే అసలైన బాధ్యత అని తెలుసుకున్నాను. ఇన్నాళ్లూ మిమ్మల్ని దూరంగా ఉంచి పాపం చేసేను. ఇకనైనా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి నాన్నా’’ అంటూ చిన్నపిల్లాడిలా బోరుమన్నాడు.
నిశే్చష్టులయారు పెద్దలిద్దరూ. కళ్లలో ఆనందబాష్పాలు, మనసులో కొండంత బలం, మదిలో నిశ్చింత. కొడుకును లేవదీసి గుండెలకి తనివితీరా హత్తుకున్నారు. సువర్ణ కూడా తోడయింది. అంతా చూస్తున్న మనవడు ‘‘తాతయ్యా, బామ్మా! నాన్న ఎందుకు ఏడ్చేడు, నాన్నని పట్టుకుని మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నా కూడా హాపీగానే కనిపిస్తున్నారే. నాకేం అర్థం కాలేదు’’ అన్నాడు అమాయకంగా. ‘‘అంతా నీవలనేరా బంగారుకొండ’’ అని దగ్గరకు తీసుకుంది సీతమ్మ.
‘‘ఔను దీపూ, థ్యాంక్యూరా, ఇకనించి తాతయ్య, బామ్మా కూడా మనతోనే ఉండబోతున్నారు, అహ కాదు మనమే వాళ్లతో ఉంటాం’’ అంది సువర్ణ.
‘‘హమ్మయ్యా! హ్యాపీ దసరా’’ అని సంతోషంతో గట్టిగా ఓ అరుపరిచాడు దీపక్. ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. అంతా కలిసి భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరించుకున్నారు.
చెడును మంచి జయించడమే దసరా పండుగ విశిష్టత. మనిషి మనసే ఓ పెద్ద యుద్ధ్భూమి. మంచి చెడుల తేడా తెలుసుకోవడం, మానవతా విలువలు, తల్లిదండ్రుల విలువ గుర్తించిననాడే అసలైన పండగ. ఈ సారాంశాన్ని గ్రహిస్తారని ఆకాంక్షిస్తూ... *

-కౌముది ఎం.ఎన్.కె.