ఈ వారం కథ

పుట్టిన రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎందుకమ్మా అంత డల్‌గా ఉన్నావు’అడిగింది సరిత
‘ఏం లేదమ్మా!మనకు డబ్బులు ఉంటే బాగుండేదికదా’ అంది పదిహేనేళ్ల వాణి
సరిత కాస్త ఆశ్చర్యపోయింది. ‘వాణీ! నువ్వు ఏదైనా కొనుక్కోవాలి అనుకొంటున్నావా..’ అనునయంగా అడిగింది సరిత.
‘నేనా! ఏమీ అనుకోలేదే ’అంది వాణి నిర్లిప్తంగా
‘మరి డబ్బులుంటే బాగుండు అన్నావు కదా. మరి నీకు డబ్బెందుకు? దేనికోసం కావాలి. మీ నాన్న ఏమైనా అడిగితే డబ్బు ఇవ్వను అని అన్నా రా.. నీకు ఏంకావాలో నాకు చెప్తే నేను మీ నాన్నతో చెప్తాను కదా’ ఇంకా ఏదో చెప్పబోతున్న సరితను వాణి ఆపుతూ
‘అమ్మా అమ్మా.. ఆపు నేను కొనుక్కోవాలని అనుకోలేదు. నాన్నను అడగలేదు. ఆయన ఇవ్వను అని అనలేదు. నేను ....’ మధ్యలోనే ఆపేసింది వాణి
‘మరెందుకు డబ్బులుంటే బాగుండు కదా అన్నావు’అంది సరిత
‘ఏదో లేమ్మా తర్వాత చెప్తాను. ఇపుడు నేను హోంవర్క్ చేయాలి ’అంది. వాణి
సరిత కూడా పని ఉందిలే తర్వాత మాట్లాడుదాం అనుకొని అప్పటికి వాణిని వదిలేసింది. కానీ మనసులో వాణి గురించి ఆలోచన. అపుడే నిన్నటి విషయం జ్ఞాపకం వచ్చింది.
నిన్న స్మిత వాళ్లింటిలో గొప్పగా బర్త్‌డే ఫంక్షన్ జరిగింది. బంధువులతోపాటుగా కాలనీ లో ఉండే అందరినీ భోజనానికి పిలిచారు. దేవదూత లాగా స్మిత తయారు అయింది. అందరూ ఏంజెల్ అని అన్నారు కూడా. నిజమే వాళ్లకు బాగా డబ్బు ఉంది. అందుకే అలా చేశారు. ఇప్పుడర్థమైంది. వాణి కూడా అలాంటి బర్త్‌డే ఫంక్షన్‌ను కోరుకుంటుందేమో అనుకొంది సరిత.
రెండు రోజుల తర్వాత వచ్చిన బర్త్‌డే ఫంక్షన్ రోజు పొద్దునే్న వాణి కోరుకున్న బట్టలు కొనిచ్చింది. వాటితో చక్కగా అలంకరణ చేసుకొంది వాణి. స్కూల్‌కు వెళ్తాను అక్కడ ఇవ్వడానికి చాక్లెట్స్ తెచ్చుకోనా అని అడగడానికి రాగానే ‘వాణీ! ఈరోజు నీవు స్కూల్‌కు వెళ్లకు. నాతో బాటు రా..’అంది సరిత.
‘ఎందుకమ్మా! మా ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్స్ ఇస్తానని ఎదురుచూస్తుంటారు’ అందివాణి.
‘వాళ్లకు తర్వాత ఇద్దువులే. ముందు మీనాన్నగారు కూడా వచ్చేస్తారు.అందరం కలసి వెళ్దాం తయారు అవ్వు’అంది సరిత.
అయిష్టంగానే వాణి తయారు అయింది. అంతలో వాణి నాన్న కూడా వచ్చారు. వస్తూ పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని వచ్చా రు. వాటిని చూసి ఇవి అన్నీ ఏంటి నాన్నా అంటూ ముదిగారాలు పోతూ వాణి అడిగింది. తనకోసం ఏదో తెచ్చారనుకొని. ఏం లేదమ్మా అన్నీ నీకే తెలుస్తాయి. పద పద పోదాం. అసలే టైమ్ అయిపోతోంది అంటూ హడావుడిగా ముగ్గురూ ఆటోలో వెళ్లారు.
***
అదొక అనాథాశ్రమం. ఆటో దిగిన వాణికి అందులో ఉన్న పిల్లలంతా పరుగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్‌డే అక్కా అంటూ పూలు ఇచ్చారు. లోపలకి వారితో బాటు తీసుకెళ్లారు. అంతలో వాణి నాన్న బ్యాగుల్లోంచి బట్టలు తీసి వాణి చేత వారికి ఇప్పించారు. వారంతా వాటిని వేసుకొని రమ్మని సరిత చెప్పింది. వాళ్లంతా కొత్త బట్టలు ధరించి వచ్చి చాలాబాగున్నాయి అక్కా అంటూ వాణిని మెచ్చుకున్నారు. బోజనాల టైమ్ అయింది అందరూ భోజనాలకు రండి అని అక్కడి వార్డ్‌ను అంది. పిల్లలంతా వరుసగా వెళ్లారు. వారితోపాటు సరిత, వాణి, ప్రభాకర్ ముగ్గురూ వెళ్లారు.
అందరికీ అన్నం వడ్డించారు. స్వీటు వేస్తూ ఈరోజు వాణి అక్క బర్త్‌డే కదా అందుకే ఈ స్వీట్ ఈ అన్నం అంతా వాణి వాళ్ల అమ్మగారు చేయించారు అంటూ చెప్పారు. అంతే పిల్లలంతా స్వీటు ఎంతో బాగుందని తింటూ వాణి ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని దీవించారు. వారంతా కడుపు నిండా అన్నం తిని వాణితో కలసి సాయంత్రం దాకా ఆటలు ఆడుకున్నారు. రాత్రి భోజనాలు కూడా చేసి వాణి వాళ్లు సంతోషంగా ఇంటికి వచ్చారు.
‘అమ్మా! నా పుట్టిన రోజు చాలా బాగా జరిగింది కదా. నీవు ఎప్పుడు ఇలా చేయాలనుకొన్నావు. నేను స్మిత పుట్టినరోజు చాలా బాగా జరిగింది అనుకొన్నాను. కానీ ఇప్పుడు ఆ పిల్లలందరి కళ్లల్లో వెలుగు చూసి వారంతా సంతోషంతో నాకు శుభాకాంక్షలు చెప్పడం చూసి ఎంతో ఆనందం వేసింది. నా పుట్టిన రోజే చాలా బాగా గడిచింది అనిపించింది ’అని చెప్పింది.
ఇక అప్పటి నుంచి వాణి బిహేవియర్‌లో మార్పు వచ్చింది. ఆదివారాలు అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలకు చదువులో హెల్ప్ చేయడం, వాళ్ల ఫ్రెండ్స్ కూడా చెప్పి వారి చేత కూడా అనాథాశ్రమంలో పిల్లలకు సాయం చేయించడం చేస్తోంది. అప్పటినుంచి స్మిత ను కూడా తీసుకెళ్లి తాను ఎలాబర్త్‌డే ఫంక్షన్ చేసుకుందో చెప్పింది. స్మిత దాని నంతా విని నేను కూ డా వచ్చే సంవత్సరం నీలా చేసుకొంటాను అని చెప్పింది. మరెప్పుడూ డబ్బుల ప్రస్తావన వాణి తీసుకొని రాలేదు. దీనినంతా చూస్తున్న సరిత హాయిగా ఊపిరి పీల్చుకుంది.

-మానస (ఎస్.ప్రసన్నలక్ష్మి) 99592 53016