ఫ్లాష్ బ్యాక్ @ 50

ఇల్లరికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాజిల్లా పునాదిపాడులో 1926 జనవరి 20న పుట్టారు అనుమోలు వెంకట సుబ్బారావు. కొంతకాలం మద్రాస్‌లో రిపబ్లిక్ గార్డెన్స్‌లో నివసించారు. అప్పట్లో తాతినేని ప్రకాశరావు, ఎన్టీ రామారావు అదే ప్రాంతంలో నివసించటంతో వాళ్లతో పరిచయం కలిగింది. తాతినేని ప్రకాశరావు ప్రోత్సాహంతో ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. యల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో శివాజీ గణేషన్, సావిత్రి, పుష్పవల్లి, ఎస్‌వి రంగారావు కాంబినేషన్‌లో ‘పెంపుడు కొడుకు’ చిత్రం నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన సినిమా సక్సెస్ కాలేదు. ఈ సినిమాకు మొదట అక్కినేనిని హీరోగా నిర్ణయించటం, కథ నచ్చక ఆయన అంగీకరించక పోవటం జరిగింది. తరువాత తమిళంలో విజయవంతమైన ‘ఉత్తమ పుత్రన్’ చిత్రాన్ని తెలుగులో ‘వీరప్రతాప్’గా డబ్బింగ్ చేశారు. ఆ సినిమా విజయం సాధించింది.
మూడో ప్రయత్నంగా యల్‌వి ప్రసాద్ శిష్యుడైన తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో 1959లో ‘ఇల్లరికం’ సినిమా రూపొందించారు. అక్కినేని, జమున ప్రధాన పాత్రలు పోషించారు. 1959 మే 1న విడుదలైన ఈ చిత్రానికి 60 వసంతాలు.
కథ: సదాశివబ్రహ్మం, మాటలు: ఆరుద్ర, పాటలు: కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ, ఫొటోగ్రఫీ: ఎ వినె్సంటు, సంగీతం: టి చలపతిరావు, కళ: కృష్ణారావు, ఎడిటింగ్: ఎ సంజీవి, నృత్యం: హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, అసోసియేట్ దర్శకులు: కె ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణ, సహాయ దర్శకులు: తాతినేని రామారావు, దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు, నిర్మాత: ఏవీ సుబ్బారావు.
జమీందారు (గుమ్మడి) సుందరమ్మ (హేమలత)ల ఏకైక కుమార్తె రాధ (జమున). వడ్డీ వ్యాపారి ధర్మయ్య మేనల్లుడు వేణు (ఏఎన్నార్). కాలేజీ వార్షికోత్సవంలో ఇద్దరూ పోటీ పడతారు. తరువాత ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. సుందరమ్మ పెద్ద తల్లి కొడుకు గోవిందయ్య (సీఎస్సార్) దురాశపరుడు. ఆస్తిపాస్తుల పట్ల మక్కువగల సుందరమ్మ ఆస్తిపరుడైన అల్లుడు కావాలని కోరుకుంటుంది. కాని జమీందారు మాత్రం కూతురు రాధ ఇష్టప్రకారం పేదవాడైనా సంస్కారవంతుడైన వేణుతో పెళ్లి జరిపిస్తాడు. అతన్ని ఇల్లరికం తెచ్చుకొని ఆఫీసు బాధ్యతలు అప్పగిస్తాడు జమీందారు. గోవిందయ్య కొడుకు శేషగిరి (ఆర్ నాగేశ్వర రావు) వ్యసనపరుడు, మోసకారి. పట్నంలో వేణు చెల్లెలు దుర్గ (గిరిజ)ను గుడిలో పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తుంటాడు. శేషగిరిని అక్కడనుంచి తీసుకొచ్చి రాధకు భర్తగా చేయాలనే ఆశ ఫలించలేదన్న కోపంతో ఉంటాడు గోవిందయ్య. అల్లుడు పేదవాడని సుందరమ్మకు బాధ. దీంతో రాధ, వేణుల మధ్య కలతలు రేపాలని ప్రయత్నిస్తుంటారు. రాధ, వేణులు అనురాగంతో కాపురం చేస్తుండగా, భర్త వదిలేయటంతో నాట్య ప్రదర్శనలు ఇస్తున్న దుర్గను వేణు కలుస్తాడు. తనెవరో భార్యకు తెలియనీయవద్దన్న చెల్లెలి కోరుతుంది. అదే సమయంలో జమీందారు -తన సోదరి (టిజి కమలదేవి)కి డబ్బు సాయం చేయమని వేణుతో 10 వేల రూపాయలు పంపుతాడు. అయితే ఈ విషయం రాధకు తెలియనీయకూడదని అంటాడు. తరువాత విషయం తెలుసుకున్న రాధ కోపంతో, ఆస్తి తనపేర వ్రాయించిన భర్తను అవమానిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగి వారి కాపురంలో అశాంతి మొదలవుతుంది. జమీందారు మరణించటం, వేణు సహనంతో భార్యలో మార్పుకోసం ప్రయత్నిస్తాడు. చివరకు రాధకు నిజాలు తెలుస్తాయి. అదే సమయంలో శేషగిరి ఆమెను బంధించటంతో, వేణు మారువేషంలో వెళ్లి రక్షిస్తాడు. చివరకు వేణు చెల్లెలు దుర్గ అని గోవిందయ్యతో సహా అంతా తెలుసుకుని క్షమాపణ కోరడంతో సినిమా శుభంగా ముగుస్తుంది. సినిమాలో రమణారెడ్డి, ఇల్లరికపు అల్లుడు బ్రహ్మానందంగా రేలంగి, మరో ఇల్లరికపు అల్లుడుగా పేకేటి, అతని భార్యగా బాల, బొడ్డపాటి, రామకోటి, గుమాస్తా పానకాలుగా అల్లు రామలింగయ్య ఇతరులు నటించారు.
రొమాంటిక్, కామెడీ, సెంటిమెంట్, అలరించే సంగీతం, నటీనటుల అభినయ కౌశలంతో రూపుదిద్దుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ఇల్లరికం. దర్శకులు తాతినేని ప్రకాశరావు తొలుత సినిమా ప్రారంభంలోనే కాలేజీ వార్షికోత్సవం, విచిత్ర వేషధారణ, పోటీ నృత్య గీతం -అడిగిందానికి చెప్పి (రచన: కొసరాజు, గానం: ఘంటసాల, పి సుశీల బృందం)తో ఒకరకమైన హుషారు కలిగించారు. వేణును రాధ వెతుకుతుంటే.. -ఎక్కడి దొంగలు అక్కడనే (రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, హిందీ ట్యూన్ టైటిల్ సాంగ్ తుహసానహి దేఖా) అంటూ వేణు పాడిన పాటను తమాషాగా చిత్రీకరించారు. రాధను ప్రేమించటం చేత ఇల్లరికానికి అంగీకరించినా, వేణు పాత్ర వ్యక్తిత్వంతో రూపొందించటం, నౌకరు మామగారిపట్ల అనుచిత ప్రవర్తనకు వేణు అతన్ని దండించటం, ఎవరు ఎంతగా అలుసుచేసినా భర్తగా రాధ అతన్ని ఎంతో అభిమానంగా ‘అన్నిటికన్నా విలువైనది’ మీరూ అంటూ నగపోయినా విచారించకపోవటం, ఆఫీసు పనిలోపడి భర్త తనను పట్టించుకోనందుకు ‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా’ (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల, సుశీల) పాటతో తమాషాగా ఉడికించటాన్ని దర్శకులు చాలా రొమాంటిక్‌గా చిత్రీకరించారు. ‘నిలువవే వాలుకనుల దానా’ పాటపై ఏఎన్‌ఆర్ మొదట సందేహం వెలిబుచ్చారు. హీరోమీద ఈ పాట చిత్రీకరిస్తే అంత బాగుండదని, హీరో ఔన్నత్యానికి భంగం కలగవచ్చన్నది అక్కినేని సందేహం. కాని దర్శకులు, సంగీత దర్శకులు అంతా నచ్చచెప్పటంతో అంగీకరించారు. ఈ పాట ప్రీవ్యూలో చూసిన అక్కినేని అన్నపూర్ణ ఎంతో మెచ్చుకోవటం, ఇది సక్సెస్ అవుతుందని చెప్పటం, చిత్ర విజయంలో ఈ పాటకూ ప్రాధాన్యత లభించటం ప్రత్యేక విశేషం. చిత్రం టైటిల్‌కు తగ్గట్టు ‘ఇల్లరికంలో ఉన్న మజా’, దాని విశేషాలను వివరంగా కొసరాజు కలం ఝుళిపించింది. మాధవపెద్ది గానంతో ఆకట్టుకునేలా రూపొందించారు. వేణు, రాధలు వెళ్లిన నాట్య ప్రదర్శనలో గిరిజ బృందం అభినయించే నృత్యగీతాన్ని ఆరుద్ర రచించగా, జిక్కి గానం చేశారు. ఆ గీతం -మధు పాత్ర నింపకోరుూ సుఖయాత్ర’. ఈ పాటకు సి రామచంద్రన్ హిందీ చిత్రం ‘తీన్ అందాజ్’లో లతామంగేష్కర్ ఆలపించిన ‘యాహసీన్ షామ్యా’ పాట ఆధారమని కొందరి అభిప్రాయం.
ఈ చిత్రంలో నాయికా నాయకులుగా జమున, అక్కినేని ఎంతో సహజంగా నటించారు. రాధగా జమున -ప్రేమానురాగం అభిమానాలతోపాటు, వ్యక్తిత్వం, కొంత మొండితనం, పట్టుదలవంటి లక్షణాలను అద్భుతంగా ప్రదర్శించారు. దానికి ధీటుగా భార్యపట్ల ప్రేమాభిమానంతోపాటు, సహనం, బంధువులు, సోదరి, మామగారిపట్ల బాధ్యత, గౌరవం, తెలివిగా దుష్టుల ఆట కట్టించటంలో సామర్థ్యం, చురుకు, నిండుతనంతో కూడిన నటనతో అక్కినేని తన పాత్రకు పరిపూర్ణత కలిగించారు. మిగిలిన వారంతా పాత్రోచితంగా, సన్నివేశపరంగా అభినయంతో ఆకట్టుకున్నారు.
సందర్భోచితమైన మాటలు, కొన్ని పాటలలో ఆరుద్ర తన కలం బలంతో చిత్ర విజయానికి తోడ్పాటునందించటం గమనార్హం. దర్శకులు తాతినేని ప్రకాశరావు మహాబలిపురం బ్యాక్‌గ్రౌండ్‌లో క్లైమాక్స్ సన్నివేశం, మధ్యలో ‘నిలువవే వాలు కనులదాన’ పాటలో ఓ బిట్, అలాగే హీరో హీరోయిన్, రేలంగి, స్నేహితుల బృందంతో పిక్నిక్‌లో ‘చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు’ (రచన: ఆరుద్ర, గానం: పి.సుశీల, ఘంటసాల, మాధవపెద్ది బృందం) పాట మహాబలిపురం వద్దే చిత్రీకరించటం, పాటకు ఓ చక్కని ప్రదేశం, చిత్రీకరణతో ఆకట్టుకోవటం విశేషం. ఈ చిత్రంలోని 7పాటల్లో 3 ఆరుద్ర, 3 కొసరాజు, ఒకటి శ్రీశ్రీ రాశారు. చక్కని సంగీతంతో చలపతిరావు కూర్చిన బాణీలు, చిత్ర విజయంలో భాగంగా నిలిచాయి.
ఇల్లరికం చిత్రం 18 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. హైద్రాబాద్‌లో 50 రోజులు ప్రదర్శింపబడిన కొన్ని చిత్రాల్లో ఆ రోజుల్లో ‘ఇల్లరికం’ కూడా ఉంది. అంతేకాక ఇది ‘సిల్వర్ జూబ్లీ’ చిత్రంగా విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ‘సిల్వర్ జూబ్లీ’ వేడుకల్లో చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ అంతటా పాల్గొనటం, ప్రజలు ఆనందించటం, నటీనటులకు సన్మానాలు జరగటం, ఇల్లరికానికి లభించిన గౌరవంగా పేర్కొనాలి.
ఈ చిత్రాన్ని దర్శకులు ఎల్‌వి ప్రసాద్ ‘ససురాల్’ టైటిల్‌తో హిందీలో (1961) రాజేంద్రప్రసాద్, బి సరోజాదేవి కాంబినేషన్‌లో నిర్మించారు. మలయాళంలో ‘కలితో జాహన్’ (1966) -ప్రేమనజీర్, హీరాలాల్, తమిళంలో ‘మాడివీట్టు మాపిళ్లై’, కన్నడంలో ‘మనీ అళియ’ (1964) -జయలలిత, కల్యాణ్‌కుమార్‌లతో ఈ సినిమా వచ్చింది. హిందీ తప్ప మిగిలిన భాషల్లో ఎవి సుబ్బారావు ఈ చిత్రాలను రూపొందించటం గమనార్హం. తమిళం, కన్నడంలో జయలలితే హీరోయిన్ కావటం, అన్ని భాషల్లో సినిమా విజయం సాధించటం గొప్ప విషయం.
ఇల్లరికం కన్నడ చిత్రం ‘మనీ అళియ’కు రాష్టప్రతి యోగ్యతాపత్రం లభించింది. ప్రసాద్ ఆర్ట్‌వారు ఆ తరువాత 1965లో ‘మనుషులు- మమతలు’ చిత్రం ద్వారా ‘జయలలిత’ను కథానాయికగా తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. అన్ని భాషల్లో విజయవంతమైన ‘ఇల్లరికం’ చిత్రానికి తీపిగుర్తుగా, ఆ చిత్ర కథానాయకి ‘జమున’ మన భాగ్యనగరంలో నివసిస్తుండటం, పలు సభా కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటూ కొన్ని తీపి జ్ఞాపకాలు మనకందిస్తుండటం ప్రత్యేక విశేషం. ఇక చిత్రంలోని -నిలువవే వాలుకనుల దానా’ అన్న హుషారైన టీజింగ్ సాంగ్ నాటినుంచి నేటివరకు మాత్రమే కాదు, మరింకెనే్నళ్లైనా అదే హుషారును శ్రోతలకందిస్తూ సాగుతుందని భావించొచ్చు. అలాకూడా ‘ఇల్లరికం’ సినిమా మనోనేత్రం ముందు సాక్షాత్కరించి మనోల్లాసాన్ని కలిగిస్తుంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి