ఫ్లాష్ బ్యాక్ @ 50

రాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ.వి.మెయ్యప్పన్ 1938లో అల్లి అర్జున్‌తో 1940 ప్రగతి స్టూడియోస్ ప్రారంభించి, కొన్ని చిత్రాలు రూపొందించారు. 1945లో మద్రాస్‌లో శాంథోంలో ఎ.వి.యం.స్టూడియోస్ ప్రారంభించి పలు చిత్రాలు రూపొందించారు. వైజయంతి మాల నటిగా పరిచయమైన, ‘జీవితం’ చిత్రం వారి విజయవంతమైన చిత్రాల్లో ఒకటి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100 పైగా చిత్రాలను నిర్మించిన సంస్థ. ఏ.వి.ఎం. 1968లో ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘రాము’.
(04-05-1968 విడుదల)
1958లో అమెరికన్ చిత్రం ‘‘ది ప్రౌడ్ రెబల్’’ ఆధారంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, స్క్రీన్‌ప్లే, రైటర్, నిర్మాత, దర్శకుడు, ఆల్ రౌండర్ ఏ మేన్ ఆఫ్ ఆల్ వర్ట్యూస్ అయిన హిందీ నటుడు కిషోర్‌కుమార్ 1964లో నిర్మించిన చిత్రం ‘‘దూర్ గగన్‌కి చాహున్ మైయి’’ (్ఘ ఘత్ఘీక ఖశజూళూ ఆ్దళ ఒ్ద్యజ్యూతీ యచి ఆ్దళ ష్యఖజూఒ) తమ కిషోర్ ఫిలిమ్స్ బేనర్‌పై కిషోర్‌కుమార్, సుప్రియాచౌదరి, అమిత్‌కుమార్ కాంబినేషన్‌లో నిర్మించారు.
ఆ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు 1966లో ఎ.సి.త్రిలోక్‌చందర్ దర్శకత్వంలో, జావర్ సీతారాం స్క్రీన్‌ప్లే, సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్, సమకూర్చగా, జెమిని గణేషన్, పుష్పలత, కె.ఆర్.విజయ, మాస్టర్ రాము, ఎస్.ఎ.అశోకన్ కాంబినేషన్‌లో, యం.మురుగన్, కుమారన్, యం.శరవణన్, యం.బాలసుబ్రమణ్యం, నిర్మాతలుగా ‘రాము’ తమిళ చిత్రం రూపొందించారు. ఈ తమిళ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు నిర్మించిన తెలుగుచిత్రం రాము. ‘‘ఉమా ప్రొడక్షన్స్ సమర్పణ’.
ఈ చిత్రానికి దర్శకత్వం- ఏ.సి.త్రిలోక్‌చందర్, కథ, సంవిధానం జావర్ సీతారాం, సంగీతం-ఆర్.గోవర్ధనం, మాటలు- డి.వి.నరసరాజు, స్టంట్స్- శ్యాంసుందర్, ఛాయాగ్రహణం- డి.రాజ్‌గోపాల్, ఎడిటింగ్-ఆ.జి.గోపు, నృత్యం-ఎ.కె.చోప్రా.
మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) కొడుకు రాము (మాస్టర్ రాజ్‌కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు. సైన్యంనుంచి తిరిగి వచ్చిన రాజా, బిడ్డ రామూ, కుక్క జాకీతో మరోచోటికి ప్రయాణమై వెళతాడు. అనుకోకుండా సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున)గల గ్రామం చేరటం. ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.
వైద్యంకోసం మద్రాస్ వెళ్ళి, అది ఫలించక తిరిగి రాముతో గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్‌చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో లాయర్‌గా అల్లురామలింగయ్య, డ్రామా ఆర్టిస్టులుగా మాణిక్యం (సూర్యాకాంతం),
రత్నంగా గీతాంజలి, ఆశీర్వాదంగా రమణారెడ్డి, పాడుబడిన తోటలో చెల్లెలి మరణంతో పిచ్చివాడుగా ముద్రపడ్డ వ్యక్తిగా ఎస్.వి.రంగారావు నటించారు.
స్క్రీన్‌ప్లే రైటర్‌గా, దర్శకునిగా ఎక్కువ భాగం తమిళ చిత్రాలకు, కొన్ని హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి, పలు అవార్డులు పొందిన విశిష్ట దర్శకులు ఏ.సి.త్రిలోక్‌చందర్ రాము, తమిళ, తెలుగు చిత్రాలకు రెండిటికి వీరే దర్శకత్వం వహించటం విశేషం. తెలుగుదనానికి తగ్గట్టుగా అత్యంత సహజంగా సన్నివేశాలు చిత్రీకరించి వనె్న తెచ్చారు.
కథానాయకుడు రాజాగా ఎన్.టి.రామారావు మొదటి భార్య, రాములపై ప్రేమానురాగాలను తరువాత మూగవాడైన కుమారుని పట్ల బాధతో కూడిన ఆప్యాయతను, అసహాయురాలైన యువతి, తన తోటి సిపాయి సింగన్న కూతురు అయిన లక్ష్మికి అండగా నిలవటం, ఆమె తనను ఇష్టపడినా, తన భార్యపైగల ప్రేమతో ఆమెను నిరాకరించటం(చివరకు లక్ష్మి, రాముతోపాటు వారితో చోటు ఇమ్మని కోరటం) కుమారుడికి మాటలు రావని తెలిసి వేదన, డబ్బు పోగొట్టడానికోసం, సముద్రంలో దూకనున్న కొడుకును కాపాడుకొని, దైవాన్ని వేడుకోవటం, అంతేకాక స్టంట్ మాస్టర్ రూపొందించిన పులితో పోరాటం కొరడాతో, రంగన్నతో కర్రతో ఫైట్, కాగడాలతో ఫైట్ ఎంతో సహజంగా, చురుకుగా ప్రదర్శించటం ప్రశంసనీయమైన నటన చూపగా, దానికితోడుగా లక్ష్మిగా జమున, తన శాంతియుతమైన యుక్తమైన నటనతో సన్నివేశాలను, ఆర్ద్రతతో హుందాతనంతో, నిండుతనం చేకూర్చారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించగా, ఎస్.వి.రంగారావు, మాస్టర్ రామూ తమ పాత్రలను ఎంతో సహజంగా నటించి మెప్పించారు.
రాము చిత్రంలోని గీతాలు, చిత్ర ప్రారంభంలో రాము మాస్టర్ రాజ్‌కుమార్‌పై చిత్రీకరించిన సుమతి శతకం పద్యం అక్కరకు రాని చుట్టము (గానం- పి.సుశీల) తొలుత రాము పాడిన గీతం పుష్పలత, ఎన్.టి.ఆర్, మాస్టర్ రాజ్‌కుమార్‌లపై ఒకసారి, మరోసారి జమున, ఎన్.టి.ఆర్ రాములపై చిత్రీకరణ ‘పచ్చనిచెట్టూ ఒకటి వెచ్చని చిలకలు రెండు’ (పి.సుశీల, ఆరుద్ర) ‘వలపుల చిలక, పలకని చిలక, చిలకా రాజు మదిలో సుఖమేది’ సన్నివేశానుగుణమైన గీతం, చరణాలలో రావటం విశేషం. జమునపై చిత్రీకరించిన ‘కలగంటి కలగంటి చరణం’ వెనుక ఎన్.టి.ఆర్.పై ‘మంటలురేపే నెలరాజా’ వెనె్నలలో ఎంతో ఆర్ద్రత, వేదన నిండిన గీతం (పి.సుశీల, ఘంటసాల, దాశరథి) ఎన్.టి.ఆర్. అభినయం ప్రాణంపోసింది.
గీతాంజలి, సూర్యాకాంతం, రమణారెడ్డి, పద్మనాభంలపై చిత్రీకరించిన ‘తారాశశాంకం’ నాటకం (ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పిఠాపురం, ఎం.ఆర్.తిలకం- రచన కొసరాజు) జమున, మాస్టర్ రాజ్‌కుమార్, ఎన్.టి.ఆర్‌లపై చిత్రీకరించిన మరో గీతం జమున హుషారుగా, ఎన్.టి.ఆర్. నిర్వేదన, రామూ ఆనందం (మామిడికొమ్మా మళ్ళీమళ్ళీ పూయునులే’’- పి.సుశీల- దాశరథి) రాము చిత్రంలో మరో మధురమైన భక్తిగీతం ఘంటసాలవారు నాగయ్య, ఎన్.టి.ఆర్.ల కిరువురికీ ఒకేసారి ఒక చరణం చివరలో పాడడం విశేషం. ‘రారా కృష్ణయ్య రారాకృష్ణయ్య’ (రచన-దాశరథి- గానం ఘంటసాల బృందం). ఆర్.గోవర్ధనం స్వరాలతో ఈ చిత్ర గీతాలు అలరించేలా సాగాయి.
‘‘రాము’’ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శింపబడింది. తెలుగు చిత్రం సూపర్‌హిట్ చిత్రంగా నమోదుకావటం ఆనంద దాయకం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి