ఫ్లాష్ బ్యాక్ @ 50

అక్కాచెల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అన్నపూర్ణ’ చిత్రంతో ప్రముఖ నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్‌ని ప్రారంభించిన విబి రాజేంద్రప్రసాద్.. ఆ పరంపరలో ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు లాంటి చిత్రాలు రూపొందించారు. ఆ క్రమంలో 1970లో జగపతి పిక్చర్స్ నుంచి వచ్చిన చిత్రం -అక్కాచెల్లెలు. ఈ చిత్రానికి ఎల్‌వి ప్రసాద్ సోదరుడు అక్కినేని సంజీవి దర్శకుడు. అప్పటికి ఎడిటింగ్ శాఖలో పలు చిత్రాలకు సారథ్యం నిర్వహించిన ఈయన -నాటకాల రాయుడు చిత్రానికి దర్శకత్వం వహించి ఉన్నారు. అందుకే -అక్కాచెల్లెలు చిత్రానికి సంజీవిని దర్శకుడిగా ఎన్నుకున్నారు నిర్మాత రాజేంద్రప్రసాద్. ఆ తరువాత వీరు ‘ధర్మదాత’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1969 ఫిబ్రవరి 28న విడుదలైన తమిళ చిత్రం -అక్కై-తంగై. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ద్వితీయ శ్రేణి ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. ఈ చిత్రంలో షావుకారు జానకి, మేజర్ సౌందర్‌రాజన్, జయశంకర్, కెఆర్ విజయ, నాగేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ పూవై కృష్ణన్, దర్శకత్వం ఎంఏ తిరుముగమ్, సంగీతం శంకర్‌గణేష్, నృత్యం చిన్ని సంపత్, నిర్మాత శాండో చిన్నప్పదేవర్ (ఎంఎంఏ). తెలుగులో రీమేక్‌గా వచ్చిన అక్కా చెల్లెలు చిత్రం 1970 జనవరి 1న విడుదలై 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కథ పూవై కృష్ణన్; మాటలు ఆచార్య ఆత్రేయ; సంగీతం కెవి మహదేవన్; నృత్యం చిన్ని, సంపత్; కళ జివి సుబ్బారావు; కూర్పు టివి బాలు; స్టంట్స్ రాఘవులు; ఛాయాగ్రహణం ఎం వెంకటరత్నం; నిర్మాత వి కృష్ణప్రసాద్; దర్శకత్వం ఎ సంజీవి.
***
ఓ పట్టణంలో పేరున్న న్యాయమూర్తి రామచంద్రరావు(ఎఎన్‌ఆర్). అతని తల్లి జయమ్మ (శాంతకుమారి), తమ్ముడు వేణు (కృష్ణ). వారి ఆప్తుడు, కోర్టులో గుమస్తా ధర్మయ్య (గుమ్మడి), అతని కుమారుడు భాను (పద్మనాభం). ఫొటోస్టూడియో అధినేత అల్లు రామలింగయ్య, కూతురు సరోజ (రమాప్రభ). ఊళ్లో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయ (విజయనిర్మల)ను పట్నంలో న్యాయవాద విద్య చదివించే అమాయకపు, నిజాయితీ యువతి జానకి (షావుకారు జానకి). పట్నంలో చదువుతున్న వేణు, విజయ ప్రేమించుకుంటారు. జానకి, నిజాయితీ, మంచితనం నచ్చిన రామచంద్రరావు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అంతకుముందు ఓ స్ర్తిని హత్య చేస్తున్న వ్యక్తిని విజయ అనుకోకుండా చూస్తుంది. తరువాత అక్కకు కాబోయే భర్త, తనకు కాబోయే బావే.. తానుచూసిన హంతకుడని గ్రహిస్తుంది. అక్క పెళ్లి జరిగాక, అతనిని కోర్టులో దోషిగా ఆరోపణ చేస్తుంది. అన్న తరపున వేణు లాయర్‌గా నిలబడతాడు. కేసును పరిశోధించి, తన అన్న రామచంద్రరావు హంతకుడు కాదని నిరూపిస్తాడు. తన అన్నతోపాటు జన్మించిన కవల సోదరుడు రాజా(ఏయన్నార్), తోటమాలి (ఆనంద్‌మోహన్) ఆ దారుణానికి పాల్పడ్డారని నిరూపిస్తాడు. అన్న నిర్దోషిగా విడుదలవ్వడంతో, వేణు -విజయల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
***
చిత్రంలో మాడా, నాగయ్య, రాజ్‌బాబు, సూర్యాకాంతం, వెంకటేశ్వరరావు, వైవి రాజు, విజయలలిత ఇతర పాత్రలు పోషించారు. దర్శకులు సంజీవి తన ప్రతిభతో తమిళ చిత్రానికి కొద్దిమార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టు సన్నివేశాలను తీర్చిదిద్దారు. న్యాయమూర్తిగా ఏయన్నాఆర్‌ను పరిచయం చేస్తూ.. తరువాత తీర్పుకోసం మదనపడటం; ధర్మన్నతో ‘వందమంది అపరాధులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు’ అని తండ్రి సందేశం గుర్తుకు తెచ్చుకోవటం; తల్లి సలహాతో దేవాలయానికి వెళ్లి అక్కడ జానకిని చూసి ఆమె చొరవ, కష్టం తెలుసుకుని ముచ్చటపడటం; దానిగురించి ధర్మన్నతో చర్చించటం; ఆమెకు చాటుగా ధర్మన్న ద్వారా సాయపడటం; చెల్లెలు విజయ, జానకి ఇంటికి స్నేహితులతో వచ్చినపుడు చీర, పసుపు కుంకుమలిచ్చి వారిరువురి ‘ఉత్తమ సంస్కారం’ మెచ్చుకుంటున్నానని జానకితో చెప్పటం; అక్కకు పెళ్లి నిశ్చయమయ్యాక.. ఆ వరుడే తాను చూసిన హంతకుడని విజయ చెప్పి పెళ్లి రద్దు చేసుకోమనటం; దానికి జానకి స్పందన, వేణుకూడా అక్కడే వుండటం; అక్క పెళ్లి జరిగాక ఇంటినుంచి వెళ్ళిపోదలచిన విజయ.. రామచంద్రరావు (బావగారి) మాటకు కట్టుబడి ఇంటిలో ఉండటం; విజయ చూసిన హత్యకు కారణం భానుపై ఆరోపించగా.. విజయ కోర్టుకు వెళ్తుండగా జానకి ఆమెను ఆశీర్వదించటం; నీ భర్తకు వ్యతిరేకంగా వెళ్తున్నానని విజయ వ్యక్తం చేసే బాధ; ‘నేను వరలక్ష్మీవ్రతం చేసుకున్నాను. నా భర్త ఆశీస్సులందించిన కుంకుమతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను’ అని జానకి చెప్పటం; అలాగే రామచంద్రరావుపై ముద్దాయిగా విజయ నింద మోపటం; విజయను తన తలపై చేయిపెట్టి ఆమాట చెప్పమని రామచంద్రరావు అడగటం.. ఇలా గంభీరమైన సన్నివేశాలు, దాంతోపాటు డ్యాన్సర్ ఆశతో నృత్య గీతాలు అక్కినేని, విజయలలితలపై చిత్రీకరించటం; అక్కినేనిని బందీగా తీసుకుని వెళ్తున్నపుడు ‘ఇది మాటకు మనసుకు పోరాటం తల్లీ’ అనే పాట.. వేణు ఎంతో శ్రమపడి ఆనందమోహన్‌ను బంధించటంలాంటి సన్నివేశాలతో చిత్రాన్ని ఎంతో సమర్ధంగా తీర్చిదిద్దారు.
చిత్రంలో న్యాయమూర్తి రామచంద్రరావుగా అక్కినేని ఎంతో గాంభీర్యమైన పాత్రను వైవిధ్యంగా, సరళంగా, ప్రశంసనీయ నటనతో చూపించారు. అక్కినేని, జానకిల మధ్య యుగళగీతానికి అవకాశంలేని ఈ కథలో వారి తొలిరేయి గీతం.. పాట పాడమని జానకిని అక్కినేని అడగడం.. దానికామె తన కథతోపాటు జానపద గీతం -పాండవులు పాండవులు తుమ్మెద (గానం: పి సుశీల, రచన: ఆత్రేయ) అంటూ తమాషా స్టెప్పులతో అలరించటం, దానికి ఏయన్నార్ చిరునవ్వుతో స్పందన అద్భుతంగా చూపించారు. కోర్టు సన్నివేశాలలో.. విజయతో వాదించే వ్యవహార శైలిలో ఎంతో సంయమనంతో యుక్తమైన నటనను ప్రదర్శించారు ఏయన్నార్. అలాగే రాజాగా విజయలలితతో నృత్యగీతాలు -చకచకలాడే పడుచుంది (గానం: పి సుశీల, రచన: ఆరుద్ర), -సంతోషం చేసుకుందాం (గానం: పి సుశీల, రచన: ఆరుద్ర)లో ఆమెతో స్పీడుగా స్టెప్పులువేసి అలరించారు. రమాప్రభను కారులో ఛేజ్‌చేసి ఆమె ఇంటిలో చంపబోవటం, అలాగే రామచంద్రరావు ఇంటిలో డబ్బు దొంగతనం చేస్తూ.. భార్య జానకి, తల్లి, మరదలు విజయను గాయపరచి, వారికి రామచంద్రరావుపట్ల వ్యతిరేక అభిప్రాయం కలిగేలా నటించి, చివరలో అన్నవద్ద పశ్చాత్తాపం కలిగిన ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించారు.
అలాగే వేణుగా కృష్ణ మంచి నటన ప్రదర్శించారు. విజయనిర్మలతో రెండు యుగళ గీతాల్లో -చిటాపటా చినుకులతో, -శ్రీమతి ఏమన్నా శ్రీవారు తానతందాన (గానం: ఘంటసాల, పి సుశీల; రచన: ఆత్రేయ) సరదా స్టెప్పులతో డాన్స్ చేసి అలరించారు. అన్నగారిపట్ల నిబద్ధత, చివరలో ఆనందమోహన్‌తో తలపడడంలో సాహసం.. పాత్రోచితంగా ఆకట్టుకునేలా ప్రదర్శించారు. అమాయకంగా ఉంటూనే ఎంతో తెలివి, నిబ్బరం, ధైర్యం, నిజాయితీ కలిగిన పాత్రలో షావుకారు జానకి మంచి నటన ప్రదర్శించారు. తనను మెచ్చిన వ్యక్తితో వివాహం జరగబోయే సందర్భంలో ‘అతడు హంతకుడు పెళ్లివద్దని’ సోదరి విజయ వాదించినా.. ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయవౌతాయి. నా అదృష్టంపై నాకు నమ్మకం ఉంది’ అని చెప్పే సందర్భంలో పాత్రోచిత నటన చూపించారు. అలాగే, ‘నా పెళ్లి చెడిపోతే నీకు పెళ్లికాదు’ అని చెల్లి విజయను అనునయించి, ‘ఈ విషయం మన ముగ్గురిమధ్యే ఉండాలని’ వేణును కోరటం; భర్తవద్ద హుషారైన జానపద గీతం -పాండవులు, పాండవులు తుమ్మెద’కు వెరైటీ స్టెప్పులతో అభినయం, నునుసిగ్గు.. ఇలా ప్రశంసనీయ నటనతో పాట, సినిమా ప్రజలకు గుర్తుండిపోయేలా షావుకారు జానకి చేయగలిగారు. ఆ గీతం నేడూ ఓ అలరించే చిరపరిచిత గేయంగా నిలవటం విశేషాంశం. ఇక విజయగా విజయనిర్మల తాను నమ్మిన న్యాయం, చట్టంపట్ల నిబద్ధత, అటు సోదరికి, ఇటు బావగారికి, ప్రియునికి మధ్య ఎదురుపడిన సవాళ్లను, పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే యువతిగా, తన బావగారి తలపై చేయిపెట్టి అతడే హంతకుడని చెప్పే సన్నివేశంలో ఎంతో సంయమనంతోకూడిన భావోద్వేగాన్ని ప్రదర్శించారు. ఇలా కోర్టు, ఇంటిలోపలి సన్నివేశాలను ఎంతో రమణీయంగా విజయనిర్మల తన నటనలో చూపించారు. అల్లు రామలింగయ్య, రమాప్రభ, పద్మనాభం పాత్రలతో హాస్యం కూర్చటం, పద్మనాభం, రమాప్రభలపై -ఓ పిల్లా పటపటలాడిస్తా (గానం: ఘంటసాల, పి సుశీల; రచన: ఆత్రేయ), ఏయన్నార్ బంధీగా పోలీసులతో వెళ్తున్నపుడు -ఇది మాటకి మనసుకు పోరాటం (గానం: ఘంటసాల, రచన: ఆత్రేయ) అద్భుతంగా చిత్రీకరించారు.
చిత్రంలో కృష్ణ, పద్మనాభానికి బ్యాక్‌గ్రౌండ్ అన్ని పాటలూ ఘంటసాలే పాడటం ఓ విశేషం. కెవి మహదేవన్ స్వరాలు మెప్పించేలా సాగాయి. అక్కాచెల్లెలు చిత్రం విజయం సాధించి, ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి