ఫ్లాష్ బ్యాక్ @ 50

గోవుల గోపన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలితరం సినీ నటీమణుల్లో ఒకరు లక్ష్మీరాజ్యం. చిన్ననాటినుంచి సంగీతం, నాటకాల పట్ల ఆసక్తితో సినీ రంగంలోనూ సమర్ధవంతంగా ఏ పాత్రనయినా పోషించగల నటీమణిగా పేరుపొందారు. ఆమె భర్త శ్రీ్ధర్‌రావుతో కలిసి రాజ్యం పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలు రూపొందించారు. రాజ్యాం పిక్చర్స్ బేనర్‌పై 1968లో ‘గోవుల గోపన్న’ చిత్రాన్ని నిర్మించారు.
1966లో రూపొందిన కన్నడ చిత్రం ‘ఎమ్మితమ్మన్న’. పద్మినీ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి కథ-ఎ.కె.వేలన్, డైలాగ్స్, లిరిక్స్ జి.వి.అయ్యర్, సంగీతం- టి.జి.లింగప్ప, రాజ్‌కుమార్, భారతి, డిక్కి మాధవరావు, సుబ్బన్న, కృష్ణశాస్ర్తీ, నరసింహరాజు వంటి నటులు నటించారు. ఈ చిత్రం ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం ‘గోవుల గోపన్న’. 19-04-1968న విడుదల.
‘గోవులగోపన్న’ చిత్రానికి కథ ఎ.కె.వేలన్, మాటలు- భమిడిపాటి రాధాకృష్ణ, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, కళ- జి.వి.సుబ్బారావు, ఎడిటింగ్- ఎస్.పి.ఎస్.వీరప్ప, స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ, నృత్యం- వెంపటి సత్యం, నిర్మాతలు- శ్రీ్ధర్‌రావు, లక్ష్మీరాజ్యం, దర్శకత్వం- సి.ఎస్.రావు.
దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య కుమారులు చిత్తజల్లు శ్రీనివాసరావు. 1953లో ‘‘పొన్ని’’ తమిళ చిత్రం ద్వారా దర్శకులుగా ప్రవేశించి, శ్రీకృష్ణతులాభారం (1955) తెలుగు చిత్రం నుంచి పలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించటమేకాక, కొన్ని చిత్రాల్లో చక్కని నటునిగా పాత్రలు పోషించారు. కంచుకోట, ఏకవీర, యశోదాకృష్ణ వంటి వెరైటీ చిత్రాలను కడురమ్యంగా తీర్చిదిద్దిన వీరి దర్శకత్వంలో రూపొందిన పలు సాంఘిక చిత్రాలలో ఒకటి 1968లోని ‘‘గోవుల గోపన్న’’.
అక్కినేని నాగేశ్వరరావు గోవులగోపన్నగా, లాయర్ చంద్రశేఖర్‌గా ద్విపాత్రాభినయం చేసారు. అమాయకపు గోపన్న గోవులను పట్నంలోని ఛైర్మన్ నాగరాజు (గుమ్మడి) కుమార్తె తార, తన కారుకు అడ్డం వచ్చాయని కర్రతో కొడుతుంది. దానికి కోపించిన గోపన్న ఆమెపై చేయి చేసుకుంటాడు. ఈ సంగతి తన తండ్రికి చెబుతుంది తార (రాజశ్రీ) గోపన్నను అంతం చేయమని తన రౌడీలను పంపుతాడు నాగరాజు. నాగరాజు కుమారుడు, కస్తూరి (చలం) వారి బారినుండి గోపన్నను రక్షించి, అతని వేషంమార్చి లాయర్ నరసింహం (రేలంగి) ఇంటికి పంపుతాడు. అంతకుముందు తమ కుమార్తె రాధ(్భరతి)కు భర్తగా తన స్నేహితుని కుమారుడు శేఖర్ ఎల్.ఎల్.బిని నిర్ణయించిన నరసింహం అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంతలో వచ్చిన గోపన్ననే శేఖర్‌గా భావించి ఆదరిస్తారు. రాధ, గోపన్నలు ప్రేమించుకుంటారు. పట్నం వచ్చిన శేఖర్‌ను, గోపన్నగా భావించిన నాగరాజు అనుచరులు అతన్ని బాగా చితక్కొట్టగా, వారినుంచి తప్పించుకొని నరసింహంవద్దకు వెళతాడు. అక్కడ గోపన్న కథ విని అతన్ని విద్యావంతునిగా చేస్తానని మాట ఇవ్వటం, వారిరువురూ ఒకరిగా నటిస్తూ చలామణి అవుతారు.
శేఖర్‌ను కలుసుకున్న తార అతన్ని ప్రేమించటం, ఆమెతో వివాహానికి శేఖర్ ఇష్టపడి, లాయర్ నరసింహంకు ఈ విషయం తెలియచేస్తాడు. శేఖర్ తండ్రి మరణానికి, వారి ఆస్తిపోవడానికి నాగరాజు కారణం అని నరసింహం చెప్పగా, ఆవేశంతో నాగరాజు వద్దకువెళ్ళి బందీ అవుతాడు. విద్యావంతుడైన గోపన్న తెలివిగా నాగరాజు సంపాదించిన శేఖర్ తండ్రి డైరీని, రాధతో కలిసి చేజిక్కించుకోవటం, నాగరాజు అక్రమ వ్యాపారాలు సాగించే డెన్‌లోవున్న శేఖర్‌ను విడిపించి, పోలీసులకు నాగరాజును, అనుచరులను స్వాధీనం చేయటం. రాధతో గోపన్న, తారతో శేఖర్, సి.ఐ.డి. రాజేశ్వరి (రాజీ) సుకన్యతో కస్తూరికి వివాహాలు జరగటంతో చిత్రం సుఖాంతం అవుతుంది.
దర్శకులు సి.ఎస్.రావు సన్నివేశాలను, కామెడీతో సీరియస్‌నెస్ జోడించి, కొంత తమాషాలతో మరికొంత అర్ధవంతంగా, ఆకట్టుకునే రీతిలో చిత్రాన్ని తీర్చిదిద్దారు. గోపన్న, శేఖర్ పాత్రలు ఒకే ఫ్రేములో, ఒకేసారి చిత్రంలో 4,5 సన్నివేశాలలో దగ్గరగా వుండడం, వారి హావభావాలు, ముచ్చటగొలిపేలా, సాహసి అయిన శేఖర్‌ను ఒక ఫైట్‌తో, అమాయకుడైన గోపన్న తెలివిగా గడియారం రహస్యం ఛేదించటం, చివర ఫైట్‌లో రౌడీలతో ఎంతో చాకచక్యంగా తలపడి పోరాడడం, శేఖర్ బందీగా నిలవటం. అలాగే పాటల చిత్రీకరణలో ‘ఆకాశంలో హంసలమై హాయిగా తిరిగే’ పాటలో శేఖర్, తారలపై గోపన్న, రాధలపై గీతం ‘ఈ విరి తోటల లోగిటిలో’ మరో చరణం చలం, సుకన్యలపై హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ఎంతో సహజంగా చిత్రీకరించటం, చిత్ర ప్రారంభంలో గోపన్న పాత్ర ప్రవేశ గీతం ‘వినరా వినరా నరుడా’ గోవులతో ఎంతో సహజంగా మధ్యలో కారులో రాజశ్రీ ప్రయాణం, అక్కినేని, భారతిలపై రాధాకృష్ణుల ప్రణయ గీతం ‘కనె్నల వలపుల వెన్నలు దోచే కన్నయ’ ఎంతో చక్కని వైవిధ్యం చూపారు. ఈ చిత్రంలో ఇతర గీతాలు సుకన్య, చలంపై ‘డండం డ్రైక్లీనింగ్’ (ఘంటసాల- బెంగుళూరు లత) రచన కొసరాజు. శేఖర్‌ను గోపన్న అనుకొని తార పాడే గీతం. హల్లో మిస్టర్ గోవుల గోపన్న (ఎస్.జానకి బృందం ఆరుద్ర) సుకన్యపై చిత్రీకరించిన మరో ఆరుద్ర గీతం ‘హడావిడి పెట్టకోయి బావా’(ఎస్.జానకి) ఆకాశంలో హంసలమై (ఘంటసాల, పి.సుశీల- దాశరధి రచన) ‘కనె్నల వలపుల’ గీతం (రచన దాశరధి, గానం ఘంటసాల, పి.సుశీల) ఈ విరి తోటల లోగిటిలో (ఘంటసాల, పి.సుశీల, జె.వి.రాఘవులు, లత-రచన- శ్రీశ్రీ) సంగీత, సాహిత్యపరంగా జనరంజకంగా నిలిచాయి.
ఈ చిత్రంలో నరసింహం భార్య వరలక్ష్మమ్మగా సూర్యకాంతం, స్వాతికమైన లక్షణాలుగల భార్యగా మెప్పించే నటనతో, శేఖర్ తల్లిగా నిర్మాత లక్ష్మీరాజ్యం అమాయకపు మహిళగా అలరించే సాధు నటన చూపారు. రౌడీగా జగ్గారావు, ఇంకా వంగర, ఇతరులు నటించారు.
రాధగా భారతి ఎంతో సున్నితమైన ప్రేమికురాలిగా, కూతురిగా అంతలోనే కొద్ది స్వాభిమానం, తన భర్త గోవులు కాచేవానిగా కంటె గొప్ప రాణింపుగల వ్యక్తికావాలనే సగటు స్ర్తికోరిక, ‘ఎంతో భావయుక్తమైన నటనతో, తారగా రాజశ్రీ ఆ పాత్రకు తగ్గ పౌరుషాన్ని, అతిశయాన్ని శేఖర్‌తో ప్రేమలో పడ్డాక, స్వభావంలో మార్పును, పాత్రోచితమైన నటన చూపారు.
ఇక చిత్రంలో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గోపన్న పాత్రలో అమాయకత్వాన్ని, శేఖర్ పాత్రలో చురుకుదనాన్ని వారిరువురూ ఎదురుపడినపుడు చూపుల ద్వారా మాటల ద్వారా ముఖ కవళికలలో మార్పు, ప్రణయగీతాల్లో ఆ పాటలకు తగ్గ అభినయం, తారను నీటి కొలనునుంచి రక్షించటం, చిత్రం చివర గోపన్నగా ఫైట్స్ ద్విపాత్రాభినయ చిత్రానికిగల వైవిధ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా పోషించి ఆకట్టుకున్నారు.
‘గోవుల గోపన్న’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ చిత్రాన్ని సుందర్‌లాల్ నహతా విడుదలచేశారు.
‘గోవుల గోపన్న’ చిత్రాన్ని హిందీలో ప్రముఖ నిర్మాతలు సుందర్‌లాల్ నహతా, డూండీలు విజయలక్ష్మీ పిక్చర్స్ బేనర్‌పై ‘‘1966లో జిగ్రీదోస్త్’’ పేరుతో హిందీలో నిర్మించారు. జితేంద్ర, ముంతాజ్, కోమలి నటించారు. విశ్వామిత్ర ఆదిల్ సంభాషణలు, లక్ష్మీకాంత్ ప్యారెలాల్ సంగీతం సమకూర్చారు. రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించారు.
ఆ తరువాత 1970లో తమిళంలో జయంత్ ఫిలిమ్స్ పతాకంపై ‘మాట్టుకార్‌వేలన్’గా యం.జి.రామచంద్రన్, జయలలిత, లక్ష్మీ కాంబినేషన్‌లో ఎస్.ఎ.అశోకన్ విలన్‌గా రూపొందించారు. ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్, దర్శకత్వం- పి.ఏ.నీలకంఠన్, నిర్మాత- ఎన్.కనగసభాయ్, వి.కె.రామస్వామి, చో.రామస్వామి కూడా నటించారు. 14-01-1970 విడుదల.
ఒకే కథలో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ 4 భాషల్లో ఒక చిత్రం రూపొంది విజయం సాధించటం విశేషాంకంగా చెప్పుకోవాలి.

- సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి