ఫ్లాష్ బ్యాక్ @ 50

కుల దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1956లో ఏవీఎం స్టూడియోస్, ఎస్‌కె పిక్చర్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణన్ పంజూ సారథ్యంలో తమిళంలో రూపొందించిన చిత్రం -కులదైవం. అంతగా అభివృద్ధి భావాలు చోటుచేసుకోని ఆ రోజుల్లోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని కష్టనష్టాలు, విడో మ్యారేజీ అంశాలను పొందుపర్చి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన కథ ఆధారం.
ఈ సినిమాలో ఎస్‌వి సహస్రనామం, పండరీబాయి ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్‌ఎస్ రాజేంద్రన్, చంద్రబాబు, ఎంఆర్ సంతానలక్ష్మి, ఎంఎన్ రాజం, ఎంకె ముస్త్ఫా తదితరులు నటించారు. సినిమాకు సంగీతం ఆర్ సుదర్శనం సమకూర్చారు. మురసోలి మారన్ స్క్రిప్ట్ రచించారు. సుబ్రమణ్యభారతి, భారతీదాసన్, కల్యాణ సుందరం పాటలు రాశారు. ఈ చిత్రానికి గవర్నమెంటు మెరిట్ అవార్డ్ లభించింది. కులదైవం చిత్రం ఆధారంగా 1957లో మొయ్యప్పన్ హిందీలో ‘బాబీ’ నిర్మించారు. దర్శకత్వం కృష్ణన్ పంజు, సంగీతం చిత్రగుప్త నిర్వహించారు. బలరాజ్ సహాని, పండరీబాయి జంటగా ఇంకా నందా ఓంప్రకాష్, దుర్గాఖోటే, శ్యామ, డైసీ ఇరాని, జవహర్ కౌల్, జగ్దీప్, దుర్గా కోటే తదితరులు నటించారు. ఈ చిత్రాల ఆధారంగా సారథీ స్టూడియోస్ తమ బేనర్‌పై ‘కులదైవం’ తెలుగు చిత్రాన్ని రూపొందించింది.
కథ: ప్రభావతి సరస్వతి
మాటలు: కొండేపూడి లక్ష్మీనారాయణ
సంగీతం: మాస్టర్ వేణు
కళ: వి సూరన్న
నృత్యం: విజె శర్మ
ఎడిటింగ్: ఎ సంజీవి
దర్శకత్వం: కబీర్‌దాస్
నిర్మాత: వై రామకృష్ణప్రసాద్.
1960 మార్చి 4న సినిమా విడుదలైంది.
‘పయనించే ఓ చిలుకా’ పాటతో టైటిల్స్ ప్రారంభమవుతాయి. మందుతో పరుగెడుతూ ఓ యువకుడు ఇల్లు చేరతాడు. తండ్రి మరణించటంతో ఆ యువకుడు రత్నం కఠిన నిర్ణయం తీసుకుంటాడు. అతనికి ముగ్గురు తమ్ముళ్లు రామూ, రాజూ, గోపీలను చదివించటం కోసం తాను చదువుమానేసి తండ్రి స్నేహితుడు ధర్మారావు (వక్కలంక కామరాజు) సాయంతో బట్టల వ్యాపారం మొదలుపెడతాడు. బెజవాడలో రత్నం బ్రదర్స్ బట్టలషాపు ఓనర్‌గా ఆస్తిపరుడౌతాడు. రత్నం (గుమ్మడి) భార్య ఓ బిడ్డను కని మరణిస్తుంది. మేనత్త (రమాదేవి) వారందరినీ కనిపెట్టుకుని ఉంటుంది. ఆమె సలహాపై రత్నం, శాంత (అంజలీదేవి)ను స్వీకరిస్తాడు. శాంత బిఏ చదువుకన్నా, ఆ విషయం తెలియనీయక ఎంతో ఒద్దికతో సంసారం చక్కబెడుతుంటుంది. ఆమె చెల్లెలు లత (గిరిజ) ఏడో యేటే వివాహం జరిగి బాల వితంతువైనా, ఆమెకెవరూ ఆ విషయం చెప్పకపోవడంతో రత్నం ఇంట్లోనే అక్కతోపాటుగా ఉంటూ గోపీ (చలం)ని తమాషాగా ఆటపట్టిస్తూ చలాకీగా ఉంటుంది. పెద్దతమ్ముడు రామూ (కృష్ణారావు) బిఎల్ చదివి, ధర్మారావువద్ద అప్రెంటీస్ చేస్తూ వాళ్లమ్మాయి అరుణ (కృష్ణకుమారి)పై ప్రేమ పెంచుకుంటాడు. రత్నానికి పరిచయస్తుడైన శేషయ్య (పెరుమాళ్లు) కూతురు ప్రభావతి (ఆదోని లక్ష్మి) అంతగా చదువుకోకపోయినా, తన రెండో తమ్ముడు రాజు (జగ్గయ్య)తో పెళ్లి నిశ్చయించి, రామూ, రాజుల వివాహం జరిపిస్తాడు రత్నం.
పెళ్లిలో లత కారణంగా ప్రభావతి ద్వేషం చూపటం సహించలేని రాజు, పట్నంలో హాస్టల్‌లో మెడిసిన్ చదువు కొనసాగిస్తుంటాడు. ప్రభ నోటి దురుసువలన ఆ కుటుంబంలో కష్టాలు మొదలవటం, పురిటికి పుట్టింటికి వెళ్లిన అరుణ, ఆస్తిలో భాగంకోసం భర్తను ఒప్పించి ఆమె తమ్ముడు ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించేలా చేస్తుంది. లత తాను విడో అని తెలిసి అత్తవారింటికి వెళ్తుంది. ప్రకాష్ కుట్రవలన ఆస్తి పంపకాలు జరిగడంతో రత్నం బ్రదర్స్ షాపు మూతపడుతుంది. అది భరించలేని రత్నం అనారోగ్యం బారినపడి పాత ఇంటికి చేరతాడు. గోపి బొంబాయి ఉద్యోగానికి, రాజు మిలటరీ ఉద్యోగానికి వెళ్లిపోవటంతో మనోవేదనకు గురై రత్నం మరణిస్తాడు. విడిపోయిన వారంతా ధర్మరావు, శేషయ్యల వలన చేసిన పొరబాట్లను గ్రహిస్తారు. రత్నం కోరిక ప్రకారం లత, గోపీల వివాహం జరిపిస్తుంది శాంత. రత్నం ఫొటోముందు అంతా నమస్కరించటంతో చిత్రం ముగుస్తుంది.
ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు, అభిమానాలు ఎంతో సున్నితంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు దర్శకుడు కబీర్‌దాస్. అన్నమాట దాటని తమ్ములుగా వారితో రూపొందించిన సన్నివేశాలు చూపటం, పెద్దతమ్ముడి పెళ్లి ప్రభతో నిశ్చయించిన రత్నం, అతను అరుణను ప్రేమిస్తున్నందున రాజుతో తిరిగి పెళ్లి నిర్ణయించటం, పెళ్లే వద్దని ప్రతిజ్ఞలు చేసిన రాజు, అన్నగారి మాటకు ఎదురుచెప్పలేక అంగీకరించటం, తోడికోడళ్ల మధ్య చిన్నపాటి గొడవలు, వారి మనోభావాలు, సంస్కారవంతురాలైన అరుణ కూడా ఓ చిన్న మాటపట్టింపుతో మొండిగా శాంతకు వ్యతిరేకంగా ప్రవర్తించటంలాంటి సన్నివేశాలను అత్యంత సన్నితంగా హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించారు. కొద్దిపాటి చదువుతో మూర్ఖురాలైన ప్రభావతి ప్రవర్తన, శాంత బిఏ చదివినా భర్తకు తెలియకూడదన్న ఉద్దేశంతో -మరిది చదువును పరిక్షించే సమయంలో రవీంద్రుని గీతాంజలి ఇంగ్లీష్ వర్షన్ ఎంతో భావుకతతో ఉచ్ఛరించటం, దానికి గోపీ రియాక్షన్‌లాంటి సన్నివేశాలు ఎందరో విద్యాధికులకు ఓ మంచి సందేశం లాంటివి. లత అత్తింటికి వెళ్లిపోయేటప్పుడు.. గోపీ బండి వెనక ఊరి చివర రైలు వెళ్లే వరకూ పరుగెత్తి ఆమెను చూడాలనుకోవటం.. ‘పయనించే ఓ చిలుకా’ పాటను అర్ధవంతమైన చరణాలతో ‘హోరుమని విలపించేరే నీ గుణము తెలిసినవారు/ తోడుగ నీతో ఆడిపాడి వూరుములాడిన వారు (గానం: ఘంటసాల, రచన: సముద్రాల జూనియర్) చిరస్మణీయంగా తెరకెక్కించారు. వేదాంతాన్ని, జీవిత సత్యాలను తెలియచేస్తూ సాహిత్యం సాగటం, చిత్రీకరణ పరంగానూ ఓ ప్రత్యేకత చూపటం దర్శకుని ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. లత బావగారి కొడుకుగా రేలంగి, బావగారుగా చదలవాడ ఓ కీచక వధ నాటకం వేయటం, దానిలో రేలంగి సైరంధ్రీ, వలలుడు (అర్జునుడు) పాత్రను పోషించటం ఓ తమాషా. నాటకం -ఆర్యులారా (రచన: కొసరాజు, గానం: ఘంటసాల, పి సుశీల, కె జమునారాణి బృందం). కీచకునిగా చదలవాడ నటించటం మరో వెరైటీ. ఉమ్మడి కుటుంబం వ్యవస్థతోపాటు, వితంతు పునర్వివాహ సమస్యను కలిపి రూపొందించిన ఈ కథ తమిళ, హిందీ భాషల్లో ఎంత విజయం సాధించిందో తెలుగులోనూ అంతే విజయం సాధించటం ఆనందించదగ్గ విషయం.
నటీనటులంతా పాత్రోచితంగా ఎంతో నేర్పుతో పాత్రలకు ప్రాణం పోశారు. అన్న రత్నంగా గుమ్మడి ఎంతో సాత్వికత, ఓర్పు, పట్టుతో పాత్రకు న్యాయం చేకూర్చి ప్రత్యేకత చూపించటం మెచ్చదగిన అంశం. కులదైవం చిత్రగీతాలు సంగీత, సాహిత్యపరంగా నేటికీ అలరించేలా నిలవటం మరో ఆనందించదగిన అంశం.
గీతాలు: లత (గిరిజ) చలాన్ని ఆటపట్టిస్తూ పాడే గీతం నేటి విద్యార్థులకు వర్తించే గీతంగా నిలుస్తుంది. అది -కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా (గానం: కె జమునారాణి, రచన: కొసరాజు). లత, గోపీలపై చిత్రీకరించిన గాలిపటాల పాట నేటికీ ఏనాటికీ గాలిపటాలకి సంబంధించిన అరుదైన గీతంగా మిగిలడమే కాదు, ఘంటసాల గానంతో విశిష్టత సంపాదించుకుంది. అది -పదపదవే వయారి గాలిపటమా (గానం: ఘంటసాల, కె జమునారాణి, రచన: కొసరాజు). కృష్ణకుమారి, కృష్ణారావులపై చిత్రీకరించిన గీతం -గారడి చేసే నీ కనులు (రచన-: సముద్రాల జూ., గానం: పి సుశీల). వారిరువురిపై తొలిరేయి గీతం -రావేరావే వయారి ఓ చెలీ (గానం: చిత్తరంజన్, పి సుశీల, రచన: సముద్రాల జూ.) ఈ చిత్రంలో కృష్ణకుమారిపై హుషారుగా సాగే అరుదైన ఉగాది గీతం -ఆడి పాడేను నామది ఈవేళ/ అరుదెంచె ఉగాది శుభవేళ (గానం: పి సుశీల, రచన: సముద్రాల జూ). చివరగా చెప్పుకోవాల్సిన ప్రాచుర్యం పొందిన గీతం -జగ్గయ్య తన మిత్ర బృందంతో స్ర్తిల స్వభావం గురించి వర్ణించే గీతం. స్ర్తి బొమ్మను చూపిస్తూ అందరినీ అలరించేలా చిత్రీకరించారు దర్శకులు. అది -నమ్మరాదు అసలే నమ్మరాదు (రచన: కొసరాజు, గానం: చిత్తరంజన్). విసుగులేకుండా ప్రశాంతంగా కుటుంబంతో కలిసి ఆసక్తికరంగా వీక్షించదగిన చిత్రంగా ‘కులదైవం’ నిలవటం హర్షణీయం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి