ఫ్లాష్ బ్యాక్ @ 50

మనుషులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ నాటక రచయిత తోఫల్‌బాసి వ్రాసిన ‘తులాభారం’ నాటకాన్ని కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ ప్రదర్శించింది. ఆ నాటకం ఆధారంగా అదే పేరిట ప్రముఖ మళయాళ దర్శకుడు ఎ వినె్సంట్ ‘తులాభారం’ చిత్రం నిర్మించారు. హరిపోతన్, సుప్రియ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం దేవరాజన్. చిత్రంలో ప్రేమ్‌నజీర్, తెలుగు నటి శారద జంటగా నటించగా.. మధు, షీలా, కాంచన, తిక్కరసు సుకుమారన్ నాయర్, ఆదూరిబాసి ఇతర పాత్రలు పోషించారు. 1968 ఆగస్టు 30న విడుదలైన సినిమా విజయం సాధించింది.
ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ద సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు చిత్రానికి లభిస్తే, నటి శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ సినిమా ఆధారంగా దర్శకుడు వినె్సంట్ తమిళంలోనూ ‘తులాభారం’ పేరిట ఎవిఎం రాజన్, శారద, కాంచన, ముత్తురామన్, నాగేష్, సౌందర్‌రాజన్‌లతో సినిమా నిర్మించారు. ఆ తరువాత తెలుగులో, హిందీలో వి మధుసూధనరావు దర్శకత్వంలో ‘మనుషులు మారాలి’, ‘సమాజ్ కో బదల్ డాలో’ నిర్మించారు. 1985 డిసెంబర్ 20న విడుదలైన సమాజ్ కో బదల్ డాలో సినిమాలో అజయ్ సహాని, శారద, ప్రాణ్, ప్రేమ్‌చోప్రా, కాంచన, ముక్రి, అరుణాఇరాని నటించారు. ఈ సినిమా జెమినీ సంస్థ నిర్మించింది. తెలుగు చిత్రం ‘మనుషులు మారాలి’ 1969 అక్టోబర్ 2 గాంధీ జయంతిన విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గాంధీజీ శత వార్షికోత్సవం సందర్భంగా మహాత్మునికి ఈ సినిమాను అంకితమిచ్చారు.
చిత్రానికి మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ, ఛాయాగ్రహణం: పి ఎల్లప్ప, ఎడిటింగ్: ఎం ఉమానాథ్, నృత్యం: పిఎస్ గోపాలకృష్ణ, కళ: ఎంఎస్ జానకీరాయ్, సంగీతం: కెవి మహదేవన్, సహాయ దర్శకులు: కె రాఘవేంద్రరావు, కె కోదండరామిరెడ్డి, దర్శకత్వం: వి మధుసూధనరావు.
కోర్టు సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ముద్దాయి విజయ (శారద) తన ముగ్గురు పిల్లల్ని హత్యచేసిన కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ విమల (కాంచన) కోర్టుకు వివరిస్తూ -శిక్ష విధించమని జడ్జిని కోరుతుంది. ముద్దాయిని వివరణ కోరిన జడ్జికి విజయ తన కథను వివరించటంతో -సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. లక్ష్మీ సత్యనారాయణ షుగర్ ఫ్యాక్టరీ యజమానులు లక్ష్మీపతి (నాగభూషణం), సత్యనారాయణ (గుమ్మడి). సత్యం కుమార్తె విజయ, లాయర్ కూతురు విమల (కాంచన) స్నేహితులు. ఆ కాలేజీలో చదువుతున్న గిరి (హరనాథ్).. అందం, ఐశ్వర్యం కలిగిన విజయను ప్రేమిస్తుంటాడు. ఫ్యాక్టరీ కూలి నాయకుడు సూర్యం (శోభన్‌బాబు) కూలీలకు బోనస్ అడిగిన విషయంలో -లక్ష్మీపతి, సత్యం మధ్య వివాదం చెలరేగుతుంది. లక్ష్మీపతి చేసిన మోసం కారణంగా సత్యం తన ఆస్తి, ప్రాణాలను పోగొట్టుకుంటాడు. ఏ ఆశ్రయంలేని విజయ గిరి తిరస్కారంతో సూర్యంని పెళ్లి చేసుకుంటుంది. స్వార్థపరుడైన లక్ష్మీపతి, మిల్లు కార్మికులకు చేస్తోన్న అన్యాయాన్ని ఎదిరించిన సూర్యాన్ని రౌడీలతో అంతం చేయిస్తాడు. ముగ్గురు పిల్లలు, అత్తగారితో ఇబ్బందులు పడిన విజయ.. తన పిల్లలు దొంగలుగా, బిచ్చగాళ్లుగా మారకూడదనే ఆలోచనతో వారికి విషమిచ్చి తానూ పుచ్చుకుంటుంది. పిల్లలు మరణించటంతో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించగా.. కారణాలు తెలుసుకున్న విమల తిరిగి కేసును వాదించబోతుంది. అయితే విమలను వద్దని వారించి, ఆత్మక్షోభతో ఆమె చేతిల్లోనే విజయ మరణించటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో లక్ష్మీపతి భార్యగా ఝాన్సీ, అతని కుమార్తెగా మంజుల, లాయర్ గుమాస్తాగా కెవి చలం, యూనియన్ లాయర్‌గా రావుగోపాలరావు, సూర్యం చెల్లెలుగా నవీనలక్ష్మి, బావగా మల్లాది కృష్ణమూర్తి.. ఇంకా పెరుమాళ్లు, చలం, అతని జంటగా సుబ్బు, ఇతరులు నటించారు.
విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు వీరమాచినేని మధుసూధనరావు మళయాళం, తమిళంలో విజయం సాధించిన సినిమాను తెలుగులో తన పంథాలో నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దారు. అందుకు కథా రచనలో గుంటూరు జిల్లా కారంచేడుకు చెందిన బొల్లిముంత శివరామకృష్ణయ్య సహకరించారు. బొల్లిముంత ఎక్కువగా వి మధుసూధనరావు చిత్రాలకు (మనుషులు మారాలి, ప్రజానాయకుడు, కల్యాణ మంటపం) మాటలు వ్రాయటం విశేషం. ఇతర చిత్రాలైన శారద, కాలంమారింది, శ్రీదేవివంటి చిత్రాలు ఎనె్నన్నో తీర్చిదిద్దారు.
ఒక పద్ధతి, విలువలకు సత్యం ప్రాధాన్యత ఇస్తుండటం, అబద్ధాలు చెప్పటం రాదని లక్ష్మీపతితో విడిపోవడానికి సిద్ధపడటం, లాయర్‌ను నమ్మి ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి, డైరీలు అప్పగించటం.. మోసానికి గురై చివరకు కేసు ఓడిపోయి, పైకోర్టుకు దాఖలు చేయటానికి ఏ ఆధారాలు లేవని యూనియన్ లాయర్ చెప్పగా.. చేతికర్ర విరిగి సత్యం మరణించినట్టు చూపించటం.. పెద్ద కథను క్లుప్త సన్నివేశాల్లో చూపించటం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. సత్యం చితిమంటలు రగులుతుండగా ‘చీకటిలో కారు చీకటిలో’ పాటను శారద, శోభన్‌బాబులపై చూపిస్తూ.. చరణాలకు తగ్గట్టు జాలరి వలలో పడిన చేప, గానుగ మరలో నలిగే చెఱకును చూపించే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. చీకటిలో కారు చీకటిలో పాట రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల.. నేటికీ ఏనాటికీ చిరస్మరణీయ గీతమై నిలుస్తుంది). సాధారణ లాయర్‌ను లీగల్ అడ్వయిజర్ చేసి లక్ష్మీపతి కోర్టులో గెలవటం, చివరలో కార్మికుల పోరాటంపై స్టే ఆర్డర్ తెప్పించటం, లక్ష్మీపతి కారణంగానే విజయకు విమల వద్ద ఆశ్రయం లభించకపోవటం, చిత్ర ప్రారంభంలోనే సమయానుకూలంగా వ్యవహరించే గిరి స్వభావాన్ని చూపించటం, సూర్యంను డబ్బుతో లొంగదీయలేక అతన్ని అంతం చేయించే సన్నివేశం కథపై దర్శకుడి పట్టుకు నిదర్శనంగా నిలుస్తాయి. సూర్యంతో జీవితం పంచుకున్న విజయ ‘కష్టాల సమయంలో తానూ ఏదైనా పనిచేస్తానంటే’.. ‘నీ చదువుతగిన ఉద్యోగం రాదు, కూలి పనికి నిన్ను పంపలేను’ అని భర్త తిరస్కరించే సన్నివేశాలు ప్రేక్షకుడిలో ఆర్తిని పెంచేవిగా అనిపిస్తాయి. స్ట్రైక్ సమయంలో పిల్లల కోసం సాయం చేయబోయిన విమల డబ్బును విజయ తిరస్కరించే సన్నివేశంలో ఆత్మాభిమానం, ఆత్మ గౌరవంగల వ్యక్తుల స్వభావాన్ని దర్శకుడు ఎంతో విపులంగా చిత్రీకరించాడు. విజయ ముద్దాయి అంటూ ప్రభుత్వపు ప్లీడర్‌గా వాదించిన విమల, విజయ కథను విని ‘మిత్రద్రోహి లక్ష్మీపతి.. ఆత్మద్రోహి నా తండ్రి.. నిందలువేసి, ఆడబిడ్డ పనిచేసుకు బ్రతకటానికే అవకాశమివ్వని ఈ సమాజం.. అంతా ఈమె చేసిన హత్యకు కారణమంటూ తిరిగి కేసు వాదిస్తాననడంలాంటి సన్నివేశాలు భావావేశాలకు అద్దం పడతాయి. చట్టాలను మార్చాలని కోరిన విజయకు సాధ్యంకాదని జడ్జి చెప్పటం, కోర్టులో తన శిక్ష తప్పించవద్దని విమలను విజయ కోరటం, తన పిల్లలకు విషమిచ్చినపుడు వారుపడిన మరణవేదన చూసిన తనకు బ్రతకాలని లేదని, తన భర్తను కలుసుకోవాలనే వేదనను వ్యక్తం చేయటం.. చిత్రంలో క్లైమాక్స్ ఆర్ద్రతతో సాగుతుంది. ఖాళీ పేపర్లపై సంతకాలు చేయటం, ఇతరులను గుడ్డిగా నమ్మటంలాంటి విషయాల్లో జాగ్రత్తను సూచిస్తూ ఈ సినిమా ఎన్నో జీవితాలకు మార్గదర్శిగా నిలిచింది. చలం, సుబ్బులపై కొన్ని హాస్య సన్నివేశాలు రూపొందించినా, అవి ఈ చిత్రం స్థాయిని ఏమాత్రం తగ్గించక.. విలువైన చిత్రం చూసిన అనుభూతి ప్రేక్షకులకు అందించటం ప్రశంసనీయం.
చిత్రంలో అందరూ తమ తమ పాత్రల పరిధిమేరకు చక్కని నటన చూపించారు. ముఖ్యంగా సూర్యంగా శోభన్‌బాబు ఎంతో పరిణితి, తక్కువ మాటలు, ఎక్కువ భావాలు నటనలో చూపించి ఆకట్టుకున్నారు. విమలగా కాంచన, అందరినీ మించి చిత్ర కథానాయిక శారద తన నటనలో అద్భుతానే్న చూపించారు. మళయాళంలో జాతీయస్థాయి అవార్డు అందుకుని, ఆ తరువాతా మరో రెండుసార్లు ఊర్వశి బిరుదు పొందటం, నాలుగు భాషల్లో నూతన పాత్ర తానే పోషించి మెప్పించటం విశేషం.
చిత్రంలోని ఇతర గీతాలు:
కాంచన, శారదలపై కాలేజీలో చిత్రించిన నృత్య గీతం -్భమాత ఈనాడు పులకించెను (రచన: ఆరుద్ర, గానం: పి సుశీల, పి లీల) హరనాథ్, కాంచన, శారద, కాలేజీ బృందంపై పిక్నిక్ గీతం -హాలిడే హాలీడే (గానం: బాలు, వసంత బృందం, రచన: సినారె). మరో గీతం తూరుపు సింధూరపు (రచన: శ్రీశ్రీ, గానం: బాలు, సుశీల). శోభన్‌బాబు, శారదలపై చిత్రీకరించిన మరోగీతం -పాపాయి నవ్వాలి పండుగే రావాలి (గానం: పి సుశీల, బాలు, రచన: దాశరధి). శ్రీశ్రీ రచించిన గీతం -అరుణ పతాకం ఎగిరింది.. శోభన్‌బాబు, చలం, కార్మికులపై చిత్రీకరణగాను పిఠాపురం, మాధవపెద్ది బృందం గానం చేశారు. చిత్రం చివరగల -అమ్మా అమ్మా కన్ను మూసావా (గానం: ఘంటసాల, రచన: శ్రీశ్రీ) చిత్ర ప్రారంభంలో ఘంటసాల గానం, శ్రీశ్రీ రచనలో గాంధీజీకి చిత్రం అంకిత పద్యం -సత్యమే దైవమని అహింసయే పరమధర్మమని. టైటిల్‌సాంగ్ -మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి (రచన: శ్రీశ్రీ). చిత్రంలో రెండుసార్లు వచ్చిన గీతాన్ని మొదట బాలు, సుశీల.. తరువాత టిఎం సౌందర్‌రాజన్ గానం చేశారు.
మనుషులు మారాలి చిత్రం విజయం సాధించింది. దీని తరువాత నుంచి తెలుగు చిత్రసీమలో శారద పలు వైవిధ్యభరితమైన చిత్రాలలో కథానాయికగా, క్యారెక్టరు నటిగా ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఒక తెలుగు నటీమణి జాతీయ స్థాయిలో పలు భాషల్లో పేరు గడించటం తెలుగు సినీ చరిత్రలో ఒక విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి