మెయిన్ ఫీచర్

మగాళ్లపై హింస ఆపండి బాబోయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గళం విప్పుతున్న పురుష హక్కుల సంఘాలు

మహిళల భద్రత కోసం ఉద్దేశించిన చట్టాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నందున మగవారిపై నానాటికీ తప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోందని పురుష హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గృహహింస, వరకట్న నిషేధ చట్టం, భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 498ఎను ఆసరాగా చేసుకుని భర్తలపై తప్పుడు కేసులు పెడుతూ మానసిక హింసకు గురి చేస్తున్నారని మహారాష్టక్రు చెందిన ‘పురుష హక్కుల సంరక్షణ సమితి’ (పిహెచ్‌ఎస్‌ఎస్) నిరసన వ్యక్తం చేస్తోంది. కొల్హాపూర్‌లో ఇటీవల జరిగిన పురుష హక్కుల సంఘాల జాతీయ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ, మగాళ్ల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. మహిళలపై హింసకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్న మహారాష్టల్రోనే పురుష హక్కుల సంఘాలు ఇటీవలి కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేయడం గమనార్హం. మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన ఐపిసి సెక్షన్ 354ను తక్షణం సవరించాలని పురుష హక్కుల సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళలపై వేధింపుల నివారణకు ఎలాంటి చట్టాలున్నాయో, పురుషుల శ్రేయస్సు కోసం కూడా అటువంటి శాసనాలు చేయాలని పురుష హక్కుల జాతీయ సదస్సు డిమాండ్ చేసింది. ఏకపక్ష నిర్ణయంతో భార్య ఇల్లువీడి పుట్టింటికి వెళ్లిపోతే అటువంటి భర్తలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ఈ సదస్సులో తీర్మానించారు. గృహహింస నిరోధక చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో వాస్తవాలను విచారించేందుకు దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పురుష హక్కుల సంఘాల నేతలు కోరుతున్నారు. కుటుంబ న్యాయస్థానాలకు అనుబంధంగా ఈ నిఘా కేంద్రాలు పనిచేస్తే తప్పుడు కేసుల సంఖ్య తగ్గుతుందని, భర్తలపై హింస నివారణ అవుతుందని వారు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కేసులు వేసిన భార్యలు అర్ధంతరంగా ఇల్లు వీడి వెళ్లిపోతున్నారని, కొందరు పుట్టింటికి చేరుకుని నష్టపరిహారం కోసం భర్తలపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే భర్తలను ఆదుకునేందుకు అత్తింటివారి నుంచి లేదా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని పురుష హక్కుల సంఘ నేతలు సూచిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం భార్యకు భరణం ఇప్పించే ఐపిసిలోని సెక్షన్ 125ను వెంటనే సవరించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సెక్షన్‌ను పురుషులకు కూడా వర్తింపజేయాలని, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే భర్తలకు అండగా ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరుతున్నారు. భార్య కారణంగా భర్త మానసిక వేదనకు గురైతే తీవ్ర నేరంగా పరిగణించాలంటున్నారు. వేధింపులకు సంబంధించి మహిళలు ఫిర్యాదు చేస్తే ఐపిసి సెక్షన్ 354 ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారని, ఇవే కారణాలతో భర్తలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆడ,మగ సమానమే’ అన్న భావన నిజం కావాలంటే- భర్తల విషయంలో చట్టపరమైన వివక్ష అంతం కావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మానసిక వేధింపులకు సంబంధించి స్ర్తి,పురుషులకు ఒకే చట్టాన్ని అమలు చేయాలంటున్నారు.
మూడు దశాబ్దాల క్రితమే..
పురుషుల హక్కులను కాపాడాలని కోరుతూ మన దేశంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది రామ్ ప్రకాష్ పురుషుల హక్కుల సాధనకు 1988లోనే ఉద్యమాన్ని ప్రారంభించారు. వరకట్న నిషేధ చట్టం కింద నమోదవుతున్న తప్పుడు కేసుల వల్ల ఎందరో భర్తలు మానసిక వేదన అనుభవిస్తున్నారని ఆయన అప్పట్లో ఆందోళన ప్రారంభించారు. కాలక్రమంలో 1996లో ‘పురుష హక్కుల సంరక్షణ సమితి’ మహారాష్టల్రో ఆవిర్భవించింది. వేధింపుల బారిన పడే భర్తలను ఆదుకునేందుకు 2003లో బెంగళూరులో ఓ ‘హెల్ప్‌లైన్’ను ప్రారంభించారు. 2007లో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ ఏర్పాటయ్యాక దేశవ్యాప్తంగా పురుష హక్కుల సంఘాల ఉద్యమాలు విస్తరిస్తున్నాయి. 20 రాష్ట్రాల పరిధిలో 50 నగరాల్లో ఈ సంస్థ ఆందోళన కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తోంది. గృహహింస, విడాకులు, వరకట్నం, లైంగిక వేధింపుల కేసుల్లో తప్పుడు కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ‘సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్’ నేతలు ఆరోపిస్తున్నారు. ఐపిసిలోని సెక్షన్ 498ఎ దుర్వినియోగం అవుతున్నట్లు సుప్రీం కోర్టు సైతం ఇటీవల వ్యాఖ్యానించిందని వారు గుర్తు చేస్తున్నారు. తప్పుడు కేసులతో జైళ్లపాలవుతున్న భర్తలను కాపాడేందుకు సెక్షన్ 498ఎను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మానసిక వేధింపులు, తప్పుడు కేసుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న పురుషుల సంఖ్య అధికంగా ఉంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం 2014లో ఆత్మహత్య చేసుకున్న భర్తల సంఖ్య 59,744గా, భార్యల సంఖ్య 27,064గా ఉంది. గత ఏడాది అవివాహిత పురుషులు 17,999 మంది, అవివాహిత మహిళలు 9,820 మంది ఆత్మహత్య చేసుకున్నారు. విడాకులు పొందిన వారిలో 551 మంది భర్తలు, 417 మంది భార్యలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విడిగా ఉంటున్నవారిలో 599 మంది పురుషులు, 316 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, విడాకులు, ఇతర కారణాలతో 2014లో దేశవ్యాప్తంగా 89,129 మంది పురుషులు, 42,521 మంది స్ర్తిలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
*