ఫ్లాష్ బ్యాక్ @ 50

జరిగిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయిలాడ్ ప్రభాకర్ కాకినాడలో 1936 జూలై 19న జన్మించారు. తల్లిదండ్రులు అప్పారావు, నాగరత్నమ్మ. వీరు కొంతకాలం కళాదర్శకుడు గోఖలేవద్ద సహాయకునిగా పనిచేశారు. తరువాత నిర్మాతగా మారి 1969లో రామ విజేత సంస్థను స్థాపించి.. జగ్గయ్య, కృష్ణ, కాంచనలతో ‘జరిగిన కథ’ చిత్రాన్ని నిర్మించారు. తరువాత తల్లితండ్రులు (1970), రామాలయం (1971), రామరాజ్యం (1972), తులసి (1973), లంబాడోళ్ల రాందాసు చిత్రాల్ని రూపొందించారు.
వీరి సోదరుడు కె బాబూరావు. ఈయన కెవి రెడ్డివద్ద దర్శకత్వపు శాఖలో సహాయకునిగా పనిచేశారు. ప్రభాకర్ నిర్మించిన చిత్రాలన్నింటికీ ఈయనే దర్శకత్వం వహించారు. దర్శకునిగా ఈయన తొలి చిత్రం -జరిగిన కథ.

కథ, స్క్రీన్‌ప్లే: కె బాబూరావు
మాటలు: పినిశెట్టి
సంగీతం: ఘంటసాల
నృత్యం: పసుమర్తి, శేషు, రాజు
కళ: ప్రభాకర్
కెమెరా: మాధవ్ బుల్‌బులే
స్టంట్స్: మాధవన్
కూర్పు: కల్యాణ సుందరం
దర్శకత్వం: కె బాబూరావు
నిర్మాత: కె ప్రభాకర్.
1969 జూలై 4న సినిమా విడుదలైంది.
**
తన భార్య సంధ్యారాణి, తన బావతో చనువుగా మాట్లాడటం విని అపార్థం చేసుకొని అంతం చేయాలనుకున్న ఓ భర్త ప్రభాకర్‌రెడ్డికి, నాగయ్య (జగన్నాథం) చెప్పిన ఓ జరిగిన కథతో సినిమా మొదలవుతుంది. ప్రసాద్ (జగ్గయ్య), రఘు (కృష్ణ) జమీందారీకి చెందిన అన్నదమ్ములు. వీరి తల్లి ఉమాదేవి (జూ శ్రీరంజని). ప్రసాద్ శాంతం, సహనం, మంచితనంవంటి లక్షణాలు కలవాడు. రఘు తొందరపాటు, పట్టుదల, ఆవేశంకల వ్యక్తి. పట్నంలోవుండే భూపతి (రాజనాల) మంజుల (విజయ) నృత్యగానాలతో కాలం గడుపుతుంటాడు. చిన్న కొడుకు మీద బెంగతో అతడిని జాగ్రత్తగా చూసుకోమని ప్రసాద్‌కు చెప్పి ఉమాదేవి మరణిస్తుంది.
ఇంటికి వచ్చిన రఘు అన్నకోరికమీద, ఆ ఊళ్లోనే ఉండి తల్లి పేరునవున్న ఉమా కళానిలయంలో మంజుల బృందంతో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తుంటాడు. గొప్ప కుటుంబంలో పుట్టి తమ్ముడు బాబు తప్ప మరెవరూ లేని అనాధ శాంత (కాంచన). ప్రసాద్ వాళ్లింట ఆశ్రయం పొంది కళానిలయంలో నృత్య ప్రదర్శనలు ఇస్తుంది. ప్రసాద్ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కాని శాంత, రఘు ప్రేమించుకుంటున్నారని తెలిసి వారికి వివాహం జరిపిస్తాడు. వారిరువురూ అన్యోన్యంగా జీవిస్తుంటారు. వారికొక పాప జన్మిస్తుంది. ఎలాగైనా రఘును పొందాలనుకున్న మంజుల కుట్రల కారణంగా చెప్పుడు మాటలు నమ్మి, పాపతో ఇంటినుంచి వెళ్లిపోతాడు రఘు.
భూపతి, మంజుల స్నేహంతో కూతురితో జీవిస్తుంటాడు. రఘు జాడ తెలియక సతమతమవుతూ యాక్సిడెంటులో కాలుపోగొట్టుకుంటాడు ప్రసాద్. భర్త, కూతురి జాడ తెలీక బెంగతో కాలం గడుపుతుంటుంది శాంత. కూతురు ఉమ (బేబీ రోజారమణి) పాడిన ఓ పాట ద్వారా శాంత, రఘును కలుసుకోవటం, తిరస్కారానికి గురై వెనక్కి రావటం జరుగుతుంది. ఈలోపు రఘును అంతం చేయాలనుకున్న భూపతి చేతిలో మంజుల మరణిస్తూ, శాంత, ప్రసాద్ నిర్దోషులు, మంచివారని రఘుకు నిజం చెబుతుంది. పశ్తాత్తాపంతో రఘు ఇంటికి తిరిగి రావటం, మనోవ్యధతో చివరి దశలోవున్న ప్రసాద్‌ను క్షమించమని కోరటం, శాంత, రఘుల చేతులు కలిపి ప్రసాద్ మరణిస్తాడు. ఈ కథ చెప్పిన జగన్నాథం (నాగయ్య)కి సంధ్యారాణి, ప్రభాకర్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలియచేయటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో మంజుల తండ్రిగా అల్లు రామలింగయ్య కనిపిస్తాడు. బాలకృష్ణ, రాజ్‌బాబు, సీతారాం, సూర్యాకాంతం, ఛాయాదేవి, కెవి చలం తదితరులు నటించారు.
దర్శకులు బాబూరావు చిత్రంలోని సన్నివేశాలను నిజ జీవితాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. తల్లి ఉమాదేవి చిన్న కొడుకు రఘు లక్షణాలను ప్రసాద్‌కు వివరించి, అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పే సన్నివేశంలో ఎంతో ఆర్ద్రత కనిపిస్తుంది. సాధారణంగా చాలా కుటుంబాల్లో సంభవించే పరిస్థితులను, భావాలను ఈ సన్నివేశంలో చూపించాడు దర్శకుడు. ఉత్తముడైన ప్రసాద్ దాన్ని చిత్రం చివరివరకూ పాటించటం మంచి అనుభూతినిస్తుంది. అనాథ అంటూ వచ్చిన శాంత పాడే పాట -ఏనాటికైనా ఈ మూగ వీణ (గానం: పి సుశీల, రచన: దాశరథి)లో మేడ మెట్లమీంచి ప్రసాద్, హాలులో రఘు స్పందనలు చక్కగా చూపించారు. ఆమెపట్ల అన్నదమ్ముల అనురాగం ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రసాద్ ఎంతో భావయుక్తంగా తన ప్రేమను మనసులో దాచుకొని, ఆమెకు తల్లిఇచ్చిన రవ్వల హారం ఇస్తూ తన ఆనందాన్ని తెలియజేసే పాట ‘్భలే మంచిరోజు’. గీతాన్ని పియానాపై ఆలపిస్తాడు. దానికి మేడమీద శాంత, రఘుల ప్రణయం, వారి ప్రేమ తెలిసిన ప్రసాద్ వ్యక్తిత్వం వెల్లడిచేసే సన్నివేశం నాగయ్యతో, తరువాత తమ్మునితో, వారి పాప ‘ఉమ’ను తల్లిగా భావించి లాలించటం, అన్నగారిని విమర్శించ లేక రఘు దూరంగావెళ్లి పాపతో జీవిస్తుండటం, శాంత పాటను పాపకు నేర్పాడని రేడియో పాట ద్వారా తెలియచేయటం, నిజంగా రఘును ప్రేమించటం వల్లనే వారి జీవితంలో కల్లోలం కలిగించానని మరణిస్తూ మంజుల నిజం వెల్లడించటం, బావగారి మాట మన్నించి శాంత (్భర్త, కూతురు కోసం విచారిస్తూ కూడా) ఇల్లు వదిలిపెట్టి వెళ్లక పోవటం, ఉదాత్త స్వభావంగల ప్రసాద్ ఎంతో మానసిక క్షోభను అనుభవించటం.. ఇలా కొన్ని సన్నివేశాలను ఆర్ద్రత, కరుణ, సంస్కారంవంటి లక్షణాలతో తీర్చిదిద్ది పరిపూర్ణత కలిగించారు. దానికి నటీనటులు చక్కని నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శాంతగా కాంచన, ప్రసాద్‌గా జగ్గయ్య.. పాత్రల ఔన్నత్యాన్ని తమ నటనలో ఆవిష్కరింపచేశారు. అలాగే బేబీ రోజారమణి ‘తల్లికోసం తండ్రితో దెబ్బలు తిని జ్వరంపడి.. తండ్రి దగ్గరకు రాగా అమ్మ గురించి అడగను.. నన్ను కొట్టద్దు నాన్నా’ అంటూ పరిపక్వతతో కూడిన నటన చూపటం విశేషం. హీరో రఘుగా కృష్ణ సన్నివేశానుగుణమైన భావాలను, దానికి తగిన అభినివేశంతో మెప్పించారు.
చిత్ర గీతాలు:
కృష్ణ, విజయలలితలపై క్లబ్బులో చిత్రీకరించిన గీతం -లవ్ లవ్ లవ్ మి నెరజాణా’ (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల, ఎల్‌ఆర్ ఈశ్వరి). విజయలలితపై మరో నృత్య గీతం -ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనా గాని (రచన: కొసరాజు, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). చిత్రం చివరలో విజయలలిత, కృష్ణలపై మరోగీతం -ఇదిగో మధువు ఇదిగో సొగసు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: దాశరథి). ఈ చిత్రంలో సి నారాయణరెడ్డి వ్రాసిన నాలుగు గీతాలు.. శాంత సాంప్రదాయ నృత్యం చేస్తూ పాడే గీతం -చినవాడా మనసాయెరా (గానం: ఎస్ జానకి). మరో విరహ నృత్యగీతం -నినే్న నినే్న కోరుకున్న చిన్నదిరా (గానం: ఎస్ జానకి). కృష్ణ, కాంచనలపై చిత్రీకరించిన యుగళ గీతం -తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే (గానం: పి సుశీల, ఘంటసాల). జగ్గయ్య పియోనా వాయిస్తూ ఆలపించే హాయైన గీతం -్భలే మంచిరోజు పసందైనరోజు. ఈ పాటకు స్పందనను -కాంచన, కృష్ణల వలపు తలపులలో సాగటంలో చిత్రీకరించటం దర్శకుడి ప్రతిభకు అద్దంపడుతుంది. ఈ చిత్రంలోని మరో దాశరథి గీతం (ఒకసారి శాంత-తమ్ముడు బాబు, మరోసారి ప్రసాద్- రఘులపై) రెండుసార్లు వస్తుంది. ఆ తరువాత రేడియోస్టేషన్‌లో రోజారమణిపై చిత్రీకరణ -ఏనాటికైనా ఈ మూగవీణ రాగాలు పలికి రాణించునా.
‘జరిగిన కథ’ చిత్రం చక్కని గీతాలపరంగా, అన్నదమ్ముల అనుబంధానికి, సున్నితమైన బంధాలు ఎలా నిలబెట్టుకోవాలో తెలిపే సందేశాత్మకం చిత్రంగా విజయం సాధించింది. ఏ సన్నివేశానికైనా ఏ శుభ సందర్భానికి నానాటినుంచి మరెన్ని నాళ్లకైనా భలే మంచిరోజు గీతం ఓ చక్కని గుర్తింపు సాధించటం ఆనందదాయకం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి