ఫ్లాష్ బ్యాక్ @ 50

విధి విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వకవి రవీంద్రుని శాంతినికేతన్‌లో చదువుకున్న సీవీఆర్ ప్రసాద్ సారథీ స్టూడియో స్థాపించిన వారిలో ప్రముఖులు. సారథీ సంస్థలో దర్శకులు తాపీ చాణుక్య, చైర్మన్ రామకృష్ణ ప్రసాద్‌లతో కలిసి పలు చిత్రాలు రూపొందించారు. తరువాత -సొంతంగా సినిమా నిర్మించాలనే ఆశయంతో ‘ప్రగతి పిక్చర్స్’ బ్యానర్ రూపొందించారు. ఆ బ్యానర్‌పై సీవీఆర్ ప్రసాద్ నిర్మించిన తొలి చిత్రం -విధి విలాసం. సారథీ స్టూడియోస్‌లో పలు చిత్రాలు, ఇతర సంస్థల చిత్రాలు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి వాసికెక్కిన ప్రముఖుడు తాపీ చాణుక్య. సీవీఆర్ ప్రసాద్ నిర్మించిన తొలి చిత్రం విధి విలాసానికి దర్శకుడు తాపీ చాణుక్య. 1970 మార్చి 12న విడుదలైన ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది.

మాటలు: నార్ల చిరంజీవి, అప్పలాచార్య
కళ: సూరన్న
సంగీతం: మాస్టర్ వేణు
కూర్పు: ఎ వెంకటేశ్వరరావు
నృత్యం: విజె శర్మ
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కమల్‌ఘోష్
పాటలు: నార్ల చిరంజీవి, అప్పలాచార్య,
కొనకళ్ల వెంకటరత్నం, బివి నరసింహారావు
అసోసియేట్ నిర్మాత: దేవ్‌కిషోర్
నిర్మాత: సీవీఆర్ ప్రసాద్
దర్శకత్వం: తాపీ చాణుక్య
*
ఆస్తిపరుడు, రిటైర్డ్ ఇంజనీరు నాగయ్య. అతని నౌకరు గోవిందు (పెరుమాళ్లు). భార్య చనిపోగా, నాగయ్య కుమార్తె ఆరేళ్ల నిర్మల దేవుని ఉత్సవంలో తప్పిపోతుంది. ఆ బెంగతో నాగయ్య కుమిలిపోతుంటాడు. ఓ నర్సు సంరక్షణలో పెరిగిన నిర్మల (విజయనిర్మల) పెంచిన తల్లి మరణించటంతో, ఓ మెస్ నడిపే శేషమ్మ (నిర్మలమ్మ) ఆశ్రయం పొందుతుంది. అక్కడ ఇంజనీరింగు చదివే కృష్ణ (కృష్ణ)తో పరిచయం ప్రేమగా మారుతుంది. అదే ఊరిలోని కాంట్రాక్టర్ కామేశం (నాగభూషణం), అతని కుమార్తె లలిత (విజయలలిత) డ్యాన్సర్. లలిత కృష్ణను ఇష్టపడుతుంది. కాని కృష్ణ, నిర్మలను వివాహం చేసుకొని ఉద్యోగం నిమిత్తం మరో ఊరువెళ్తాడు. అక్కడ స్నేహితుడు రామారావు, అతని భార్య రాధలతో నివసిస్తూంటారు. రాధ, నిర్మల ఒకేసారి గర్భవతులు కావటం, వారి ప్రసవ సమయానికి కృష్ణ, రామారావులు వేరే ఊరువెళ్లటం జరుగుతుంది. అనుకోకుండా సంభవించిన తుఫాను కారణంగా రాధ ఓ పాపకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆ పాపే తన కుమార్తె అని, భార్య నిర్మల మరణించిందని భావించి పాపను జ్యోతి పేరుతో పెంచుతుంటాడు కృష్ణ. మరోచోట మగబిడ్డను ప్రసవించిన నిర్మల -్భర్త జాడ తెలియక అనుకోకుండా గోవిందు ఆశ్రయం పొంది పడరాని పాట్లు పడుతుంది. కృష్ణ కూతురు జ్యోతి (బేబీ శ్రీదేవి), నిర్మల కొడుకు రాము (మాస్టర్ రాము) ఆరేళ్ల వయసుకు వస్తారు. అదే ఊరికి వచ్చిన లలిత తిరిగి కృష్ణకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటుంది. కృష్ణ, నిర్మల పెంపుడు కుక్క టామీ, జ్యోతి, రామూలవల్ల భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. నిర్మలను అంతం చేయబూనిన లలిత -వారిని క్షమాపణ కోరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో కృష్ణ సహాయకుడు తిరపతిగా రేలంగి, అతని భార్య పరపతిగా సూర్యాకాంతం నటించారు. టామీగా సాబు అనే కుక్క కనిపించింది. దర్శకులు తాపీ చాణుక్య సినిమా టైటిల్‌కు తగ్గట్టు కథను, సన్నివేశాలను రూపొందించి చిత్రీకరించారు. కృష్ణ, నిర్మల వివాహం వరకూ సినిమా ఓవిధంగా సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. తరువాత -మరో ఊరిలో పెళ్లికి రాధ వెళ్తాననటంతో నిర్మల తన పేరుగల నగ, కొంత డబ్బు ఇచ్చి పంపటం.. రాధ మరణించటంతో -ఆ నగను అందుకున్న కృష్ణ.. నిర్మల మరణించిందని భావించటం, కూతురు జ్యోతితో ఒంటరిగా జీవించటంలాంటి బరువైన సన్నివేశాలు ప్రేక్షకులను కథలోకి లాక్కెళ్తాయి. ఏ దిక్కూలేని నిర్మల గోవింద్‌వద్ద పేదరాలిగా బాబుతో పడే అవస్థలు, ఆ తరువాత చురుకైన పిల్లల సన్నివేశాలు, వారి భేటీలు, నిర్మలను గుర్తించిన టామీ రియాక్షన్స్, స్వతహాగా మంచిదైన లలిత.. తండ్రి చెప్పుడు మాటలతో నిర్మలకు విష ప్రయోగం చేయటంలాంటి సన్నివేశాలతో కథకు మంచి మలుపునిచ్చారు దర్శకులు. అక్కడి సన్నివేశంలో నిర్మల తనకు పాప వద్దు, కొడుకు రామూనివ్వమని లలితను కోరటం, మాస్టర్ రాము గోవింద్ కోసం ఒకసారి టామీతో కలిసి డాక్టర్ బ్యాగ్‌తో అతన్ని పరిగెత్తించి ఇంటికి రప్పించటం, మరోసారి గూడు రిక్షాలో తల్లికోసం పెద్ద డాక్టర్‌ని తేవటం, ముందు రాముపై కోపంగల జ్యోతి.. తరువాత అతని మంచితనం గుర్తించి డబ్బు సంపాదించటానికి బుడగలు అమ్మటం, వారిరువురిపై తమాషా పాట -మంచి వాళ్లు ఈ బాబులు మామంచి (గానం: విజయలక్ష్మీశర్మ, పుష్పలత) చిత్రీకరణ సాగటం అలరిస్తుంది. తనదైన శైలిని దర్శకులు తాపీ చాణుక్య మరోసారి చిత్ర రూపకల్పనలో ప్రదర్శించారు. పాత్రోచితమైన నటనతో నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బేబీ శ్రీదేవి, మాస్టర్ రాము ప్రతిభావంతంగా ఎంతో ఈజ్‌తో పాత్రలను రక్తికట్టించారు.
‘విధి విలాసం’ చిత్రం పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించటం విశేషం. కాగా నటులు కృష్ణ, తాపీ చాణుక్య దర్శకత్వంలో నటించిన తొలి చిత్రంకూడా ఇదేకావటం మరో విశేషం. సారథీ స్టూడియోలోనే ఎక్కువ భాగం చిత్రీకరణసాగింది. అంతేకాక ఈ చిత్రానికి ఘంటసాల, బాలసుబ్రమణ్యం కాకుండా హీరో కృష్ణకు మోహన్‌దాసు, చిత్తరంజన్‌లచే పాడించారు. అలాగే లేడీ వాయిస్ విజయలక్ష్మీశర్మ, రామలక్ష్మి, పుష్పలతలు పాడారు. మాస్టర్ వేణు ఈ చిత్ర సంగీత దర్శకులైనా, చిత్రానికి నేపథ్య సంగీతం -ది హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్ గిల్ట్ సభ్యులు అందించారు. రీ రికార్డింగ్ కూడా వారిచేత చేయించటం గమనార్హం. సినిమా సంగీత కళాకారులు హైద్రాబాద్‌లోనూ ఉన్నారని, నిర్మాత ప్రసాద్ ఈ చిత్రం ద్వారా 50ఏళ్లనాడే నిరూపించటం ప్రశంసనీయాంశం.
అలాగే చిత్రంలో సాబు అనే కుక్క చేత చేయించిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. డాక్టర్ బ్యాగ్ పట్టుకొని పరిగెత్తటం, నిర్మల నగను కృష్ణ చేతిలోంచి లాక్కొని ఆమెకొరకు పరుగుతీయటం వంటి అంశాలు ఎన్నదగినవి. నటులు కృష్ణ 1969-70లో 20 చిత్రాలకు పైగా నటించటంతో వాటికోసం షూటింగ్‌లతో చాలా శ్రమపడ్డారు. అంతేకాక చాలా చిత్రాల్లో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించటం, అవి ఎక్కువ శాతం విజయవంతం కావటంతో వారిద్దరూ హిట్ పెయిర్‌గా వెండితెరపైనా పేరుగడించటం మరో విశేషాంశం.
చిత్ర గీతాలు:
టైటిల్ సాంగ్ -విధి విలాసమేలే అంతా విధి విలాసమేలే (గానం: కెబికె మోహన్‌దాసు). కృష్ణ, విజయలలితపై చిత్రీకరించిన నృత్య గీతం -వల్లారి మావో కావురో రయ్య (గానం: కెబికె మోహన్‌దాసు, విజయలక్ష్మీశర్మ). మరో గీతం -కాలానికి హృదయం లేదు/ కన్నీటికి విలువ లేదు (గానం: కెబికె మోహన్‌దాసు). కృష్ణ, విజయనిర్మలపై చిత్రీకరించిన యుగళ గీతం -ముసురేసిందంటే పైన అసలేమతి (గానం: కెబికె మోహన్‌దాస్, విజయలక్ష్మీశర్మ). బాబుతో గుడిలో విజయనిర్మలపై చిత్రీకరించిన విషాద గీతం -బరువైనది రేయి/ కరువైనది హాయి (గానం: రామలక్ష్మి). ఈ చిత్రంలో -బాపూజీ/ మన బాపూజీ (గానం: చిత్తరంజన్ పార్టీ) అంటూ సాగే గాంధీజీ బాలేలో బొల్లారానికి చెందిన రవీంద్ర నాట్య కళాసమితి నుంచి కె గోపాలరెడ్డి అండ్ పార్టీ నటించింది. కృష్ణ, విజయలలిత మిగిలిన బృందంపై అలరించేలా చిత్రీకరణ సాగింది.
విధి విలాసం -కృష్ణ నటించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. అలాగే కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన చిత్రాల్లో ఒకటిగా చోటుచేసుకోవటం చెప్పుకోదగ్గ అంశం. కాగా ఈ చిత్రంలో బాల నటి, కృష్ణ కూతురిగా నటించిన బేబి శ్రీదేవి -తరువాతి కాలంలో హీరోయిన్‌గా కృష్ణ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించటం విశేషాంశం. మాస్టర్ రాము కూడా ఆ తరువాత కొన్ని చిత్రాల్లో తన నటప్రతిభతో రాణించాడు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి