ఫ్లాష్ బ్యాక్ @ 50

నిత్య కల్యాణం -పచ్చతోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటలు: ఆరుద్ర
కూర్పు: కెవి మార్తాండ్
కళ: బిఎన్ కృష్ణ
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నృత్యం: డి వేణుగోపాల్
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఎస్‌ఆర్ పినిశెట్టి
నిర్మాత: తోట కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ: రౌతు పిక్చర్స్
**
పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన భూస్వామి కుటుంబంలోని నలుగురు అన్నదమ్ముల్లో నాల్గవవాడు తోట కృష్ణమూర్తి. సినిమా నిర్మాణం పట్ల అభిరుచివున్న కృష్ణమూర్తి, బాపూజీ ఆశయమైన కుల మత భేదాలులేని సమ సమాజం కావాలన్న కథాంశంతో నిర్మించిన చిత్రమే -నిత్యకల్యాణం పచ్చతోరణం. ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం ఎస్‌ఆర్ పినిశెట్టి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు పినిశెట్టి శ్రీరామమూర్తి. 1946లో ‘ఆదర్శజ్యోతి’, 1950లో ‘పల్లెపడుచు’ వీరు రచించిన నాటకాలు ఈయన ఖ్యాతినిచాటడమే కాదు, పలు ప్రశంసలు తీసుకొచ్చాయి. ‘పల్లెపడుచు’ నాటకాన్ని సినిమాగా బోళ్ల సుబ్బారావు నిర్మించడంతో, అలా సినీ రచయితగా పినిశెట్టి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. ‘రాజూ- పేద’ చిత్రానికి వీరు సమకూర్చిన సంభాషణలు అత్యంత సహజంగా, శక్తివంతంగా సాగి అలరించటంతో వీరి ప్రస్తానం జయప్రదంగా ప్రారంభమైంది. సంతానం, ఇలవేల్పు, సిరిసంపదలు, ధర్మపత్ని, పిన్ని, జరిగిన కథ -వంటి 50పైగా చిత్రాలకు రచన చేసిన పినిశెట్టి, ‘చిలకాగోరింక’, ‘గృహలక్ష్మి’ చిత్రాల్లో హాస్యపాత్రలు పోషించారు. వీరి కుమారుడు రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా పరిశ్రమలో ఎదిగితే, మనవడు ‘ఆది పినిశెట్టి’ వర్ధమాన నటునిగా కొనసాగుతున్నారు. 1960లో దర్శకునిగా ఎస్‌ఆర్ పినిశెట్టి రూపొందించినదే నిత్య కల్యాణం- పచ్చతోరణం.
డాక్టర్ ప్రకాశ్‌రావు(గుమ్మడి) అగ్రకులస్తుడు. మరో డాక్టరు సుశీల (సంధ్య)ను మతాంతర వివాహం చేసుకుంటాడు. అతని బావ శేషాద్రిశాస్ర్తీ (సిఎస్‌ఆర్) శుద్ధశోత్రియుడు. చెల్లెలు శాంత (హేమలత) పేరుకు తగిన ఇల్లాలు. బావమరిదిని ఇంటికి రానీయని శేషాద్రికి జడిసిన శాంత, తాను 7వ నెల గర్భిణియని, అంతకుముందు కాన్పులు పోవటంచేత అన్నగారివద్ద మందులు వాడతానని ఉత్తరం వ్రాస్తుంది. దానికి జవాబుగా మందులతో శాంత ఇంటికి వచ్చిన ప్రకాశరావును, భార్య సంధ్యను శేషాద్రి ఇంటినుంచి పంపివేసి, మరో ఊరిలోవున్న తన చెల్లెలు గంగారత్నం (సూర్యకాంతం), బావ సోమయాజులు (రమణారెడ్డి)ని ఇంటికి రప్పిస్తాడు. శాంతమ్మకు మగ పిల్లవాడు పుట్టడం, అదే సమయానికి హరిజనుడు నాగన్న (వైవి రాజు) భార్య ఒక పిల్లవాడిని కని మరణించగా, ప్రకాశరావు ఆ బాబును ఇంటికి తెచ్చి శాంత బిడ్డతోపాటు ఆ బాబుకు పాలిచ్చి పెంచమంటాడు. మంచిమనసుతో శాంతమ్మ అందుకు అంగీకరిస్తుంది. మగపిల్లవాడు కలిగాడని ఆనందంతో శేషాద్రి వచ్చి శాంత ప్రక్కనగల బిడ్డడిని తన కొడుకేనని తమ ఊరు తీసుకొస్తాడు. ఆ బాబుకు జ్వరం రావటంతో శాంతమ్మను పిలిపించటం, శాంతమ్మ తానక్కడ ఉండాలంటే మరో అనాధ బాలుడు ఇక్కడ పెరగాలని భర్తను కోరటంతో, శేషాద్రి కొడుకుని వాడు రంగాగా, నాగన్న కొడుకు రామూగా ఆ ఇంటిలో పెరిగి పెద్దవారవుతారు. ప్రకాశరావు దంపతులకు ఓ ఆడపిల్ల షీలా పుట్టడం, శేషాద్రి బంధువు శంకరం (అల్లు రామలింగయ్య) ఓ వర్ణాంతర వివాహం చేసికొని, ఓ ఆడపిల్లను కని మరణించటంతో పిచ్చివాడుగా తిరుగుతుంటాడు. ఆ పిల్ల చాంద్ పేరుతో ఓ దాదా (కెవిఎస్ శర్మ) వద్ద పెరుగుతుంది. అందరూ యుక్త వయస్కులయ్యాక షీలా (రాజశ్రీ), రామూ (రామకృష్ణ); రంగా (చలం), చాంద్ (కృష్ణకుమారి) పరస్పరం ప్రేమించుకోవటం, తన కొడుకు అని శేషాద్రి భావిస్తున్న రామూ, షీలాల వివాహం ఆపాలని శేషాద్రి పట్నం ప్రకాశరావు ఇంటికి వెళ్లటం, చాంద్ ముస్లిం యువతి రంగాతో వివాహం జరగరాదని పేకేటి బృందం అడ్డుపడడం, చివరికి శేషాద్రికి నిజం తెలిసి, రామూ, రంగా ఇద్దరూ తన బిడ్డలేనని అంగీకరించి వారి వివాహాలు ప్రకాశరావు నిర్మించిన నిత్యకల్యాణం పచ్చతోరణం కల్యాణ మండపంలో జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆదర్శవాదిగా మల్లాది, శేషాద్రి ఇంటి పనివాడు గురువులుగా నల్ల రామ్మూర్తి, అతని భార్య తలుపులమ్మగా సీత నటించారు. ఓ హాస్య గీతం -ఏం పిల్లో గాబర గీబరగున్నవో (గానం: పిఠాపురం, స్వర్ణలత)లో అలరించారు.
తాను నమ్మిన సిద్ధాంతాలు ఆచరించటంలో ఎటువంటి ఆవేశ కావేషాలు లేకుండా పేరుకుతగ్గట్టు ప్రకాశవంతంగా, పేదలపాలిట ఆప్తుడైన పాత్రలో గుమ్మడి భావయుక్తమైన నటనను ప్రదర్శించారు. బావచే అవమానం పొందినా చెల్లెలిని ఆదరించి, ఆమె మంచిని కోరిన అన్నగా, సుశీల భర్తగా, షీలాతో వివాహం విషయంలో రాముకు హితవు చెప్పిన వ్యక్తిగా తన పాత్రలో గుమ్మడి ఇమిడిపోయారు. తను ఆచరించే కుల ధర్మాన్ని పాటించే, కొంత మూర్ఖత్వం, మొండితనం, ఆగ్రహంకల వ్యక్తి అంతలోనే భార్య, కుమారుని (రామూ)పట్ల అభిమానంగల వ్యక్తి (సిఎస్‌ఆర్) శేషాద్రిగా రాణించారని చెప్పుకోవాలి. సూర్యాకాంతం, రమణారెడ్డి పాత్రోచితమైన నటన చూపగా, రంగాగా చలం పాత్రకు తగిన హుషారు, వైరుధ్యాన్ని సన్నివేశపరంగా ఎంతో ఈజ్‌తో ప్రదర్శించారు. చాంద్‌గా కృష్ణకుమారి అమాయకత్వం, చలాకీతనం, రంగాను విచిచి వెళ్లటంలో వేదన, అతన్ని తిరిగి కలిశాక ఆనందం యుక్తవంతమైన నటన చూపారు. షీలాగా రాజశ్రీ నటనలో, మాటలలో చూపులలో ఎంతో సున్నితమైన, వలపును, నిశ్చయాన్ని అలవోకగా మెప్పించగా ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన రామకృష్ణ సన్నివేశాలకు తగిన అభినివేశాన్ని ఎంతో పరిణితితో ప్రదర్శించారు. ఇక శాంతమ్మగా హేమలత అటు కన్న బిడ్డను పరాయివానిగా, అప్రయోజకునిగా పెంచటం, పరాయి బిడ్డను వాత్సల్యంతో సాకటం, ఈ రెండింటిమధ్య బాధ, ఆనందం, వేదన ఎంతో ప్రశంసనీయమైన నటనచూపటం, దాన్ని దర్శకులు రామూ పాత్ర చేత, ప్రకాశరావు పాత్రనే చివరలో చెప్పించటం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి.
చిత్రగీతాలు:
చిత్రం ప్రారంభంలో పిల్లలిద్దరినీ సాకుతూ, సుధ్య, హేమలతలపై, మహనీయుల చిత్రాలు, బొమ్మలు చూపుతూ చిత్రీకరించిన -చిరంజీవి పిల్లల్లారా, చిన్నారి పాపల్లారా (గానం: ఎస్ జానకి), చలం, కృష్ణకుమారిలపై యుగళ గీతం -అసలు నీవు రానేల/ అంతలోనే పోనేలా (గానం: పిబి శ్రీనివాస్, జిక్కి), కృష్ణకుమారిపై చిత్రీకరించిన -సాగిపోవు ప్రియతమా ఆగరా... (గానం: ఎస్ జానకి), కృష్ణకుమారిపై నాటకంలో నృత్యగీతం (చలం రియాక్షన్‌తో సాగుతుంది) -మనసెంతో నాజూకు అది నజరానా నీకు (గానం: జిక్కి), చలంపై చిత్రీకరించిన -ఎవరికివారే యమునా తీరే (గానం: పిబి శ్రీనివాస్), చలంపై చిత్రీకరించిన ఘంటసాల ఆలపించిన ఒకే ఒక్క గీతం -టనానా టంకు చలోరాజా ఆకట్టుకుంటాయి. చిత్రంలో రామకృష్ణ, రాజశ్రీలపై తోటలో, నదిలో పడవలో, సైకిళ్లపై ఆహ్లాదంగా సాగే మధుర గీతం -నీమది పాడెను ఏమని నిజానికి నీవే నేనని (గానం: పిబి శ్రీనివాస్, పి సుశీల). టైటిల్ సాంగ్ తొలుత శంకరం, లతల వివాహ సందర్భంగా భారతమాతగా సంధ్య నటించగా బాల బాలికలపై సందేశ్మాక గీతంగా చిత్రీకరించబడింది. ‘నిత్యకల్యాణము, పచ్చతోరణము బంగారు భారతము’ (గానం: ఎస్ జానకి, సరోజిని బృందం). కులభేదాలను నిరసిస్తూ సాగిన గీతం చిత్రం చివరలో బాపూజీ బోధనలు పాటించినపుడే ప్రతి ఇంట వెలుగు పచ్చతోరణము అని తెలియచేస్తూ తిరిగి వినిపిస్తుంది.
మంచి సందేశాత్మక చిత్రంగా ‘నిత్యకల్యాణం -పచ్చతోరణం’ నిలవటం, ఆ రోజుల్లోనే ఆచార వ్యవహారాలను నిరసిస్తూప్రాంతీయ, మతాంతర భేదాలకు తావీయరాదని సూచిస్తూ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలను అభినందించాలి. చిత్ర నిర్మాత తోట కృష్ణమూర్తి ఆ తరువాత ‘జీవితాలు- జాతకాలు’ అనే మరో చిత్రం ప్రారంభించి నిర్మాణ దశలోనే పరమపదించారు.
‘నిత్య కల్యాణం- పచ్చతోరణం’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకులు యల్‌వి ప్రసాద్ తమ యల్‌వి ప్రసాద్ ప్రొడక్షన్స బేనర్‌పై ‘దా దిమా’గా హిందీలో 1966లో నిర్మించారు. అశోక్‌కుమార్, బీనారాయ్, రెహమాన్, తనూజ మొదలగువారు నటించిన చిత్రానికి సంగీతం రోషన్, నిర్మాత, దర్శకుడు యల్‌వి ప్రసాద్.
నిత్య కల్యాణం- పచ్చతోరణం జయాపజయాలతో సంబంధం లేకుండా ఆనందించదగ్గ చిత్రం. ఈ చిత్రంలోని -నీ మది పాడెను, -ఎవరికి వారే గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ఆరుద్ర, పెండ్యాల పద స్వర రచన ఇందులో కనిపిస్తుంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి